తెలుగోడు అవ్వడం జగ్గూభాయ్ బ్యాడ్ లక్కా? బుచ్చితో అలా అన్నారేంటి?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన పెద్ది మూవీ భారీ వసూళ్లు సాధిస్తోంది.

Update: 2026-06-12 10:16 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన పెద్ది మూవీ భారీ వసూళ్లు సాధిస్తోంది. సినిమాలో చరణ్ నటనతో పాటు పలువురు నటీనటుల పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే హీరో తర్వాత ఎక్కువ చర్చకు వచ్చిన పాత్రల్లో సీనియర్ నటుడు జగపతిబాబు పోషించిన అప్పలసూరి రోల్ ఒకటి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఆ పాత్రలో ఆయన పూర్తిగా ఒదిగిపోయి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

అయితే పోస్ట్ ప్రమోషన్స్ లో జగపతిబాబు, బుచ్చిబాబుతో తన పాత్ర వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా అప్పలసూరి పాత్రకు వచ్చిన రెస్పాన్స్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. "నేను 75 టేక్స్ తీసుకున్నానని ఎక్కడో రాశారు. బుచ్చి.. ఏంటి సంగతి?" అని జగపతిబాబు నవ్వుతూ ప్రశ్నించారు. దీనికి బుచ్చిబాబు స్పందిస్తూ, "అంత సీన్ అస్సలు లేదు. ఒకటి లేదా రెండు టేక్స్ మాత్రమే తీసుకున్నాం" అని చెప్పారు.

"మీరు సెట్లోకి వచ్చిన తర్వాత నిజంగానే అప్పలసూరి వచ్చినట్లు అనిపించింది. బయట వాళ్లు కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేదు. అంతలా ఆ పాత్రలో ఇన్వాల్వ్ అయ్యారు" అని ప్రశంసించారు. దీనిపై జగపతిబాబు స్పందిస్తూ, "నేను అప్పలసూరి అనే భ్రమలో ఉండిపోయాను. క్యారెక్టర్ వినగానే డిఫాల్ట్‌ గా వచ్చేసింది. కెరీర్‌ లో ఫైనెస్ట్ క్యారెక్టర్లలో అప్పలసూరి ఒకటి" అని తెలిపారు. "పెద్ది, అప్పలసూరి మధ్య ఇంకొంచెం బాండింగ్ చూపించి ఉంటే నాకు ఇంకా ముచ్చటగా ఉండేది" అంటూ అభిప్రాయపడ్డారు.

ఇక ఆ పాత్ర కోసం జగపతిబాబునే ఎందుకు ఎంపిక చేశారనే విషయాన్ని బుచ్చిబాబు వివరించారు. "అప్పలసూరిని చూస్తే ప్రయత్నం, పేదరికం, కష్టాలు గుర్తుకురావాలి. జగపతిబాబు ఎప్పుడూ రాయల్ లుక్‌ లో కనిపిస్తారు. అలాంటి వ్యక్తి ఆ పాత్రకు సరిపోతారా అనే డౌట్ మొదట వచ్చింది. అందుకే ఏఐ సాయంతో లుక్ డిజైన్ చేయించుకున్నాను. అది చూసిన తర్వాత ఆ రోల్ కు జగపతిబాబు కంటే సరైన ఎంపిక మరెవరూ లేరని నిర్ణయించుకున్నాను" అని చెప్పారు.

దీనిపై జగపతిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "డ్రెస్ వేసుకున్నాకే నాకు వంద శాతం నమ్మకం వచ్చింది. నా క్లోజ్ ఫ్రెండ్స్, బంధువులు కూడా గుర్తుపట్టలేదు. క్లైమాక్స్‌ లో అప్పలసూరిని మళ్లీ గుర్తు చేసిన విధానం వల్లే ఆ పాత్ర మరింత పండింది" అని అన్నారు. అయితే అత్యంత ఆసక్తికరంగా మారిన విషయం ఒక ప్రముఖ దర్శకుడు జగపతిబాబుకు కాల్ చేసిన విషయం.

"ఒక పెద్ద డైరెక్టర్ నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇదే అప్పలసూరి పాత్రను వేరే లాంగ్వేజ్ వాళ్లు చేసి ఉంటే ఆకాశానికి ఎత్తేసేవారు. కానీ మీరు తెలుగోడు కావడం మీ బ్యాడ్ లక్" అని ఆయన చెప్పినట్లు జగపతిబాబు వెల్లడించారు. దానిపై బుచ్చిబాబు స్పందిస్తూ, "నాకు స్టేజ్ ఫియర్ ఉంటుంది. కానీ విజయవాడ ఫంక్షన్‌ లో మాత్రం అప్పలసూరి పాత్ర గురించి మాట్లాడాను. హీరో తర్వాత సినిమాలో అంతటి బరువు మోసిన పాత్ర అప్పలసూరిదే" అని అన్నారు. ఏదేమైనా అప్పలసూరి పాత్ర జగపతిబాబు కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచింది. అయితే ఆ రేంజ్ యాక్టింగ్ కు రావాల్సిన గుర్తింపు వచ్చిందా లేదా అన్న చర్చ మాత్రం ఇప్పుడు కొనసాగుతోంది.






Tags:    

Similar News