త‌నయుడి కోసం బాల‌య్య పుల్ టైమ్!

న‌ట‌సింహ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ అరంగేట్రం కోసం నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ వర్గాలు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి.

Update: 2026-10-09 13:30 GMT

న‌ట‌సింహ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ అరంగేట్రం కోసం నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ వర్గాలు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. ఎట్టకేలకు ఆ సమయం ఆసన్నం కావడంతో బాలయ్య కుమారుడు లాంచ్ విషయంలో ఎక్కడా? చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీని ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్న బాలకృష్ణ తనయుడి తొలి సినిమా కోసం తన పూర్తి సమయాన్ని కేటాయించాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే మోక్షజ్ఞ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు బాలయ్య మరే కొత్త సినిమాకు కమిట్ అవ్వకుండా కుమారుడి సినిమాపైనే దృష్టంతా నిలపాలని భావిస్తున్నారు.

`బింబిసార` చిత్రంతో భారీ విజయాన్ని అందుకుని ప్రస్తుతం `విశ్వంభర` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ప్రతిభా వంతుడైన దర్శకుడు వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ రూపుదిద్దుకోనుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం డిసెంబర్ నుంచి పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. విజువల్స్, సోషియో ఫాంటసీ, పవర్‌ఫుల్ యాక్షన్ అంశాలతో కూడిన విభిన్నమైన స్క్రిప్ట్‌ను వశిష్ట సిద్ధం చేసినట్లు సమాచారం. నందమూరి వారసుడి క్రేజ్‌కు తగినట్లుగా, మాస్ అండ్ క్లాస్ ప్రేక్షకులను ఏకకాలంలో ఆకట్టుకునేలా కథను తీర్చిదిద్దడంతో బాలయ్య కూడా కథ విషయంలో పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది.

మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో బాలకృష్ణ చాలా కాలంగా ఎంతో ఓర్పుతో వ్యవహరించారు. సరైన సమయం, సరైన దర్శకుడు, పక్కా స్క్రిప్ట్ కుదిరే వరకు ఎంతో లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఎంత ఆలస్యమైనా పర్వాలేదు కానీ, మోక్షజ్ఞ తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద శ్యూర్ షాట్ హిట్ కొట్టాలనే బలమైన కసితో బాలయ్య ఉన్నారు. కేవలం ఒక డెబ్యూ హీరోగా పరిచయం చేయడం మాత్రమే కాకుండా మొదటి సినిమాతోనే మోక్షజ్ఞను టాలీవుడ్‌లో పెద్ద స్టార్‌గా నిలబెట్టాలనే సుదీర్ఘమైన పక్కా ప్రణాళికతో బాల‌య్య‌ అడుగులు వేస్తున్నారు.

సాధారణంగా బాలకృష్ణ వరుస సినిమాలతో నిరంతరం సెట్స్‌పై బిజీగా ఉంటారు. అయితే తనయుడి ప్రాజెక్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో త‌న వ్యక్తిగత కాల్ షీట్లు, కొత్త సినిమాల అంగీకారాలకు తాత్కాలికంగా విరామం ఇవ్వాలని నిర్ణయించుకోవడం విశేషం. ప్రీ ప్రొడక్షన్ పనుల నుంచి మ్యూజిక్ సిట్టింగ్స్, కాస్ట్యూమ్స్, యాక్షన్ కొరియోగ్రఫీ వరకు ప్రతి విషయంలోనూ బాలయ్య దగ్గరుండి మార్గదర్శకత్వం వహించనున్నారు. షూటింగ్ సెట్స్‌లోనూ ఉంటూ మోక్షజ్ఞకు అవసరమైన నటన సంబంధిత సలహాలు, సూచనలు అందించడానికి ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని, నటసింహం బాలకృష్ణ తర్వాత మోక్షజ్ఞ భుజస్కంధాలపై మోయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అభిమానుల అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో బాలయ్యకు తెలుసు. అందుకే మార్కెట్ లెక్కలు, గ్రాండియర్, మేకింగ్ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ద‌మ‌వుతున్నాయి. నందమూరి అభిమానులను థ్రిల్ చేసేలా ఓ విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు చిత్రబృందం అహోరాత్రులు శ్రమిస్తోంది.

Tags:    

Similar News