హ‌రీష్ శంక‌ర్ ఆ మ్యాజిక్‌ని మ‌ళ్లీ రిపీట్ చేయాల్సిందే!

అయితే చాలా రోజుల త‌రువాత ప‌వ‌న్ నుంచి వ‌చ్చిన ప‌ర్‌ఫెక్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అనిపించుకున్న `ఓజీ` మాస్ అప్పీల్‌ని మాత్రం క‌లిగించ‌లేక‌పోయింది.;

Update: 2026-01-06 02:45 GMT

టాలీవుడ్ స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టిస్తుంటే అభిమాన హీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ రేంజ్‌లో మెరుపులు మెరిపించ‌డం లేద‌ని, ఒక్క సినిమా స‌రైంది ప‌డితే ప‌వ‌న్ అస‌లు స‌త్తా ఏంటో అంద‌రికి తెలుస్తుంద‌ని అభిమానులు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అదే స‌మ‌యంలో ప‌వ‌న్ `ఓజీ`తో స్ట్రాంగ్ క‌మ్ బ్యాక్ ఇచ్చి ఫ్యాన్స్‌ని ఖుషీ చేశాడు. 2025లో విడుద‌లైన టాప్ టెన్ ఇండియ‌న్ సినిమాల్లో `ఓజీ` నిల‌వ‌డం విశేషం. బాక్సాఫీస్ వ‌ద్ద భారీగానే ప్ర‌భావాన్ని చూపించి ప‌వ‌న్ మేనిమాని ప్ర‌ద‌ర్శించి రూ.300 కోట్ల క్ల‌బ్‌లో చేరింది.

అయితే చాలా రోజుల త‌రువాత ప‌వ‌న్ నుంచి వ‌చ్చిన ప‌ర్‌ఫెక్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అనిపించుకున్న `ఓజీ` మాస్ అప్పీల్‌ని మాత్రం క‌లిగించ‌లేక‌పోయింది. ప‌వ‌న్ సినిమా అంటే మాస్ అంశాలు క‌చ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అంతే కాకుండా ప‌వ‌న్ మార్కు పంచ్‌లు ఖ‌చ్చింత‌గా ఉంటాయి. కానీ `ఓజీ`లో మాత్రం అవి చాలా వ‌ర‌కు మిస్స‌య్యాయ‌ని చెప్పొచ్చు. దానితో పాటు ఆడియో కూడా ప్రేక్ష‌కుల్లో, సినీ ల‌వ‌ర్స్‌లో అనుకున్న స్థాయిలో రిజిస్ట‌ర్ కాలేక‌పోయింది. ప‌వ‌న్ సినిమా అంటే ఆడియో టాప్‌లో ఉంటుంది. `ఓజీ`లో అది క‌నిపించ‌లేదు.

బ్యాగ్రౌండ్ స్కోర్ సూప‌ర్ కానీ కావాల్సిన ఆడియో మాత్రం ఇందులో వినిపించ‌లేదు. ఈ మూవీని ద‌ర్శ‌కుడు సుజీత్ డిజైన్ చేసిన తీరు కూడా క్లాస్ ప్రేక్ష‌కుల్ని ఎట్రాక్ట్ చేసే విధంగానే ఉంది కానీ మాస్ ఆడియ‌న్స్‌కు పిచ్చెక్కించ‌లేక‌పోయింది. ఈ లోపాలేవీ లేకుండా హ‌రీష్ శంక‌ర్ ..ప‌వ‌న్‌తో చేసిన మూవీ `గ‌బ్బ‌ర్‌సింగ్‌`. ఆడియో ప‌రంగా, ప‌వ‌న్ క్యారెక్ట‌రైజేష‌న్ ప‌రంగా, పంచ్‌ల ప‌రంగా మాస్ ఆడియ‌న్స్‌ని ఓ రేంజ్‌లో ఆక‌ట్టుకుని వ‌రుస ఫ్లాపుల త‌రువాత ప‌వ‌న్‌కు బ్లాక్ బస్ట‌ర్ హిట్‌ని అందించింది.

ఇందులోని ప్ర‌తి ఫ్రేమ్‌లో హ‌రీష్ శంక‌ర్ ప‌నిత‌నం క‌నిపించింది. తీసుకుంది రీమేకే అయినా హీరో క్యారెక్ట‌ర్, మేన‌రిజ‌మ్‌, సింగిల్ లైన‌ర్స్‌, ఆడియోతో మాస్ ఆడియ‌న్స్‌కు, అందులోనూ ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఏం కావాలో వాట‌న్నింటినీ హ‌రీష్ శంక‌ర్ కంప్లీట్ ప్యాకేజీగా అందించి అద‌ర‌గొట్టాడు. చాలా కాలంగా ప‌వ‌న్ నుంచి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌ని ఆశిస్తున్న అభిమానులు ఇప్ప‌డు అదే త‌ర‌హా మ్యాజిక్‌ని రిపీట్ చేయాల‌ని కోరుకుంటున్నారు. `ఓజీ`తో బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకుని మంచి జోష్ మీదున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర‌తో `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` చేస్తున్నారు.

గ‌త కొంత కాలంగా రేసులో వెన‌క‌బ‌డిన హ‌రీష్ శంక‌ర్ ఈ సినిమాతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో వ‌ర్క్ చేస్తున్నాడు. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డం ప‌వ‌న్ కంటే హ‌రీష్‌కే అవ‌స‌రం ఎక్కువ‌. దాన్ని గ‌మ‌నించి `ఓజీ`లో మిస్స‌యిన అంశాల‌ని ఫిల్ చేసి కంప్లీట్ మాస్ మ‌సాలా యాక్ష‌న్ ప్యాకేజ్‌గా `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్`ని సిద్ధం చేయాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హ‌రీష్ శంక‌ర్ కూడా దీనిపై దృష్టి పెట్టి ప‌ర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో ఉస్తాద్‌ని ముస్తాబు చేస్తాడ‌నే టాక్ వినిపిస్తోంది. అదే జ‌రిగితే `గ‌బ్బ‌ర్‌సింగ్` మ్యాజిక్ మ‌ళ్లీ రిపీట్ కావ‌డం ప‌క్కా.

Tags:    

Similar News