అల్లు శిరీష్ పెళ్లి సంద‌డి.. మొద‌టి శుభ‌లేఖ మెగా మావ‌య్య‌కే

యువ‌హీరో అల్లు శిరీష్ పెళ్లి వార్త ప్రస్తుతం మెగా - అల్లు అభిమానుల్లో ఆస‌క్తిక‌ర టాపిక్. గత కొంతకాలంగా శిరీష్ ప్రేమ‌ పెళ్లి గురించి చాలా ముచ్చ‌ట్లు వినిపిస్తున్నాయి.;

Update: 2026-02-15 19:27 GMT

యువ‌హీరో అల్లు శిరీష్ పెళ్లి వార్త ప్రస్తుతం మెగా - అల్లు అభిమానుల్లో ఆస‌క్తిక‌ర టాపిక్. గత కొంతకాలంగా శిరీష్ ప్రేమ‌ పెళ్లి గురించి చాలా ముచ్చ‌ట్లు వినిపిస్తున్నాయి. శిరీష్- నైనిక రెడ్డి జంట పెళ్లికి మార్చి 6న ముహూర్తం కూడా నిర్ణ‌యించారు. నెల‌రోజుల ముందే ప్రీవెడ్డింగ్ సెలబ్రేష‌న్స్ మొద‌ల‌య్యాయి. ముఖ్యంగా శిరీష్ - నైనిక జంట త‌మ స్నేహితుల కోసం దుబాయ్ లో గ్రాండ్ గా బ్యాచిల‌ర్ పార్టీలో సంద‌డి చేసారు. ఈ పార్టీకి అల్లు అర్జున్ - స్నేహారెడ్డి జంట కూడా అటెండ‌యిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

అల్లు వారి పెళ్లిలో అస‌లైన అంకం ఇప్పుడు మొద‌లైంది. ఎట్ట‌కేల‌కు పెళ్లికి ఆహ్వాన ప‌త్రిక‌ల్ని ముద్రించి అతిథులను ఆహ్వానిస్తున్నారు. తొలి శుభ‌లేఖ‌ను అల్లు శిరీష్‌ స్వయంగా త‌న మావ‌య్య మెగాస్టార్ చిరంజీవికి ఆయ‌న‌ ఇంటికి వెళ్లి అందించారు. ఆ స‌మ‌యంలో శిరీష్ తో పాటు, అల్లు అర‌వింద్ కూడా ఉన్నారు. ఈ శుభ స‌మ‌యంలో చిరంజీవి- సురేఖ దంప‌త‌లు కాబోయే వ‌రుడు శిరీష్ కి త‌న బ్లెస్సింగ్స్ అందించారు. ప్ర‌స్తుతం చిరంజీవికి అందించిన శుభ‌లేఖ సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా మారుతోంది.

ఇటీవల చిన్న షోల్డర్ సర్జరీ అనంతరం చిరంజీవి చేతికి స్లింగ్‌తో కనిపించారు. గత కొంతకాలంగా చిన్నపాటి భుజం నొప్పి సమస్యకు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ప్ర‌స్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని సమాచారం. వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకే ఆయన షూటింగ్స్‌కు కొద్ది రోజులు విరామం ప్రకటించారు. అయినా కానీ, అల్లు శిరీష్‌, అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు వచ్చేసరికి ఆయన ఎంతో ఉత్సాహంగా వారితో గడిపారు. వరుసగా మెగా కుటుంబంలో శుభకార్యాలు జరుగుతుండటంతో అభిమానులు ఖుషీగా ఉన్నారు. ఇటు రామ్ చరణ్ కవలల నామకరణం, అటు శిరీష్ పెళ్లి వేడుకలతో మెగా లోగిలి సందడిగా మారనుంది.

అల్లు శిరీష్ పెళ్లికి సంబంధించి అందుతున్న సమాచారం ప్రకారం... మెగా - అల్లు కుటుంబాలు ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. అల్లు అరవింద్ ఇప్పటికే తన సన్నిహితులకు , ఇండస్ట్రీ పెద్దలను ఆహ్వానిస్తున్నారు. పెళ్లి వేదిక వివ‌రాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్ లేదా ఉదయ్‌పూర్ లోని ఒక లగ్జరీ ప్యాలెస్‌లోనా.. లేదు హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే రిసెప్షన్ మాత్రం హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ లేదా హెచ్.ఐ.సి.సి లో గ్రాండ్‌గా జరగనుందని స‌మాచారం.

ఈ పెళ్లికి మెగా- అల్లు ఫ్యామిలీల నుండి అందరూ హాజరుకానున్నారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా హాజ‌ర‌వుతారు. రామ్ చరణ్ - ఉపాసన, అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి, వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక కొణిదెల ఇత‌ర కుటుంబ స‌భ్యుల సంద‌డితో వేదిక వ‌ర్ణ‌రంజితం కానుంది.

రాజకీయ ప్రముఖుల‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, ఇతర కీలక రాజకీయ నాయకులకు ఆహ్వానాలు అందనున్నాయని స‌మాచారం. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ ఇత‌ర సీనియ‌ర్ స్టార్లు అటెండ‌య్యేందుకు అవ‌కాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి, అర‌వింద్‌, అల్లు అర్జున్‌లకు ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల బాలీవుడ్ నుండి కూడా కొందరు ప్రముఖులు ఈ పెళ్లికి వచ్చే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో జరగబోయే రిసెప్షన్‌కు సుమారు 3000 నుండి 5000 మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంద‌ని స‌మాచారం. అభిమానుల కోసం కూడా ప్రత్యేకంగా ఒక విందు ఏర్పాటు చేసే ఆలోచనలో అల్లు అరవింద్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.



Tags:    

Similar News