'హనుమాన్ అంశ్' మూవీ రివ్యూ

హనుమాన్ అంశ్.. కేవలం రెండు కోట్ల బడ్జెట్లో తెరకెక్కి.. హిందీలో ఇప్పటిదాకా 450 కోట్ల దాకా వసూళ్లు రాబట్టిన చిత్రం.

Update: 2026-10-09 10:07 GMT

నటీనటులు: శోభినవ్ సత్య- పూర్ణిమ తివారి- చందన్ కె.ఆనంద్- అనిల్ రస్తోగి తదితరులు

సంగీతం: సాదు సుశీల్ తివారి

ఛాయాగ్రహణం: విశాల్ బవ

నిర్మాతలు: రాగిణి సోవ- నమ్రిత సింగ్- విశాల్ చతుర్వేది- అనుప్రియ

రచన-దర్శకత్వం: విశాల్ చతుర్వేది

హనుమాన్ అంశ్.. కేవలం రెండు కోట్ల బడ్జెట్లో తెరకెక్కి.. హిందీలో ఇప్పటిదాకా 450 కోట్ల దాకా వసూళ్లు రాబట్టిన చిత్రం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హోంబలే ఫిలిమ్స్ రిలీజ్ చేసిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం.

ముందుగా కథ విషయానికి వస్తే.. ఉత్తర భారతానికి చెందిన లక్ష్మీ నారాయణ (శోభినవ్ సత్య) చిన్నతనంలోనే తల్లిని కోల్పోతాడు. దీంతో ఒక రకమైన నిర్వేదంలోకి వెళ్లిపోయిన అతను.. తాను కూడా తల్లి దగ్గరికే వెళ్లిపోతానంటాడు. మిగతా పిల్లల్లో కలవకుండా సాధువులా మారిపోయిన లక్ష్మీ నారాయణ.. పన్నెండేళ్ల వయసులో ఇల్లు విడిచి వెళ్లిపోతాడు. జీవితం నదీ ప్రవాహంలా ఉండాలని భావించే అతను.. ఒక చోట స్థిరంగా ఉండకుండా ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. లక్ష్మీనారాయణలో దివ్య శక్తులను చూసిన జనం.. అతణ్ని ఆరాధించడం మొదలుపెడతాడు. అనేక ప్రాంతాలు తిరిగాక చివరికి కరోలి అనే ప్రాంతంలో స్థిరపడతాడు లక్ష్మీనారాయణ. దీంతో అతణ్ని అందరూ కరోలి బాబా అని పిలవడం మొదలుపెడతారు. ఐతే ఎన్నో ఏళ్ల తర్వాత కొడుకు ఆచూకీ కనుక్కుని కరోలికి వచ్చిన బాబా తండ్రి అతణ్ని మళ్లీ సంసార జీవితం వైపు మళ్లిస్తాడు. మరి భార్యతో బాబా జీవితం ఎలా సాగింది.. మళ్లీ ఆయన కరోలికి వెళ్లాడా.. తన ప్రయాణం ఏ తీరానికి చేరింది అన్నది మిగతా కథ.

కేవలం రెండు కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమాలో ఏం ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి? ఏం కమర్షియల్ విలువలుంటాయి? పోనీ అందులో స్టార్లు ఏమైనా ఉన్నారా అంటే అదీ లేదు. అందరూ కొత్త వాళ్లే. సినిమాతో అసోసియేట్ అయిన ఏ పెద్ద పేరూ లేదు. ఐతేనేం ఎంచుకున్న కథలో విషయం ఉంది. ఆ కథను చెప్పడంలో నిజాయితీ ఉంది. కాస్త దైవచింతన ఉన్న వాళ్లెవ్వరైనా సరే.. ‘హనుమాన్ అంశ్’ చూస్తూ అందులో లీనం అయిపోవాల్సిందే. ఇక రాముడిని కొలిచేవాళ్లు.. హనుమంతుడి భక్తులైతే పరవశంలో మునిగిపోతారు. దేవుడి సినిమా అనగానే మాయలు మహిమలు చూపిస్తూ.. విజువల్ మాయాజాలంతో ముంచెత్తాల్సిన అవసరమే లేదని.. జీవన సారాన్ని బోధిస్తూ ఆలోచన రేకెత్తించేలా కథను చెప్పినా ప్రేక్షకులు తన్మయత్వానికి గురవుతారని ‘హనుమాన్ అంశ్’ రుజువు చేస్తుంది. ఆధ్మాత్మిక భావనలున్న ప్రతి ఒక్కరూ ‘హనుమాన్ అంశ్’తో కనెక్ట్ అయ్యేలా చాలా సిన్సియర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దింది చిత్ర బృందం.

మనిషిలోనే పరమాత్ముడున్నాడని చెబుతూ.. మానవసేవే మాధవ సేవ అని చాటుతూ.. సక్రమమైన మార్గంలో జీవించమని బోధిస్తుంది ‘హనుమాన్ అంశ్’. ఈ కథ ద్వారా ఇలాంటి మరెన్నో మంచి విషయాలను చెబుతారు కానీ.. ఎక్కడా సినిమా ప్రీచీగా అనిపించదు. చాాలా సింపుల్ సీన్లతోనే మనసుకు హత్తుకునేలా విషయాలను చెప్పారు. కథ పరంగా ‘హనుమాన్ అంశ్’ మరీ విశేషంగా ఏమీ అనిపించదు. షిరిడీ సాయిబాబా జీవితాన్ని పోలినట్లే ఉంటుంది కరోలి బాబా కథ కూడా. ఆయన పుట్టుక నుంచి మొదలుపెట్టి.. బాబాగా ప్రసిద్ధి చెందే వరకు జీవితంలో వివిధ దశలను ఈ సినిమాలో చూపిస్తారు సినిమాలో అంతే. కానీ ప్రతి సన్నివేశం హడావుడి లేకుండా.. హాయిగొలిపేలా చాలా ప్రశాంతంగా సాగుతాయి. పన్నెండేళ్ళ వయసులో ఆధ్యాత్మిక మార్గం పట్టి ఇల్లు విడిచి వచ్చేసిన లక్ష్మీ నారాయణ.. బాబాగా పరిణామం చెందే సన్నివేశాలు అద్బుతంగా అనిపిస్తాయి. ఎవరితోనూ అనుబంధం ఏర్పరుచుకోకుండా నదీ ప్రవాహంలా సాగిపోతూ ఉండాలనే ఆలోచన రేకెత్తే సన్నివేశం హృదయాన్ని హత్తుకుంటుంది.

లక్ష్మీ నారాయణ బాబా అవతారం ఎత్తాక సినిమాలో చాలా వరకు ఆయన మహిమల తాలూకు సన్నివేశాలే ఉంటాయి. ఒకే రకమైన సన్నివేశాల వల్ల కొంచెం రిపిటీటివ్ ఫీల్ కలుగుతుంది కానీ.. ప్రతి సన్నివేశాన్ని ఆహ్లాదకరంగా తీయడం వల్ల బోర్ కొట్టదు. బాబా తన భక్తుడికి పరమశివుడిలా కనిపించే సన్నివేశం.. బ్రిటిష్ అధికారి రైలు బండి నుంచి బాబాను దింపేసే ఎపిసోడ్ బాగా హైలైట్ అయ్యాయి. రామ నామ స్మరణ చేస్తూ హనుమంతుడి భక్తితో నిండా మునిగిపోయి ఉన్న బాబా.. తిరిగి సంసార జీవితం వైపు మళ్లడం ప్రెడిక్టబుల్ గా సాగిపోతున్న కథలో వచ్చే ఆసక్తికర మలుపు. అక్కడి నుంచి మళ్లీ ఆధ్యాత్మిక బాటలోకి వచ్చాక బాబా జీవితానికి ఎలాంటి ముగింపు వస్తుందో అని ఆసక్తిగా చూస్తాం. కానీ సినిమాను అబ్రప్ట్ గా ముగించడం కొంత నిరాశ కలిగిస్తుంది. ఈ కథకు ఇంకో పార్ట్ ఉంటుందని లీడ్ ఇవ్వడంతో దాని కోసం ఎదురు చూసేలా చేస్తుంది.

కరోలి బాబాగా శోభినవ్ సత్య బాగా నటించాడు అనడం కంటే జీవించాడు అనొచ్చు. తన నవ్వు.. హావభావాలు ఆ పాత్రకు అవసరమైన డివైనిటీని తీసుకొచ్చాయి. కొన్ని సన్నివేశాల్లో కళ్లతో పలికించిన భావాలు అద్భుతం. సినిమాకు సాంకేతిక హంగులు కూడా బాగా కుదిరాయి. పాటలు.. నేపథ్య సంగీతం కథను ఎలివేట్ చేయడంలో కీలకం అయ్యాయి. విజువల్స్ కూడా బాగున్నాయి. విశాల్ చతుర్వేది ఎంతో నిబద్ధతతో ఈ కథను తెరపైకి తీసుకొచ్చాడు. నిర్మాణ విలువల్లో పరిమితులు కనిపిస్తాయి కానీ.. ఈ కథను ఇలా చెప్పడమే కరెక్ట్ అనిపిస్తుంది. ‘హనుమాన్ అంశ్’ ప్రత్యేకత అంతా.. ఈ కథను నిజాయితీగా-సింపుల్ గా చెప్పడంలోనే ఉంది. ఎక్కడా కృత్రిమంగా అనిపించకుండా జెన్యూన్ ఎమోషన్స్ తో ఆకట్టుకుంటుంది. దీన్నొక సగటు సినిమాలా చూస్తే నచ్చకపోవచ్చు. దైవచింతన.. ఆధ్యాత్మిక భావనలు ఉన్నవాళ్లను ఇది అమితంగా ఆకట్టుకుంటుంది.

చివరగా: హనుమాన్ అంశ్.. కదిలించే కరోలి బాబా కథ

రేటింగ్-2.75/5

Tags:    

Similar News