పొంగల్ ఫైట్..రెండు పిల్లులు..ఒక తెలివైన కోతి!
రెండు పిల్లులు ఒక రొట్టె కోసం గొడవ పడుతుంటే ఒక తెలివైన కోతి వచ్చి రొట్టె ఎత్తుకెళ్లినట్టుగా ఉంది కోలీవుడ్ పొంగల్ వార్.;
రెండు పిల్లులు ఒక రొట్టె కోసం గొడవ పడుతుంటే ఒక తెలివైన కోతి వచ్చి రొట్టె ఎత్తుకెళ్లినట్టుగా ఉంది కోలీవుడ్ పొంగల్ వార్. ఈ పొంగల్‌కి విజజ్ఞ్ `జన నాయగన్`తో, శివ కార్తికేయన్ `పరాశక్తి`తో..కార్తీ `వా వతియార్`(అన్నగారు వస్తారు)తో బరిలోకి దిగాలనుకున్నారు. `జన నాయగన్`, పరాశక్తి చుట్టూ సెన్సార్ సమస్యలు తలెత్తడంతో ఇవి రిలీజ్ కావడం కష్టమనే వాదనలు వినిపించాయి. ఫైనల్‌గా సెన్సార్ అడ్డంకులు తొలిగిపోవడంతో శివ కార్తికేయన్ `పరాశక్తి` థియేటర్లలోకి వచ్చేసింది.
విజయ్ `జన నాయగన్` చుట్టూ సెన్సార్ వివాదం అలాగే కంటిన్యూ అవుతుండటంతో సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. ఇదే తరహాలో వివాదాలు అలుముకున్న కార్తి మూవీ `వా వతియార్` చివరికి అవన్నీ తొలగిపోవడంతో అనూహ్యంగా జనవరి 14నే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శివ కార్తికేయన్ `పరాశక్తి` హిందీ వ్యతిరేకోద్యమం నేపథ్యంలో రూపొందిన సినిమా కావడం.. అనుకున్న విధంగా సినిమాని తెరపైకి తీసుకురాలేకపోవడంతో ప్రేక్షకుల్ని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
కార్తి వా వతియార్ పరిస్థిత కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేకపోవడంతో దీనికి కూడా ప్రేక్షకుల ఆదరణ లభించలేదు. దీంతో పొంగల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన `పరాశక్తి` సైడైపోవడం.. సడన్‌గా వచ్చిన కార్తి `వా వతియార్` ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేయడంతో ఈ అవకాశాన్ని మరో హీరో సద్వినియోగం చేసుకుని అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. తనే జీవా. తెలుగులో `రంగం` మూవీతో మంచి పేరు తెచ్చుకున్న జీవా ఆ తరువాత ఆ స్థాయి సక్సెస్‌ని దక్కించుకోలేకపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు తనకు అవకాశం దక్కింది.
జనవరి 15న జీవా నటించిన పొలిటికల్ సెటైరికల్ మూవీ `తలైవర్ తంబి తలైమయిల్` విడుదలైంది. సైలెంట్‌గా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు పొంగల్ బరిలో నిలిచిన సినిమాలని వెనక్కు నెట్టి విజేతగా నిలిచింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే మంచి టాక్‌ని సొంతం చేసుకుని ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. చాలా తక్కువ బడ్జెట్‌తో తీసిని ఈ మూవీ ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద రూ.11 కోట్లకు పైనే వసూళ్లని రాబట్టింది.
సున్నితమైన అంశాన్ని తీసుకుని దానికి వినోదాన్ని జోడించి చెప్పిన తీరు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో పొంగల్ రిలీజ్ సినిమాల్లో జీవా నటించిన ఈ మూవీవైపే ప్రేక్షకుల ఎక్కువగా మొగ్గుచూపుతున్నారట. దీంతో ఇప్పుడు తమిళనాట `తలైవర్ తంబి తలైమయిల్` వైరల్‌గా మారింది. మలయాళ దర్శకుడు నితీష్ సహదేవ్‌తో పాటు అత్యధిక శాతం మలయాళ టెక్నీషియన్‌లే వర్క్ చేశారు. గత కొంత కాలంగా వరుస ఫ్లాపులని ఎదుర్కొంటూ హీరోగా వెనకబడిన జీవా ఈ మూవీతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేశాడని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.