'పద్మశ్రీ' అందుకున్న మొట్టమొదటి భార‌తీయ‌ హాస్యనటుడు!

తెలుగు సినిమా స్వర్ణయుగంలో తనదైన మార్క్‌ నవ్వు.. విలక్షణమైన యాసతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహానటుడు రేలంగి వెంకట్రామయ్య.

Update: 2026-07-03 00:30 GMT

తెలుగు సినిమా స్వర్ణయుగంలో తనదైన మార్క్‌ నవ్వు.. విలక్షణమైన యాసతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహానటుడు రేలంగి వెంకట్రామయ్య. వెండితెరపై ఆయన కనిపిస్తే చాలు థియేటర్లలో నవ్వుల పువ్వులు పూసేవి. భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన `పద్మశ్రీ` అందుకున్న దేశంలోనే మొట్టమొదటి హాస్యనటుడిగా రేలంగి చారిత్రాత్మక రికార్డు సృష్టించారు. `హాస్య నట చక్రవర్తి`గా కోట్లాది మందిని అలరించిన ఈ మహోన్నత నటుడి వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, అలాగే ఎవరికీ తెలియని ఆసక్తికరమైన జీవిత కథ దాగి ఉంది.

1910 ఆగస్టు 9న కాకినాడ సమీపంలోని రావులపాడులో జన్మించిన రేలంగి.. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి పితృవాత్సల్యంతో పెరిగారు. ఆయన తండ్రి రామస్వామి హరికథకులు, సంగీత విద్వాంసులు కావడంతో రేలంగికి చిన్ననాడే కళలపై మక్కువ ఏర్పడింది. తండ్రి తనను పోలీస్ ఆఫీసర్‌గా చూడాలనుకున్నా.. రేలంగికి నాటకాలపై ఉన్న పిచ్చితో చదువు అబ్బలేదు. తొమ్మిదో తరగతి ఫెయిల్ కావడంతో తండ్రి చేతిలో దెబ్బలు తిన్నా ఆయనలోని నటుడు ఆగలేదు. కాకినాడ `హ్యాపీ క్లబ్` నాటకాల ద్వారా నటనలో ఓనమాలు నేర్చుకుని..తండ్రి ఆశీస్సులతో రంగస్థలంపై పదేళ్లపాటు రాటుదేలారు. ఆ పట్టుదలే 1930ల కాలంలో ఆయన్ను సినీ రాజధానిగా ఉన్న కలకత్తా వైపు నడిపించింది.

సినీ ప్రయాణంలో రేలంగి దాదాపు 15 ఏళ్లపాటు తెర వెనుక అసిస్టెంట్ డైరెక్టర్‌గా, ప్రొడక్షన్ అసిస్టెంట్ గా, కాస్టింగ్ ఏజెంట్‌గా ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆ సమయంలోనే భానుమతి, అంజలీదేవి, కృష్ణవేణి వంటి మహానటీమణులను ఆయనే ఇండస్ట్రీకి పరిచయం చేయడం విశేషం. మద్రాసు చేరిన కొత్తలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు చవిచూశారు. భార్య, తండ్రి అనారోగ్యానికి గురైతే వైద్యం చేయించడానికి కూడా డబ్బుల్లేని దుస్థితిని ఎదుర్కొన్నారు. అయితే 1948లో వచ్చిన వింధ్యరాణి, ఆ తర్వాత కీలుగుర్రం, గుణసుందరి కథ చిత్రాలు ఆయన తలరాతను మార్చేశాయి. ఇక 1950 నుండి 1970 వరకు రెండు దశాబ్దాల పాటు రేలంగి లేని తెలుగు సినిమా ఊహించుకోలేనంతగా ఆయన బిజీ అయిపోయారు.

కేవలం హాస్యనటుడిగానే కాకుండా.. హీరోలతో సమానమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారాయన. `మిస్సమ్మ`, `మాయాబజార్`,`పాతాళభైరవి` వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు అజరామరం. సరదా సరదా సిగరెట్టు, ధర్మం చెయ్ బాబు వంటి పాటలతో గాయకుడిగానూ మెప్పించారు. కొత్త తరం కమెడియన్ల కోసం తన సినిమాల సంఖ్యను తగ్గించుకుంటూ పత్రికల్లో ప్రకటన ఇచ్చి.. రాజబాబు, పద్మనాభం వంటి నటుల ఎదుగుదలకు కారణమైన ఆయన ధాతృత్వం నిజంగా గొప్పది. ఆ దయాగుణంతోనే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో స్థిరపడి.. నిత్యం అన్నదానాలు చేస్తూ... పేదలకు సహాయం చేస్తూ అక్కడి ప్రజల గుండెల్లో దేవుడయ్యారు.

కళారంగానికి ఆయన చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం `పద్మశ్రీ`తో సత్కరించింది. తాడేపల్లిగూడెంలో అత్యాధునిక వసతులతో `రేలంగి చిత్ర మందిర్` అనే థియేటర్ నిర్మించి స్థానిక ప్రజలకు హాలీవుడ్ చిత్రాలను సైతం పరిచయం చేశారు. జీవితాంతం ఇతరుల ముఖాల్లో నవ్వులు పూయించిన ఈ నవ్వుల రేడు.. చివరి రోజుల్లో తీవ్రమైన కీళ్లనొప్పి, ఎముకల వ్యాధితో నడుము భాగం పక్షవాతానికి గురై ఎంతో నరకం అనుభవించారు. చివరకు 1975 నవంబర్ 27న తాడేపల్లిగూడెంలోని తన నివాసంలోనే ఈ హాస్య నట చక్రవర్తి కన్నుమూశారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా.. తెలుగు సినిమా ఉన్నంత కాలం అత‌డు పంచిన నవ్వులు అమరంగా నిలిచే ఉంటాయి.

Tags:    

Similar News