పవన్ కు అంత టైముందా?
ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. వీరమల్లు 2నే కాకుండా పవన్ గతంలో చేద్దామనుకున్న మరో సినిమాను కూడా చేస్తాడంటున్నారు.;
టాలీవుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆయన కమిట్ అయిన సినిమాలన్నింటినీ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. కరోనాకు ముందు మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమాను ఇప్పటికే పూర్తి చేసి దాన్ని రిలీజ్ కు రెడీ చేస్తున్న పవన్, మరోవైపు సుజీత్ తో ఓజి సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలతో పాటూ పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాకు కూడా కమిట్ అయిన విషయం తెలిసిందే.
ఓజి సినిమాను పూర్తి చేసిన వెంటనే పవన్ ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాకు డేట్స్ కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాను కూడా పూర్తి చేశాక పవన్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్తాడని అందరూ భావిస్తున్నారు. దానికి కారణం ప్రస్తుతం పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండటమే. రాజకీయాలకే టైమ్ సరిపోవడం లేదని, ఇక సినిమాలు ఎప్పుడు చేస్తారని అభిప్రాయపడుతున్నారు.
కానీ కొందరు మాత్రం హరి హర వీరమల్లు సెకండ్ పార్ట్ కూడా చేశాక అప్పుడు సినిమాలకు బ్రేక్ ఇస్తాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. వీరమల్లు 2నే కాకుండా పవన్ గతంలో చేద్దామనుకున్న మరో సినిమాను కూడా చేస్తాడంటున్నారు. టాలీవుడ్ లో స్టైలిష్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న సురేందర్ రెడ్డి గతంలో పవన్ తో ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
శ్రీరామ్ తాళ్లూరి నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆ ప్రాజెక్టు గురించి వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా డైరెక్టర్ సురేందర్ రెడ్డి పవన్ ను కలిశాడని, తన వద్ద పూర్తి స్క్రిప్ట్ రెడీగా ఉందని చెప్పాడని అంటున్నారు. మరి ఎంతో ఆశగా పవన్ దగ్గరకు వెళ్లిన సురేందర్ రెడ్డికి ఆయనేం చెప్పారనేది తెలియాల్సి ఉంది. అయితే పవన్ ఆల్రెడీ కమిట్ అయి షూటింగ్ మొదలుపెట్టిన సినిమాలనే పూర్తి చేసే టైమ్ లేదంటే ఇప్పుడు కొత్తగా సినిమాను మొదలుపెట్టి దాన్ని పూర్తి చేసే తీరిక ఆయనకుందా అని కొందరు అభిప్రాయపడుతున్నారు.