అథ్లెట్ల కలలకు రెక్కలు తొడిగిన ప్రభాస్!

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ వెండితెరపైనే కాదు. నిజ జీవితంలోనూ విశాల హృదయాన్ని చాటుకుంటున్నారు.

Update: 2026-05-13 08:34 GMT

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ వెండితెరపైనే కాదు. నిజ జీవితంలోనూ విశాల హృదయాన్ని చాటుకుంటున్నారు. `బాహుబలి` సినిమా కోసం డార్లింగ్ ఎంతగా క‌ష్ట‌ప‌డ్డారో తెలిసిందే. ఆ సినిమా సాధించిన ఘన విజయం అందరికీ విధిత‌మే. అయితే ఆ సినిమా చిత్రీకరణ ముగిసిన తర్వాత ప్రభాస్ చేసిన గొప్ప కార్యం ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశమైంది. క్రీడల పట్ల మక్కువ ఉండి సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్న యువ అథ్లెట్లకు ప్ర‌భాస్ అండగా నిలిచారు. `బాహుబలి` సినిమాలో శివుడు , అమరేంద్ర బాహుబలి పాత్రల కోసం ప్రభాస్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది.

ఇందుకోసం ఆయన లక్షల రూపాయల ఖర్చుతో అత్యున్నత ప్రమాణాలు కలిగిన జిమ్ పరికరాలను ప్రత్యేకంగా విదేశాల నుండి తెప్పించుకున్నారు. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ ఖరీదైన పరికరాలను తన వద్దే ఉంచుకోకుండా? క్రీడల్లో రాణించాలనుకునే వర్ధమాన అథ్లెట్ల కోసం వాటిని విరాళంగా ఇచ్చి ప్రభాస్ తన గొప్పతనాన్ని చాటుకున్నారు. ప్రభాస్ విరాళంగా ఇచ్చిన ఈ పరికరాలు ప్రస్తుతం అనేకమంది యువ క్రీడాకారుల శిక్షణకు ఉపయోగపడుతున్నాయి. ఖరీదైన జిమ్‌లకు వెళ్లి శిక్షణ పొందే ఆర్థిక స్తోమత లేని అథ్లెట్లకు, ప్రభాస్ అందించిన అంతర్జాతీయ స్థాయి పరికరాలు ఒక వరంగా మారాయి.

తన వ్యక్తిగత అవసరాల కోసం కొనుగోలు చేసిన వస్తువులను సమాజ హితం కోసం మళ్లించడం ద్వారా ప్రభాస్ నిజమైన మ్యాన్ ఆఫ్ ది పీపుల్ అని అనిపించుకున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు వాడిన వస్తువులను వేలం వేయడం లేదా భద్రపరుచుకోవడం చూస్తుంటాం. కానీ ప్రభాస్ మాత్రం అవి మరొకరి భవిష్యత్తుకు ఉపయోగ పడాలని ఆకాంక్షించారు. క్రీడాకారుల కష్టాలను గుర్తించి వారికి అవసరమైన మౌలిక వసతులను కల్పించడంలో తన వంతు పాత్ర పోషించడం విశేషం. ఈ చర్య వల్ల ఆయన కేవలం సినిమా అభిమానులనే కాకుండా క్రీడా ప్రేమికుల మనసులను కూడా గెలుచుకున్నారు.

ప్రభాస్ చేస్తున్న ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆయన నిరాడంబరతకు అద్దం పడుతున్నాయి. ఏ ప్రచారం కోరుకోకుండా నిశ్శబ్దంగా సహాయం చేయడం ప్రభాస్ నైజం. `బాహుబలి` పరికరాల విరాళం వెనుక ఉన్న ఉద్దేశ్యం క్రీడలను ప్రోత్సహించడమే కాదు. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదనే స్ఫూర్తిని యువతలో నింపడమేనని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. ప్రభాస్ కేవలం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాదు. సామాజిక బాధ్యతలోనూ ముందుంటున్నారు. అథ్లెట్ల కలలను నిజం చేసే దిశగా ఆయన వేసిన ఈ అడుగు ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఆయన అందించిన ఆ పరికరాలతో రేపటి తరం క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై మెరిస్తే అదే ప్రభాస్‌కు నిజమైన కానుక. వెండి తెరపై `బాహుబలి`గా అలరించిన ఆయన నిజ జీవితంలోనూ మహాబలి అనిపించుకుంటున్నారు.

Tags:    

Similar News