జనరేషనల్ ట్రామా పై రష్మిక షాకింగ్ కామెంట్స్

ఇక జనరేషనల్ ట్రామా అనే అంశాన్ని కూడా రష్మిక ప్రస్తావించడం చర్చకు కొత్త కోణాన్ని తీసుకొచ్చింది.;

Update: 2026-05-01 11:30 GMT

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్నా రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు తల్లిదండ్రుల పెంపకం, పిల్లలపై అంచనాలు వంటి అంశాలపై సమాజంలో విస్తృత చర్చకు దారితీశాయి. పిల్లలను కనడ‌మ‌నేది కేవలం సహజ ప్రక్రియ మాత్రమే కాకుండా ఒక బాధ్యతతో కూడిన నిర్ణయం అని ఆమె అభిప్రాయపడ్డారు. అంతే కాదు, చాలా సందర్భాల్లో మనుషులు తమ వారసత్వాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే పిల్లలను కనాలని భావిస్తారని, ఈ కోణంలో చూస్తే అది కొంతవరకు స్వార్థపూరిత ఎంపికగా కూడా కనిపిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో ర‌ష్మిక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

ఈ సంద‌ర్భంగా రష్మిక ముఖ్యంగా పిల్లలపై తల్లిదండ్రులు పెట్టే ఎమోష‌న‌ల్ ప్రెజ‌ర్ గురించి ప్రస్తావించారు. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు తాము సాధించలేని లక్ష్యాలను పిల్లల ద్వారా సాధించాలని ప్రయత్నించడం కామ‌న్ అయిపోయింద‌ని ఆమె పేర్కొన్నారు. తమ గత అనుభవాలు, బాధలు, ఆశలు అన్నీ కలిపి పిల్లలపై మోపడం వల్ల వారి వ్యక్తిత్వం దెబ్బతింటుందని హెచ్చరించారు. పిల్లలు తల్లిదండ్రుల కలల్ని నెరవేర్చడానికి పుట్టరని, వారు తమ సొంత లక్ష్యాలతో, వ్యక్తిత్వంతో ఎదగాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.

ఇక జనరేషనల్ ట్రామా అనే అంశాన్ని కూడా రష్మిక ప్రస్తావించడం చర్చకు కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. ఒక తరం ఎదుర్కొన్న భావోద్వేగ గాయాలు, అసురక్షిత భావాలు తదుపరి తరానికి అనుకోకుండా బదిలీ అవుతుంటాయని, వాటిని పరిష్కరించకుండా ముందుకు సాగితే పిల్లలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆమె హెచ్చరించారు. తల్లిదండ్రులు ముందుగా తమ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించుకోవాలని, అప్పుడు మాత్రమే పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించగలరని ఆమె సూచించారు. ప్రేమ అనేది పిల్లల స‌క్సెస్‌ల‌పై ఆధారపడకూడదని, అది నిరుపాధికంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె ఈ సంద‌ర్భంగా చెప్పారు.

పిల్లలు పుట్టమని అడగర‌ని, మనమే వారిని ఈ ప్రపంచంలోకి తీసుకువస్తామ‌ని, అలాంట‌ప్పుడు వారిని ఎంతో అపురూపంగా చూసుకోవాల‌ని, పిల్ల‌ల్ని తమ ఆశయాలను నెర‌వేర్చేవారిలా కాకుండా, స్వ‌తంత్ర‌ వ్యక్తులుగా చూడాలని ఆమె సూచించారు. అయితే ఈ కామెంట్స్ కు విభిన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కొందరు ఆమె అభిప్రాయాలను సమాజంలో మార్పుకు దారితీసే ధైర్యమైన ఆలోచనగా అభివర్ణిస్తుంటే, మరికొందరు సంప్రదాయ కుటుంబ విలువలకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శిస్తున్నారు. మొత్తంగా చూస్తే, రష్మిక మందన్న చేసిన వ్యాఖ్యలు తల్లిదండ్రుల పెంపక విధానాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తాయి. పిల్లలను ఒక బాధ్యతగా మాత్రమే కాకుండా, స్వతంత్ర వ్యక్తులుగా గౌరవించే దిశగా ఆలోచించాలని ఆమె సూచన కనిపిస్తోంది.

Tags:    

Similar News