'పండోరా' సృష్ఠిక‌ర్త ఈ భార‌తీయ అమ్మాయి!

జేమ్స్ కామెరూన్ తెర‌కెక్కించిన‌ `అవతార్: ఫైర్ అండ్ యాష్` ఈనెల‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.;

Update: 2025-12-17 03:30 GMT

జేమ్స్ కామెరూన్ తెర‌కెక్కించిన‌ `అవతార్: ఫైర్ అండ్ యాష్` ఈనెల‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. మ‌రోసారి అవ‌తార్ పండోరా గ్ర‌హం అందాన్ని వీక్షించేందుకు, గ‌గుర్పాటుకు గురి చేసే భీక‌ర పోరాట దృశ్యాల‌ను వీక్షించేందుకు అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. అవ‌తార్, అవ‌తార్ 2 చిత్రాల‌ను మించి అవ‌తార్ 3 విజువ‌ల్స్ ర‌క్తి క‌ట్టిస్తాయ‌ని కామెరూన్ చెబుతున్నారు. అందుకే ఈ మూడో భాగం రాక కోసం చాలా మంది ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు. ఇక‌ అవతార్ సిరీస్‌లో క‌ట్టిప‌డేసే ఆకర్షణీయమైన విజువల్ ఎఫెక్ట్స్‌ ఉన్నాయి. ఇవి ఫ్రాంచైజీ విజయానికి చాలా స‌హ‌క‌రించాయి.

అయితే అవ‌తార్ మూడు భాగాల‌కు వీఎఫ్ఎక్స్ విభాగాన్ని లీడ్ చేసింది ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు. ఒక భార‌తీయ అమ్మాయి ఆ మూడు సినిమాల విజువ‌ల్ ఎఫెక్ట్స్ కోసం అహోరాత్ర‌లు త‌న టీమ్ తో శ్ర‌మించారు! అంటే న‌మ్మ‌గ‌ల‌రా? కానీ ఇది నిజం. ఆ అమ్మాయి పేరు పావ‌నీరావు బొడ్డ‌పాటి. అవతార్: ఫైర్ అండ్ యాష్‌ సహా మూడు అవతార్ సినిమాల విజువల్స్‌ను `వెటా FX` సంస్థ క్రియేట్ చేసింది. ఈ సంస్థ‌లో విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్ పావని రావు బొడ్డపాటి ప‌ని చేస్తున్నారు.

పావ‌ని లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్ర‌కారం.. పావని న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుండి ఆర్కిటెక్చర్‌లో బిఆర్క్ పట్టా పొందారు. తరువాత శాన్ ఫ్రాన్సిస్కోలోని అకాడమీ ఆఫ్ ఆర్ట్ యూనివర్సిటీ నుండి ఎం.ఎఫ్‌.ఏ, యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి చేసారు. పావ‌ని ప్రస్తుతం న్యూజిలాండ్‌ వెల్లింగ్టన్‌లో నివశిస్తున్నారు. ప‌దేళ్ల‌కు పైగా జేమ్స్ కామెరూన్ అత్యంత ప్రతిష్టాత్మక విశ్వం కోసం వీఎఫ్ఎక్స్ విభాగంలో పావ‌ని చేస్తున్నారు. పండోరా సృష్టి క‌ర్త కూడా ఆమె. 2009లో అవతార్ కోసం న్యూజిలాండ్‌కు మకాం మార్చారు. కొన్నేళ్ల త‌ర్వాత విడుద‌లైన‌ `అవ‌తార్‌- ది వే ఆఫ్ వాటర్‌` కోసం ప‌ని చేసారు. పార్ట్ 2 కోసం దాదాపు 3,000 విజువల్ ఎఫెక్ట్స్ షాట్లు .. ఎక్కువ భాగం నీటి అడుగున ఉన్నవి క్రియేట్ చేసింది పావ‌ని టీమ్‌.

జేమ్స్ కామెరూన్ అతడి దీర్ఘకాల సృజనాత్మక బృందంతో కలిసి పావ‌ని ప‌ని చేసారు. చేసే ప‌నిలో పెను స‌వాల్ తో కూడుకున్న విష‌యాల‌ను వాస్తవిక ప్రపంచాలుగా మార్చారు. భారతదేశం నుండి `పండోర సృష్టి`కి పావ‌ని గొప్ప‌ స‌హ‌కారి. సినిమా దృశ్యాన్ని విజువ‌ల్‌గా అద్భుతంగా మార్చిన ఘ‌న‌త ఒక భార‌తీయ అమ్మాయి సొంతం అని చెప్పుకోవ‌డానికి గ‌ర్వించాలి.

Tags:    

Similar News