ఏప్రిల్లో ఉస్తాద్ భగత్ సింగ్
2023లో బ్రో మూవీతో పలకరించాక రెండేళ్లకు పైగా బాక్సాఫీస్ పోటీకి దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు సినిమాలతో పలకరించాడు.;
2023లో బ్రో మూవీతో పలకరించాక రెండేళ్లకు పైగా బాక్సాఫీస్ పోటీకి దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు సినిమాలతో పలకరించాడు. జులైలో హరిహర వీరమల్లు రిలీజైతే.. సెప్టెంబర్లో ఓజీ విడులైంది. మొదటి సినిమా నిరాశపరిచినా.. రెండో మూవీ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులనూ మెప్పించింది. ఈ రెండు చిత్రాలను పూర్తి చేసిన వెంటనే పవన్.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని కూడా టేకప్ చేయడం.. వరుసగా కాల్ షీట్స్ ఇచ్చి చకచకా తన పార్ట్ షూటింగ్ అంతా పూర్తి చేయడం తెలిసిందే.
మరి ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐతే పవన్ తన పార్ట్ వరకు చిత్రీకరణ పూర్తి చేసినప్పటికీ.. ఇంకా కొంత షూట్ మిగిలే ఉండడంతో సినిమా కొంచెం ఆలస్యం కానున్నట్లు ఇప్పటికే చిత్ర వర్గాలు సంకేతాలు ఇచ్చాయి. వచ్చే రెండు మూడు నెలల్లో అయితే రిలీజ్‌కు స్కోప్ లేదు. అలాంటపుడు వేసవికే విడుదల ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇప్పుడు స్వయంగా నిర్మాత రవిశంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం ఏప్రిల్లో విడుదలవుతుందని ఆయన ప్రకటించారు. తమ ప్రొడక్షన్లో రానున్న కొత్త చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా ప్రమోషన్లలో భాగంగా ఆయన తమ సంస్థ సినిమాల గురించి మాట్లాడారు. రామ్ చరణ్ పెద్ది మూవీ మార్చిలోనే రాబోతోందని నొక్కి వక్కాణించిన రవిశంకర్... ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ పూర్తి చేసుకుందని, వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు.
సంక్రాంతికి సినిమాను రెడీ చేసే అవకాశమున్నా.. అప్పుడు చిరు సినిమా మన శంకర వరప్రసాద్ ఉండడంతో వేసవి వైపు దృష్టి మళ్లింది. మార్చిలో రామ్ చరణ్ సినిమా వస్తుంది కాబట్టి.. ఆ నెలను విడిచిపెట్టి ఏప్రిల్‌ను ఎంచుకున్నారు. మేలో ఎలాగూ చిరు మరో సినిమా విశ్వంభర వస్తుందనే అంచనాలున్నాయి. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌లో చిరు సరసన శ్రీలీల, రాశి ఖన్నా నటించారు.