'దూత' బ్యూటీ థ్రిల్లర్.. మనోళ్లు ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అయినట్లే!
ఇప్పుడు అక్టోబర్ 9 నుంచి నెట్ ఫ్లిక్స్ లో తెలుగు సహా పలు భాషల్లో చూసే అవకాశం వచ్చింది.
కొన్ని సినిమాలు ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూసినా బాగుంటాయి. కానీ అవే సినిమాలను థియేటర్లలో చూస్తే వచ్చే ఆ మజానే వేరు. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లో నెక్స్ట్ ఏం జరుగుతుందనే సస్పెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అలాంటి సినిమాలను బిగ్ స్క్రీన్ పై చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ అదిరిపోతుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఇలాంటి ఓ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యారనే చెప్పాలి. అదే మాలీవుడ్ మూవీ 'ప్రథమ దృష్టి కుట్టక్కర్'.
'దూత' వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పార్వతి తిరువోతు నటించిన ఆ సినిమా రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. పార్వతి తిరువోతు, మాథ్యూ థామస్, విజయరాఘవన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 11న మలయాళంలో విడుదలైంది. మొదట నెమ్మదిగా మొదలైన వసూళ్లు.. ఆ తర్వాత మంచి టాక్ తో పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఇప్పుడు అక్టోబర్ 9 నుంచి నెట్ ఫ్లిక్స్ లో తెలుగు సహా పలు భాషల్లో చూసే అవకాశం వచ్చింది. ఇక మూవీ కథ విషయానికి వస్తే.. భర్త చనిపోయిన తర్వాత అలీనా అబ్రహం అనే మహిళ పోలీస్ ఉద్యోగంలో చేరుతుంది. ఓ రోజు పోలీస్ స్టేషన్ లో విధుల్లో ఉండగా అనుకోకుండా ఓ వ్యక్తి చనిపోతాడు. ఆ ఘటన నుంచి బయటపడేందుకు అక్కడున్న కొందరు పోలీసులు ప్రయత్నిస్తారు.
అదే సమయంలో మరో హత్య కేసు దర్యాప్తు చేస్తూ ఓ సీనియర్ పోలీస్ అధికారి ఆ స్టేషన్ కు వస్తాడు. దీంతో అక్కడి పోలీసులకు కష్టాలు మొదలవుతాయి. అసలు ఆ రోజేం జరిగింది, నిజం బయటపడుతుందా లేదా అనే ఇంట్రెస్ట్ తో కథ సాగుతుంది. పోలీస్ స్టేషన్ లో జరిగే సంఘటనలు, పోలీసులు వేసే ఎత్తులు, ఊహించని మలుపులు సినిమాకు మెయిన్ అట్రాక్షన్. పార్వతి తన నటనతో ఆకట్టుకోగా.. సీనియర్ పోలీస్ అధికారిగా విజయరాఘవన్ కూడా మెప్పించారు.
నాగచైతన్య నటించిన 'దూత' వెబ్ సిరీస్ లో పార్వతి తిరువోతు పోలీస్ అధికారిగా నటించారు. ఆ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు ఆమె మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు మరో క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈసారి ఆమె నటించిన సినిమా నేరుగా తెలుగు థియేటర్లలో విడుదల కాకపోవడం కొంత నిరాశ కలిగించే విషయమే. తెలుగు ప్రేక్షకులకు కూడా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే మంచి ఆసక్తి ఉంటుంది. కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఇతర భాషల సినిమాలను కూడా ఆదరిస్తారు.
గతంలో ఎన్నో మలయాళ సినిమాలు తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నాయి. అలాంటిది ఆ సినిమా కూడా తెలుగులో థియేటర్లలో రిలీజ్ అయ్యి ఉంటే సూపర్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని మన లాంగ్వేజ్ లో సినిమాను చూసే ఛాన్స్ ఉంది. కానీ థియేటర్లలో విడుదలై ఉంటే మరో రేంజ్ లో ఎక్స్పీరియన్స్ చేసేవాళ్లమనే అభిప్రాయం రావడం పక్కా. అందుకే పార్వతి తిరువోతు నటించిన మంచి థ్రిల్లర్ ను థియేటర్లలో చూసే అవకాశం మాత్రం మనోళ్లు మిస్ అయినట్లే!