పెద్ది అప్‌డేట్... మున్నా భాయ్యా వాయిస్ రిపీట్
హిందీలో ఇప్పటికే మంచి పాపులారిటీని సొంతం చేసుకుని వరుస సినిమాలు చేస్తున్న దివ్యేందు ముందు ముందు తెలుగులో మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉంది.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న 'పెద్ది' సినిమా షూటింగ్ పూర్తి అయ్యి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఇప్పటికే రెండు సార్లు విడుదల వాయిదా పడ్డ ఈ సినిమాను మరోసారి వాయిదా వేయబోవడం లేదని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఒక వైపు సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతూ ఉండగా, మరో వైపు సినిమాకు సంబంధించిన డబ్బింగ్, రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ మాత్రమే కాకుండా ముఖ్యపాత్రలో ప్రముఖ నటీనటులు నటించారు. ముఖ్యంగా మీర్జాపూర్ వెబ్ సిరీస్‌తో మున్నా భయ్యాగా మంచి గుర్తింపు దక్కించుకున్న దివ్యేందు 'పెద్ది' సినిమాలో కనిపించబోతున్నాడు. పెద్ది సినిమాలో రామ్ బుజ్జీ పాత్రలో దివ్యేందును చూడబోతున్నట్లుగా ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
పెద్ది సినిమాలో హీరోగా రామ్ చరణ్...
పెద్ది సినిమా హిందీ వర్షన్ కోసం దివ్యేందు తన పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నాడట. అయితే తెలుగు వర్షన్‌కి మాత్రం ఆయన డబ్బింగ్ చెప్పుకునే పరిస్థితి లేదు. అందుకే ఆయన గతంలో పోషించిన మున్నా భయ్యా పాత్రకు డబ్బింగ్ చెప్పిన బాలుతో పెద్ది సినిమా కోసం డబ్బింగ్ చెప్పించారని తెలుస్తోంది. మీర్జాపూర్ తెలుగు వర్షన్‌ను చూసిన సమయంలో దివ్యేందు పాత్రకు డబ్బింగ్ బాగా సెట్ అయినట్లుగా అనిపిస్తుంది. దివ్యేందు బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగానే బాలు డబ్బింగ్ చెప్పడం జరిగింది. అందుకే పెద్ది సినిమాలోని రామ్ బుజ్జీ పాత్ర కోసం బాలును ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. బాలు డబ్బింగ్ చెప్పడంతో పాత్రకు మరింత వెయిట్ పెరిగినట్లు అయింది. తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా దివ్యేందు యాక్టింగ్, ఆయన వాయిస్‌కి ఫిదా అవుతారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
దివ్యేందు ముఖ్య పాత్రలో...
హిందీలో ఇప్పటికే మంచి పాపులారిటీని సొంతం చేసుకుని వరుస సినిమాలు చేస్తున్న దివ్యేందు ముందు ముందు తెలుగులో మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉంది. వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం దివ్యేందు భారీ పారితోషికం తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఆయన పాత్ర గురించి కూడా ప్రముఖంగా చర్చ జరుగుతోంది. పెద్ది సినిమా విడుదల అయిన తర్వాత దివ్యేందు ఒక్కసారిగా తెలుగులో బిజీ ఆర్టిస్ట్‌గా మారడం ఖాయం అని కూడా చిత్ర యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. యాక్టింగ్ విషయంలో రామ్ చరణ్‌తో పోటీ పడి మరీ దివ్యేందు నటించాడని కూడా సమాచారం అందుతోంది. దివ్యేందు ఒక వైపు కీ రోల్స్ చేస్తూనే మరో వైపు ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్ రోల్స్ చేయడం ద్వారా ఆయన ఫ్యూచర్‌లో పెద్ద ఎత్తున సినిమాలు చేసే అవకాశం ఉంది.
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా...
రామ్ చరణ్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటించిన విషయం తెల్సిందే. సినిమాలోని ఆమె లుక్‌ను ఇప్పటికే రివీల్ చేశారు. పల్లెటూరు అమ్మాయి పాత్రలో జాన్వీ కపూర్ కనిపించబోతుంది. సినిమా కథ ఎక్కువగా పల్లెటూరు నేపథ్యంలో సాగుతుంది. అందుకే సినిమాలో నటించిన నటీటులు అంతా కూడా ప్రత్యేకంగా శ్రద్ద తీసుకుని డైలాగ్స్ ను నేర్చుకున్నారని, అంతే కాకుండా పల్లెటూరుకు తగ్గట్లుగా కట్టు బొట్టులోనూ నటీనటులు కనిపించేందుకు గాను చాలా రోజులు వర్క్ షాప్ నడిచిందని కూడా తెలుస్తోంది. మొత్తానికి పెద్ది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న దివ్యేందు ముందు ముందు టాలీవుడ్‌తో పాటు, సౌత్ ఇండియా మొత్తం మరిన్ని ఆఫర్లు దక్కించుకుని బిజీ అయ్యేనా చూడాలి.