బాబోయ్ ఏంటి ఈ స్పీడ్... 'ఓజీ'ని చుట్టేశారా?
పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల ముందు రాజకీయ సమీకరణాల కోసం, జనసేన పార్టీని బలోపేతం చేయడం కోసం ఏడాదికి పైగా సినిమాల షూటింగ్స్‌కు దూరంగా ఉన్నాడు.;
పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల ముందు రాజకీయ సమీకరణాల కోసం, జనసేన పార్టీని బలోపేతం చేయడం కోసం ఏడాదికి పైగా సినిమాల షూటింగ్స్‌కు దూరంగా ఉన్నాడు. ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో దాదాపు ఏడాది పాటు షూటింగ్స్‌కు దూరంగా ఉన్నాడు. మొత్తంగా రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న హరి హర వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్స్‌ను ఎట్టకేలకు ముగించేందుకు పవన్ నడుం భిగించాడు. ఎప్పుడు డేట్లు ఇచ్చాడో ఏమో కానీ ఇటీవలే వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి అయింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఈ నెలలో సినిమాను విడుదల చేసేందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారు.
వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఆలస్యం కారణంగా సినిమాను ఈ నెలలో విడుదల చేయడం లేదు. వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో పవన్ ఓజీ సినిమాకు సంబంధించిన సర్‌ప్రైజింగ్ విషయం మీడియా సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం ఓజీ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. గత నెలలో ముంబైలో జరిగిన కీలక షెడ్యూల్‌తో సినిమా మెజార్టీ పార్ట్ షూటింగ్‌ను ముగించిన దర్శకుడు సాహో సుజీత్ మరో షెడ్యూల్‌తో మొత్తం పూర్తి చేయబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఏపీలో ఓజీ సినిమాకు సబంధించిన చివరి షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. వారం నుంచి పది రోజుల పాటు సాగే ఆ షెడ్యూల్‌తో మొత్తం షూటింగ్ పూర్తి కానుందట. సాహో సినిమాను చాలా ఏళ్ల పాటు తీసిన సుజీత్ ఓజీ సినిమాను మాత్రం ఇంత తక్కువ సమయంలోనే ముగించడం విడ్డూరంగా ఉంది అంటూ అంతా కూడా ముక్కున వేలు వేసుకుంటున్నారు. వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి అయింది అంటూ అధికారిక ప్రకటన వచ్చిన సమయంలో చాలా మంది షూటింగ్‌ను చుట్టేశారా... సీరియస్‌గా ఇతర సినిమాల మాదిరిగా చేశారా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఓజీ విషయంలోనూ చాలా మంది అదే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు.
సాహో వంటి యాక్షన్ సినిమాను ప్రేక్షకులకు అందించిన సుజీత్ తో పవన్ కళ్యాణ్ సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుజీత్ ఈ సినిమాను చేయాలని భావించాడు. కానీ పవన్ కళ్యాణ్ డేట్ల సర్దుబాటు విషయంలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా సుజీత్ రాజీ పడుతూ రావాల్సి వచ్చిందని తెలుస్తోంది. అందుకే చాలా సన్నివేశాలు రాజీ పడుతూ, సింగిల్ టేక్‌కి ఓకే చెప్పి షూటింగ్ ముగింపు దశకు తీసుకు వచ్చి ఉంటాడు అంటూ చాలా మంది సోషల్ మీడియా జనాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా సినిమాల షూటింగ్స్‌ను చుట్టేస్తే సినిమాలను జనాలు చూస్తారా.. అసలు సినిమాలకు బిజినెస్ అయ్యేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ రెండు సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.