ప్రేక్షకుడిగా వెళ్లి ప్రేమికుడిగా బయటికొస్తారు
ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నుంచి 8 వసంతాలు అనే సినిమా రాబోతుంది.;
మైత్రీ మూవీ మేకర్స్. శ్రీమంతుడు సినిమాతో జర్నీని మొదలుపెట్టిన ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు ఇండియాలోని బిగ్గెస్ట్ ప్రొడక్షన్స్ హౌస్‌ల్లో ఒకటిగా ఉందంటే దానికి కారణం కేవలం భారీ బడ్జెట్ సినిమాలు తీయడం కాదు, బడ్జెట్ తో సంబంధం లేకుండా, ఆర్టిస్టుల స్టార్‌డమ్ ను పట్టించుకోకుండా సినిమాలను, కథలను ఎంచుకుని వాటిని ప్రోత్సహించడమే.
ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నుంచి 8 వసంతాలు అనే సినిమా రాబోతుంది. ఫణీంద్ర నర్సెట్టి ఈ సినిమాకు డైరెక్టర్. గతంలో చాందినీ చౌదరితో మధురం అనే షార్ట్ ఫిల్మ్ చేసి ఆ షార్ట్ ఫిల్మ్ తో అందరినీ విపరీతంగా ఆకట్టుకున్న ఫణీంద్ర నర్సెట్టి ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ గా 8 వసంతాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో అనంతిక సునీల్ కుమార్ లీడ్ లో నటించింది.
జూన్ 20న 8 వసంతాలు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా, ఆ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన కంటెంట్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ చూపించిన కాన్ఫిడెన్స్ చూశాక ఆ అంచనాలు ఇంకాస్త పెరిగాయి.
మైత్రీ నిర్మాతలు చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడరని, వాళ్లు మనిషిని మనిషిలానే చూస్తారని, భారీ బడ్జెట్ సినిమాకు ఎంత ప్యాషన్ గా వర్క్ చేస్తారో చిన్న బడ్జెట్ సినిమాకు కూడా వాళ్లంతే పని చేస్తారని, 8 వసంతాలు రిలీజయ్యాక మైత్రీ నుంచి మరో మంచి సినిమా వచ్చిందని అందరూ అనుకుంటారని డైరెక్టర్ ఫణీంద్ర చెప్పాడు. ఈ సినిమా చేయడానికి అనంతిక డబ్బు కూడా పన్లేదని చెప్పిందని, తనకు టాలెంట్ తో పాటూ సినిమాపై ప్యాషన్ కూడా ఉందని, శుద్ధి అయోధ్య పాత్రలో అనంతిక చాలా అద్భుతంగా నటించిందని చెప్పాడు. కమర్షియల్ తీయాలని లేకనే ఇలాంటి సినిమా తీశానని, ప్రేక్షకుడిగా థియేటర్లకు వెళ్లిన ఆడియన్స్ అంతా ప్రేమికులుగా తిరిగివస్తారని, 8 వసంతాలు చూశాక ప్రతీ ఒక్కరికీ ప్రేమ తత్వం బోధపడుతుందని, తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను కచ్ఛితంగా ఆదరిస్తారనే నమ్మకముందని ఫణీంద్ర అన్నాడు.