మారుతోన్న హీరోయిన్ల దృక్పథం!

పాన్ ఇండియా సినిమా అనగానే భారీ యాక్షన్.. హీరోల ఎలివేషన్లు మాత్రమే కాదు. దానికి తగిన బలమైన విలనిజం లేదా సహాయక పాత్రలు ఉండటం అనివార్యమైంది.

Update: 2026-07-17 13:30 GMT

పాన్ ఇండియా చిత్రాల ప్రభావం పెరిగినప్పటి నుంచి నటీమణుల దృక్పథంలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో హీరోయిన్ అంటే? హీరో పక్కన పాటలు పాడటం, రొమాంటిక్ సన్నివేశాలకే పరిమితం కావడం అనే పాత ఛాయాచిత్రం మాయమైపోయింది. ప్ర‌స్తుతం కథాంశమే ప్రధానంగా మార‌డంతో? గ్లామర్ పాత్రల కంటే కథను మలుపు తిప్పే బలమైన పాత్రలకే హీరోయిన్లు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ మార్పు వల్ల నటీమణుల కెరీర్ గ్రాఫ్ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది.

ప్రస్తుత తరం హీరోయిన్లు లీడ్ రోల్స్ కే పరిమితం కాకుండా? పాత్ర‌ ప్రాముఖ్యతను బట్టి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను లేదా కథకు కీలకంగా ఉండే సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. రష్మిక మందన‌ వంటి యువ తారలు ప్యాన్ ఇండియా ప్రాజెక్టులలో భాగస్వాములవుతూనే పాత్రకు ఉన్న పరిధిని విస్తరిం చుకుంటున్నారు. రుక్మిణి వసంత్ వంటి కొత్త తరం నటీమణులు కూడా కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాలకే మొదటి ప్రాధాన్యతనిస్తున్నారు. నటిగా తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

సీనియర్ హీరోయిన్ల విషయానికి వస్తే నయనతార, కాజల్ అగర్వాల్, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లు ఈ మార్పుకు మార్గ దర్శకులుగా నిలుస్తున్నారు. వీరు కేవలం కమర్షియల్ హంగులకే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించడంతో పాటు పెద్ద బడ్జెట్ సినిమాల్లో అత్యంత ప్రభావవంతమైన పాత్రలను పోషిస్తున్నారు. ఒకప్పుడు గ్లామర్ పాత్రలకే పరిమితమైన భామలంతా ఇప్పుడు కథలో పవర్ ఫుల్ పర్ఫామెన్స్ ఇస్తూ కెరీర్‌ను సుదీర్ఘకాలం కొన సాగిస్తున్నారు. ఇది ఇతర నటీమణులకు కొత్త స్ఫూర్తినిస్తోంది.

పాన్ ఇండియా సినిమా అనగానే భారీ యాక్షన్.. హీరోల ఎలివేషన్లు మాత్రమే కాదు. దానికి తగిన బలమైన విలనిజం లేదా సహాయక పాత్రలు ఉండటం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం వల్ల నటీమణులకు మరింత పెర్ఫార్మెన్స్ చూపించే అవకాశం దక్కుతోంది. ఇలాంటి పాత్రలు చేయడం వల్ల ప్రేక్షకులలో నటిగా వారిపై ఉండే గౌరవం పెరగడమే కాకుండా విభిన్నమైన నటనను ప్రదర్శించే ఛాన్స్ లభిస్తుంది. పాన్ ఇండియా ట్రెండ్ వల్ల నటీమణుల ఆలోచనా విధానం క్షేత్రస్థాయిలో ఎంతగా మారిందో? చెప్పడానికి ఇదే నిదర్శనం.

ప్రేక్షకులు కూడా హీరోయిన్ గ్లామర్ కోసం కాకుండా? పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉందనే విషయాన్ని గమనిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నటీమణులు కూడా అంచనాలను పెంచుకుని నటనను నిరూపించుకునే అవకాశం ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాలైనా? చిన్న బడ్జెట్ చిత్రాలైనా? సరే తమ పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే అంగీకరిస్తున్నారు. ఈ పరిణామం పరిశ్రమలో కొత్త నటీమణులకు, పాత తరం హీరోయిన్లకు ఒకే రకమైన అవకాశాలను సృష్టిస్తోంది.

మొత్తంమీద పాన్ ఇండియా ట్రెండ్ వల్ల హీరోయిన్లు కథానాయికలుగానే కాకుండా కళాకారులుగా తమను తాము ఆవిష్కరించుకుంటున్నారు. ఒకే రకమైన పాత్రల్లో చిక్కుకుపోకుండా విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలను ఎంచుకోవడం వల్ల వారికి నటనలో వైవిధ్యం లభిస్తోంది. భవిష్యత్తులో ఈ ధోరణి మరింత పెరిగి నటీమణులకు మరింత ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభించే అవకాశం ఉంది. పరిశ్రమలో వస్తోన్న ఈ ర‌క‌మైన‌ సానుకూల మార్పు భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News