లీగల్ బ్యాటిల్‌పై నోరు విప్పిన రకుల్ భర్త జాకీ భగ్నానీ
ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత.. నటి రకుల్ ప్రీత్ సింగ్ భర్త అయిన జాకీ భగ్నానీ తన నిర్మాణ సంస్థపై వస్తున్న లీగల్ నోటీసుల వార్తలపై స్పందించారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత.. నటి రకుల్ ప్రీత్ సింగ్ భర్త అయిన జాకీ భగ్నానీ తన నిర్మాణ సంస్థపై వస్తున్న లీగల్ నోటీసుల వార్తలపై స్పందించారు. మల్టీప్లెక్స్ దిగ్గజం పివిఆర్ ఐనాక్స్ పిక్చర్స్.. తన తండ్రి వాషు భగ్నానీపైనా, సొంత నిర్మాణ సంస్థ `పూజా ఎంటర్‌టైన్‌మెంట్` పైనా చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోందంటూ వస్తున్న వార్తా కథనాలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ ప్రచారంలో ఉన్నవన్నీ కేవలం అవాస్తవాలని స్పష్టం చేశారు.
గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. పివిఆర్ ఐనాక్స్- పూజా ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య మూడు పెద్ద సినిమాల (మిషన్ రాణిగంజ్, గణపత్, బడే మియాన్ ఛోటే మియాన్) థియేట్రికల్ పంపిణీ ఒప్పందంలో భారీ ఆర్థిక వివాదం నడుస్తోందని ప్రచారం జరిగింది. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో దాదాపు 50 కోట్ల వరకు బకాయిలు నిలిచిపోయాయని.. ఈ సెటిల్‌మెంట్ కోసం ముంబైలోని కొన్ని లగ్జరీ ప్రాపర్టీల విషయంలో చర్చలు కూడా జరిగాయని... వివాదం సర్దుమణగకపోతే పివిఆర్ కోర్టుకు వెళ్లనుందని కథనాలు వచ్చాయి.
అయితే ఈ పుకార్లపై పివిఆర్ ఐనాక్స్ పిక్చర్స్ కూడా స్పందిస్తూ అధికారిక వివరణ ఇచ్చింది. మీడియాలో వస్తున్న వార్తలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, భగ్నానీ కుటుంబంతో తమకు ఎంతో కాలంగా మంచి వృత్తిపరమైన సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. మాలో మేము బాగానే ఉన్నాం. ప్రతిదీ చర్చించుకుంటాము. అయితే మా వ్యాపారవాణిజ్యాల్లో ఏం జరుగుతుందో బహిరంగంగా చెప్పాల్సిన పని లేదని ఐనాక్స్ తన ప్రకటనలో వెల్లడించింది. అలాగే ఈ వ్యవహారాలను చక్కగా హ్యాండిల్ చేసినందుకు గానూ జాకీ భగ్నానీ వృత్తిపరమైన నిబద్ధతను పివిఆర్ ప్రశంసించింది.
మరోవైపు పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఇప్పటికే మరొక విభిన్నమైన లీగల్ బ్యాటిల్ కారణంగా వార్తల్లో నిలిచింది. దర్శకుడు డేవిడ్ ధావన్ త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్న కామెడీ చిత్రం `హై జవానీ తో ఇష్క్ హోనా హై` మ్యూజిక్ రైట్స్ వివాదంపై పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బాంబే హైకోర్టులో ఏకంగా 400 కోట్ల దావా వేసింది. తమ 1999 నాటి హిట్ చిత్రం `బీవీ నెం.1` లోని పాపులర్ పాటలు `చునరి చునరి`, `ఇష్క్ సోనా హై..`లను సరైన అనుమతులు లేకుండా ఈ కొత్త సినిమాలో వాడుకున్నారని వారు టిప్స్ ఇండస్ట్రీస్, రమేష్ తౌరానీ, డేవిడ్ ధావన్‌లపై కేసు నమోదు చేశారు.
వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో తప్పుడు వార్తలను ప్రచారం చేసి తమ సంస్థ గుడ్‌విల్‌ను దెబ్బతీయవద్దని.. ఏదైనా వార్తను రాసే ముందు నిజానిజాలు ధృవీకరించుకోవాలని మీడియా మిత్రులకు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు జాకీ భగ్నానీ బ్యానర్ విజ్ఞప్తి చేసింది.