నలిగిపోవడం ఇష్టంలేకే వెనక్కి తగ్గుతున్నారా?
సంక్రాంతి రేస్.. అందులోనూ తెలుగు నుంచి ఐదు సినిమాలు పోటీలో ఉండటం, థియేటర్లు ఉన్న సినిమాలకే అనుకున్న స్థాయిలో సర్దుబాటు అయ్యే అవకాశం అంతంత మాత్రమే ఉండటంతో ఓ సినిమా టీమ్ వెనక్కి తగ్గుతున్నట్టుగా తెలుస్తోంది.;
సంక్రాంతి రేస్.. అందులోనూ తెలుగు నుంచి ఐదు సినిమాలు పోటీలో ఉండటం, థియేటర్లు ఉన్న సినిమాలకే అనుకున్న స్థాయిలో సర్దుబాటు అయ్యే అవకాశం అంతంత మాత్రమే ఉండటంతో ఓ సినిమా టీమ్ వెనక్కి తగ్గుతున్నట్టుగా తెలుస్తోంది. అదే శివకార్తికేయన్ `పరాశక్తి`. భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న తమిళ హీరో శివకార్తికేయన్ `అమరన్` తరువాత ఆ స్థాయి హిట్ కోసం శ్రమిస్తున్నాడు. ఏ.ఆర్. మురుగదాస్‌ని నమ్ముకుని చేసిన `మదరాసి` డిజాస్టర్ అనిపించుకుని షాక్ ఇవ్వడంతో అతని దృష్టంతా ఇప్పుడు `పరాశక్తి`పై పడింది.
సూర్యతో `ఆకాశమే నీ హద్దురా` సినిమాతో సూపర్‌హిట్‌ని తన ఖాతాలో వేసుకుని డైరెక్టర్‌గా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది సుధా కొంగర. కొంత విరామం తరువాత చేస్తున్న మూవీ `పరాశక్తి`. శివకార్తికేయన్, జయం రవి, అధర్వ, శ్రీలీల కీలక పాత్రల్లో నటించారు. డౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ మూవీని 1960 టైమ్‌లో మద్రాస్‌లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో రూపొందించారు. పీరియాడికల్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే తమిళనాట మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
రానా దగ్గుబాటి, మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్ కీలక అతిథి పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని ముందు తమిళ వెర్షన్‌తో పాటు తెలుగు వెర్షన్‌ని జనవరి 14న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఆ తరువాత ఆ డేట్‌ని కాస్త మార్చి జనవరి 10నే రాబోతున్నారు. ఉన్నట్టుండీ డేట్ మారడానికి కారణం `జన నాయకుడు` టీమ్ అని తెలుస్తోంది. ఇదే సంక్రాంతికి దళపతి లాస్ట్ మూవీ `జన నాయగన్` జనవరి 9న రిలీజ్ అవుతుండటంతో `పరాశక్తి`కి థియేటర్లు లభించని పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని మేకర్స్ 14 నుంచి 10కి మార్చేశారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
ఒక్క రోజు వ్యవధితో `పరాశక్తి` రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో థియేటర్లని సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. కానీ తెలుగులో మాత్రం `పరాశక్తి` ఈ సంక్రాంతికి విడుదలయ్యే పరిస్థితుల కనిపించడం లేదని లేటెస్ట్ న్యూస్. కారణం తెలుగు సినిమాలు ఐదు సంక్రాంతి బరిలో దిగుతుండటంతో వాటితో పాటు విజయ్ జన నాయకుడు`కు థియేటర్లు సర్దుబాటు చేస్తున్నారు కాబట్టి `పరాశక్తి`కి ఈ టైమ్‌లో థియేటర్లు లభించవని తెలుస్తోంది. ఒకవేళ ఫైట్ చేసి అరకొర థియేటర్లని దక్కించుకున్నా తెలుగు సినిమాల ప్రవాహంలో నిలబడం కష్టమవుతుందని, ఇన్ని సినిమాల మధ్య నలిగిపోవడం కంటే తెలుగు వెర్షన్‌ని రెండు వారాలు ఆపి రిలీజ్ చేస్తే మేలని మేకర్స్ వెనక్కి తగ్గినట్టుగా ఇన్ సైడ్ టాక్.
శివ కార్తికేయన్ కూడా `పరాశక్తి`కి `అయలన్` పరిస్థితి తలెత్తడం ఇష్టలేదని, తను కూడా ఇందుకు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. `రెమో, `అమరన్` సినిమాలతో శివకార్తికేయన్‌కు తెలుగులో మంచి బేస్ ఏర్పడింది. గత ఏడాది సంక్రాంతికి శివకార్తికేయన్ `అయలన్`తో తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని అలరించాలనుకున్నారు. అయితే ఆ సమయంలో తెలుగు సినిమాల నుంచి గట్టి పోటీ ఉండటం, థియేటర్లు లభించే పరిస్థితి లేకపోవడంతో తెలుగు వెర్షన్ రిలీజ్‌ని వాయిదా వేశారు. తరువాత కూడా పరిస్థితులు అనుకూలించకపోవడంతో టీవీల్లో మాత్రమే చూడాల్సి వచ్చింది.