రాజా సాబ్ బాక్సాఫీస్ టార్గెట్.. అసలు ఎంత రావాలి?
ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ అక్షరాలా 350 కోట్ల రూపాయలు.;
ప్రభాస్ సినిమా అంటేనే బాక్సాఫీస్ దగ్గర అంచనాలు భారీగా ఉంటాయి. కానీ మారుతితో సినిమా అనగానే మొదట్లో చాలామంది ఇదొక సింపుల్ ఎంటర్టైనర్ అని ఫిక్స్ అయ్యారు. ఫ్యాన్స్ ను నవ్వించడానికి, ప్రభాస్ లోని వింటేజ్ కోణాన్ని చూపించడానికి చేస్తున్న ప్రయత్నం అని అంతా అనుకున్నారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ప్రాజెక్ట్ స్వరూపమే మారిపోయింది. మొదట్లో ఉన్న అంచనాలకు, ఇప్పుడున్న హైప్ కు అసలు పొంతనే లేదు.
షూటింగ్ జరుగుతున్నప్పుడు బయటకు వచ్చిన అప్డేట్స్ చూశాక గానీ అసలు విషయం అర్థం కాలేదు. ఇది కేవలం కామెడీ సినిమా మాత్రమే కాదు, ఇందులో హారర్ ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని తెలిశాక సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చిన్నగా ప్లాన్ చేసిన సినిమా కాస్తా పాన్ ఇండియా స్థాయిలో ఒక విజువల్ వండర్ గా తయారైంది. దానికి తగ్గట్టుగానే మేకింగ్ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని అర్థమవుతోంది.
ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ అక్షరాలా 350 కోట్ల రూపాయలు. ఒక హారర్ కామెడీ జానర్ సినిమాకు ఇంత భారీ మొత్తం ఖర్చు చేశారంటే అవుట్ పుట్ మీద మేకర్స్ కు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ మార్కెట్ రేంజ్, గ్లోబల్ ఆడియన్స్ టేస్ట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను భారీ స్థాయిలో మలిచారు.
ఇంత బడ్జెట్ పెట్టినప్పుడు రికవరీ ఎలా ఉంటుందనే సందేహం రావడం సహజం. అక్కడే మన డార్లింగ్ క్రేజ్ ఏంటో బయటపడింది. సినిమా థియేటర్లలోకి రాకముందే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే సగం బడ్జెట్ వెనక్కి వచ్చేసింది. ఆడియో రైట్స్ టీ సిరీస్ దక్కించుకోగా, డిజిటల్ ఇంకా శాటిలైట్ హక్కులను జియో హాట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకుంది. దీంతో రిలీజ్ కు ముందే నిర్మాత సగం సేఫ్ అయ్యారు.
ఇక బిజినెస్ విషయంలో నిర్మాత తీసుకున్న నిర్ణయం కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా హక్కులను ఎవరికీ అమ్మకుండా, నిర్మాతలే స్వయంగా అన్ని భాషల్లోనూ, అన్ని ఏరియాల్లోనూ సొంతంగా విడుదల చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ల దగ్గర అడ్వాన్స్ లు తీసుకుని, వాళ్లకు కొంత కమిషన్ ఇచ్చే పద్ధతిని ఫాలో అవుతున్నారు. సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫైనల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సేఫ్ జోన్ లోకి రావాలంటే వరల్డ్ వైడ్ గా 400 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. అంటే షేర్ పరంగా చూస్తే దాదాపు 200 కోట్లు రాబట్టాలి. ప్రభాస్ స్టార్ డమ్ కు, సంక్రాంతి సీజన్ కలిసొస్తే ఇదేమీ పెద్ద టార్గెట్ కాదు. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మొదటి వారంలోనే ఈ మార్క్ ను దాటేసే అవకాశం ఉంది. చూడాలి మరి రాజా సాబ్ బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేస్తారో.