అంతస్తు మొత్తం అనుష్క ఫ్యామిలీదే!

బాలీవుడ్ స్టార్ నటి అనుష్క శర్మ-క్రికెటర్ విరాట్ కోహ్లీ దంపతులు రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ పెట్టుబడితో వార్తల్లో నిలిచారు.

Update: 2026-10-09 15:30 GMT

బాలీవుడ్ స్టార్ నటి అనుష్క శర్మ-క్రికెటర్ విరాట్ కోహ్లీ దంపతులు రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ పెట్టుబడితో వార్తల్లో నిలిచారు. ముంబైలోని అత్యంత ఖరీదైన వర్సోవా ప్రాంతంలో ఉన్న గోద్రెజ్ స్కైషోర్ లగ్జరీ ప్రాజెక్ట్‌లో ఒకే భవనంలోని పూర్తి అంతస్తును సొంతం చేసుకున్నారు. బిల్డింగ్‌లోని 24వ అంతస్తులో ఉన్న మొత్తం మూడు లగ్జరీ అపార్ట్‌మెంట్లను అనుష్క శర్మ కుటుంబం కొనుగోలు చేయడం బాలీవుడ్ వర్గాల్లో..రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.

వర్సోవా సముద్ర తీరానికి సమీపంలో రూపొందుతున్న‌ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో 24వ అంతస్తు మొత్తాన్ని అనుష్క ఫ్యామిలీ చేజిక్కించుకుంది. అంతస్తులోని మూడు ఫ్లాట్లలో ఒక దానిని అనుష్క శర్మ తన సొంత పేరిట రిజిస్టర్ చేసుకోగా.. మరొక ఫ్లాట్‌ను తల్లిదండ్రుల పేరిట కొనుగోలు చేశారు. ఇక మూడవ అపార్ట్‌మెంట్‌ను అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంపతులు ఉమ్మడి పేరిట సొంతం చేసుకున్నారు. కుటుంబ సభ్యులందరూ ఒకే చోట ఉంటూనే.. ఎవరి ప్రైవసీ వారికి ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ మూడు లగ్జరీ అపార్ట్‌మెంట్ల మొత్తం విలువ 44.1 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. ముంబై రియల్ ఎస్టేట్ విపణిలో అత్యంత ఖరీదైన డీల్స్‌లో ఒకటిగా నిలిచిన కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, అవసరమైన స్టాంప్ డ్యూటీ చెల్లింపులు పూర్తయినట్లు సమాచారం. ఆధునిక సదుపాయాలు, అరేబియా సముద్ర అందాలు స్పష్టంగా కనిపించేలా రూపకల్పన చేసిన ఈ సీ-ఫేసింగ్ అపార్ట్‌మెంట్లు అత్యంత విలాసవంతంగా ఉండనున్నాయి.

గోద్రెజ్ స్కైషోర్ పేరుతో నిర్మిస్తున్న ఈ టవర్‌లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న లగ్జరీ ప్రాజెక్ట్‌ను 2031 నాటికి కొనుగోలుదారులకు స్వాధీనం చేయనున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. వినోద, వ్యాపార రంగాలకు కేంద్రంగా ఉన్న ముంబై వెస్ట్ ప్రాంతంలో ఈ భవనం నిర్మితమవుతోంది.

విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ దంపతులకు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ముంబైలోని వోర్లీ ప్రాంతంలో కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్‌తో పాటు గురుగ్రామ్, అలీబాగ్‌లలో భారీ విల్లాలు, ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. దీర్ఘకాలిక ఆస్తి భద్రతతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముంబైలోని కీలక ప్రాంతాల్లో క్రమం తప్పకుండా ప్రాపర్టీలను సొంతం చేసుకుంటున్నారు.

సినిమాలు, గేమ్‌తో పాటు వ్యాపారాలు , రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఈ జంట సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఆస్తుల విలువను భారీగా పెంచుకుంటున్నారు. ముంబైలో 24వ అంతస్తు మొత్తం కొనుగోలు చేసి అనుష్క కుటుంబం ఒకే చోట నివాసం ఉండాలని ప్లాన్ చేసుకోవడం పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News