వాళ్లతో కలిసి ఉండాలి అనుకున్నా : కాజల్‌

టాలీవుడ్‌లో కాజల్ అగర్వాల్‌ అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్న విషయం తెల్సిందే.

Update: 2026-10-09 14:30 GMT

టాలీవుడ్‌లో కాజల్ అగర్వాల్‌ అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్న విషయం తెల్సిందే. అయినా ఇప్పటికీ కాజల్‌ అగర్వాల్‌ సినిమాల్లో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తుంది. సాధారణంగా సౌత్‌ హీరోయిన్స్ పెళ్లి అయిన వెంటనే ఇండస్ట్రీకి దూరం కావడం, కాస్త గ్యాప్‌ తీసుకుని సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అమ్మగా, అక్కగా, అత్తగా సినిమాలు చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ కాజల్‌ అగర్వాల్‌ మాత్రం అలా కాకుండా ఇప్పటికీ హీరోయిన్‌గానే వరుస సినిమాలు చేస్తూనే ఉంది. బాబు పుట్టిన తర్వాత కూడా తన సినిమాల ఎంపిక విషయంలో తేడా చూపించకుండా కమర్షియల్‌ పాత్రలను చేయడం చూడవచ్చు. ప్రస్తుతం కాజల్‌ 'రామాయణ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఆ సినిమాలో మండోదరి పాత్రలో కనిపించబోతుంది. రామాయణంలో మండోదరి పాత్రకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

రణబీర్ కపూర్‌, సాయి పల్లవి రామాయణం...

కెరీర్‌ చివరి దశలో ఉందని భావిస్తున్న సమయంలో రణబీర్‌ కపూర్‌, సాయి పల్లవిలు రాముడు, సీత పాత్రలో నటిస్తున్న రామాయణ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ కి రావణుడి పాత్రలో నటిస్తున్న యశ్‌ కి భార్య పాత్రలో నటించే అవకాశం దక్కింది. కచ్చితంగా మండోదరి పాత్రతో కాజల్ మరో నాలుగు అయిదు ఏళ్లు ఇండస్ట్రీలో కొనసాగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ వర్క్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది దీపావళికి రామాయణ 1 సినిమా రాబోతుంది. వచ్చే ఏడాదిలో రామాయణ 2 రానుంది. రెండో పార్ట్‌ లో యశ్‌ పాత్ర ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. కనుక కాజల్‌ వచ్చే పార్ట్‌లోనే కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాజల్‌ సినిమాలతో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో, సోషల్‌ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉండటం మనం చూస్తూ ఉంటాం.

మండోదరి పాత్రలో కాజల్‌ అగర్వాల్‌...

సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా ఫోటోలు షేర్‌ చేయడం మొదలుకుని, ఇంటర్వ్యూలు, పాడ్‌ కాస్ట్‌లు, టాక్‌ షో లతో కాజల్‌ అగర్వాల్‌ బిజీ బిజీగా ఉంటుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాజల్‌ అగర్వాల్‌ తన ఫ్యామిలీ గురించి, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడింది. ఆ సమయంలో తనకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం అని చెప్పింది. పెళ్లి తర్వాత తన భర్త గౌతమ్‌ కిచ్లుతో మీ అమ్మా నాన్నలతో కలిసి ఉందామని చెప్పిందట. ఆ మాటకు గౌతమ్ కిచ్లు షాక్ అయ్యాడట. చాలా మంది అత్తా మామలకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. కానీ నువ్వు ఏంటీ వారితో కలిసి ఉండాలని అంటున్నావు అని గౌతమ్‌ సరదాగా అన్నాడట. ఆ విషయాన్ని కాజల్‌ అగర్వాల్‌ సన్నిహితులతోనూ చెప్పుకొచ్చింది. తనకు ఉమ్మడి కుటుంబం అంటే ఎందుకు ఇష్టం అనే విషయాన్ని కూడా కాజల్‌ అగర్వాల్‌ చెప్పుకొచ్చింది.

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌...

చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబంలో ఉండటం వల్ల పెళ్లి తర్వాత కూడా అత్తా మామలతో కలిసి ఉండాలని అనుకున్నాను, అందుకే నేను పెళ్లి అయిన కొత్తలోనే గౌతమ్‌ కిచ్లుతో ఆ మాట చెప్పాను అని కాజల్‌ చెప్పుకొచ్చింది. తనకు కొడుకు పుట్టిన తర్వాత కూడా ఇండస్ట్రీలో కొనసాగడంకు ప్రధాన కారణం తన కుటుంబం అని, తనది ఉమ్మడి కుటుంబం కావడం వల్ల బాబు గురించి ఆందోళన లేదని, వారు పూర్తి బాధ్యతను తీసుకున్న కారణంగానే నేను పూర్తి స్వేచ్ఛతో సినిమాల్లో నటిస్తున్నాను, బాబు గురించి ఎలాంటి ఆందోళన లేకుండా షూటింగ్స్ కు హాజరు అవుతున్నాను అని కాజల్‌ అగర్వాల్‌ చెప్పుకొచ్చింది. ఉమ్మడి కుటుంబం వల్లే తాను పెళ్లి అయి, బాబు పుట్టిన తర్వాత ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను అన్నట్లుగా కాజల్‌ అగర్వాల్‌ గతంలోనూ చెప్పుకొచ్చింది. ఈ జనరేషన్‌ అమ్మాయిలు కచ్చితంగా కాజల్‌ అగర్వాల్‌ ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News