పెద్దికి లైన్ క్లియర్!.. ఆ ప్రెస్‌ నోట్ ఫేకా? అసలేం జరుగుతోంది?

కానీ ఆ వ్యవహారానికి అసలు ట్విస్ట్ ఇచ్చింది సురేష్ బాబు రెస్పాన్స్. ఛాంబర్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రెస్‌నోట్ విడుదల కాలేదని, వైరల్ అవుతున్న నోట్ ఫేక్ అని ఆయన స్పష్టం చేశారు.

Update: 2026-05-20 08:23 GMT

టాలీవుడ్‌ లో గత కొన్ని రోజులుగా థియేటర్ల పర్సంటేజీ విధానం చుట్టూ జరుగుతున్న చర్చలు కొత్త మలుపు తిరిగాయి. ముఖ్యంగా పెద్ది సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ప్రెస్‌ నోట్ ఇప్పుడు మరింత గందరగోళానికి దారి తీసింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పేరుతో బయటకు వచ్చిన ఆ నోట్‌ పై ఛాంబర్ అధ్యక్షుడు దగ్గుబాటి సురేష్ బాబు స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది.

ఎక్స్ లో వైరల్ అయిన ఆ ప్రెస్‌ నోట్‌ లో పెద్ది మూవీ రిలీజ్ కు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. అంతేకాదు.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ విధానం అమలు, టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోల రేట్లు వంటి కీలక అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకున్నట్లు అందులో వివరించారు. దీంతో ఇండస్ట్రీలో చాలా మంది నిజంగానే ఛాంబర్ ఒక నిర్ణయానికి వచ్చిందని భావించారు.

కానీ ఆ వ్యవహారానికి అసలు ట్విస్ట్ ఇచ్చింది సురేష్ బాబు రెస్పాన్స్. ఛాంబర్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రెస్‌నోట్ విడుదల కాలేదని, వైరల్ అవుతున్న నోట్ ఫేక్ అని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ విధానంపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పడం ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య అద్దె విధానమా? లేక పర్సంటేజీ విధానమా? అన్న అంశంపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.

చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు ఆ అంశం ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఇండస్ట్రీ పెద్దలు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమైంది. అయితే సోమవారం ఫిల్మ్ ఛాంబర్‌ లో జరిగిన సమావేశంలో సభ్యుల మధ్య వాగ్వాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి. ప్రత్యేకంగా పెద్ది చిత్రాన్ని అద్దె విధానంలో ప్రదర్శించలేమని కొందరు ఎగ్జిబిటర్లు చెప్పినట్లు ప్రచారం జరిగింది. మరోవైపు నిర్మాతల వర్గం పర్సంటేజీ విధానం వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇలాంటి సమయంలోనే ఛాంబర్ లెటర్ హెడ్‌ పై సురేష్ బాబు సంతకం లేకుండా ఓ ప్రెస్‌ నోట్ బయటకు రావడం గమనార్హం..

వైరల్ నోట్‌ లో ఏపీ, తెలంగాణలో టికెట్ రేట్లు పెంచితే అదనంగా 7.5 శాతం వాటా చెల్లించాలనే ప్రతిపాదన కూడా కనిపించింది. అలాగే ప్రీమియర్ షోల కోసం A, B, C సెంటర్ల వారీగా ఫిక్స్ చేసిన రేట్లు కూడా అందులో పేర్కొన్నారు. భవిష్యత్తులో కొత్త పర్సంటేజీ విధానం తీసుకురావాలని ఇండస్ట్రీ పెద్దలు అంగీకరించారని అందులో రాసి ఉంది. అయితే ఇప్పుడు రెండు ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఒకటి.. ఛాంబర్ అధికారిక అనుమతి లేకుండా ఆ నోట్‌ ను ఎవరు విడుదల చేశారు? రెండోది.. నిజంగానే ఏదైనా ఒప్పందం జరిగిందా? లేక కొందరు కావాలనే బయటకు తీసుకొచ్చారా? అన్నది. ఏదేమైనా పెద్ది విడుదలకు సంబంధించిన చర్చల కంటే ఇప్పుడు ఆ ఫేక్ ప్రెస్‌ నోట్ వ్యవహారమే పెద్ద చర్చగా మారింది. పర్సంటేజీ విధానంపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య చర్చలు మరికొంతకాలం కొనసాగనున్నట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News