మారుతి అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి?
కొంత మందికి ఎదురుచూడకుండానే అవకాశం తలుపుతడుతూ ఉంటుంది. అయితే దాన్ని వినియోగించుకోవడంలోనే కొంత మంది తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంటుంది.;
కొంత మందికి ఎదురుచూడకుండానే అవకాశం తలుపుతడుతూ ఉంటుంది. అయితే దాన్ని వినియోగించుకోవడంలోనే కొంత మంది తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఇప్పుడు ఇదే పరిస్థితిని దర్శకుడు మారుతి ఎదుర్కొంటున్నారు. `పక్కా కమర్షియల్` డిజాస్టర్ తరువాత కొంత విరామం తీసుకున్న మారుతి ఊహించని విధంగా గోల్డెన్ ఆఫర్ కొట్టేశాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్ట్ చేస్తున్న హారర్ కామెడీ `ది రాజా సాబ్`.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ డ్యుయెల్ రోల్ పోషిస్తున్నారు. తాతగా, మనవడిగా రెండు విభిన్నమైన పాత్రల్లో ప్రభాస్ నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ 2022లో మొదలైంది. వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో ప్రభాస్ బిజీగా ఉండటం వల్ల డేట్స్ కుదిరినప్పడల్లా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్‌లో కొన్ని కీలక ఘట్టాల చిత్రీకరణ మిగిలి ఉందని ఇన్ సైడ్ టాక్.
మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ మూవీలోకి కీలక పాత్రల్లో మురళీశర్మ, బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, జరీనా వాహెబ్‌తో పాటు వరలక్ష్మీ శరత్‌కుమార్, బ్రహ్మానందం, యోగిబాబు, జిస్సూ సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార ఓ ప్రత్యేక గీతంలో మెరవబోతోంది. ఇప్పనటికే బాలీవుడ్ శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్‌ని భారీ మొత్తానికి అమ్మేశారు. అయినా ఇప్పటి వరకు రిలీజ్ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు.
దీంతో ప్రభాస్ అభిమానులు మేకర్స్‌తో పాటు డైరెక్టర్‌పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్‌లు చేస్తున్నారు. వీఎఫ్ ఎక్స్ వర్క్ కారణంగానే `ది రాజా సాబ్` రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ టీజర్‌ని మేలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఈ సినిమాకు ఇంత వరకు ప్రభాస్ డబ్బింగ్ చెప్పకపోవడంతో అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మారుతికి పాన్ ఇండియా స్టార్ అయితే దొరికాడు కానీ రెండేళ్లుగా సినిమా బయటికి రాకపోవడంతో మారుతి అనుకున్నదొకటి అయ్యింది మరొకటని ఇండస్ట్రీ వర్గాలు వాపోతున్నాయి.