అమెరికాలో టేలర్ స్విఫ్ట్ పెళ్లి.. వెలుగులోకి 'ఇన్ఫోసిస్ ఇండియా' లింక్

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న పాప్ సంచలనం టేలర్ స్విఫ్ట్... అమెరికన్ ఫుట్‌బాల్ స్టార్ ట్రావిస్ కెల్స్ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారనే వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Update: 2026-07-02 16:10 GMT

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న పాప్ సంచలనం టేలర్ స్విఫ్ట్... అమెరికన్ ఫుట్‌బాల్ స్టార్ ట్రావిస్ కెల్స్ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారనే వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ప్ర‌ఖ్యాత‌ ఫోర్బ్స్ కథనం ప్రకారం.. ఈ జంట న్యూయార్క్ నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మాడిసన్ స్క్వేర్ గార్డెన్ (ఎంఎస్ జి) కాంప్లెక్స్‌లో కేవలం 100 మంది అత్యంత సన్నిహితుల సమక్షంలో ఒక ప్రైవేట్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. అయితే ఈ వేడుక జరుగుతున్న‌ వేదికకు ఒక అరుదైన, బలమైన `భారతీయ కనెక్షన్` ఉండటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ సెలబ్రిటీ జంట తమ జీవితంలోని అత్యంత కీలకమైన ఘట్టం కోసం ఎంచుకున్న వేదిక పేరు `ఇన్ఫోసిస్ థియేటర్`. అమెరికా గుండెకాయ లాంటి న్యూయార్క్ నగరంలోని ఈ ఐకానిక్ థియేటర్ పేరు వెనుక మన భారతదేశానికి చెందిన ప్రముఖ ఐటీ దిగ్గజం `ఇన్ఫోసిస్` ఉండటం విశేషం. గతంలో `హులు థియేటర్`గా పిలుచుకున్న‌ ఈ వెన్యూ నామింగ్ రైట్స్ (పేరు హక్కులను) మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కుదుర్చుకున్న భారీ ఒప్పందం ద్వారా ఇన్ఫోసిస్ దక్కించుకుంది. దీంతో ఈ చారిత్రాత్మక వేదికకు భారతీయ కంపెనీ పేరు శాశ్వత ముద్రగా మారింది.

దాదాపు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ థియేటర్ 1968లో ప్రారంభమైంది. అప్పటి మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ప్రెసిడెంట్ ఇర్వింగ్ మిచెల్ ఫెల్ట్ జ్ఞాపకార్థం దీనిని మొదట `ఫెల్ట్ ఫోరమ్` అని పిలిచేవారు. కాలక్రమేణా పారామౌంట్ థియేటర్, వాము థియేటర్, హులు థియేటర్‌గా రూపాంతరం చెందుతూ.. ప్రస్తుతం ఇన్ఫోసిస్ థియేటర్‌గా గ్లోబల్ గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 5600 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ వేదిక..ప్రపంచంలోనే అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే థియేటర్లలో ఒకటిగా నిలుస్తోంది.

గత అరవై ఏళ్లుగా ఈ ఇన్ఫోసిస్ థియేటర్ ఎన్నో అంతర్జాతీయ సాంస్కృతిక, క్రీడా మైలురాళ్లకు వేదికగా నిలిచింది. ఎల్టన్ జాన్, బాబ్ డైలాన్, డయానా రాస్, జాన్ లెజెండ్ వంటి లెజెండరీ సంగీతకారులు ఇక్కడే తమ అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. కేవలం సంగీతమే కాకుండా ఎన్‌బిఎ , ఎన్‌ఎఫ్ఎల్ డ్రాఫ్ట్‌లు, వరల్డ్ సిరీస్ ఆఫ్ డార్ట్స్ .. ప్రతిష్టాత్మక బాక్సింగ్ మ్యాచ్‌లు ఇక్కడే జరిగాయి. అంతేకాకుండా.. అమెరికాలో పాపులర్ అయిన `అమెరికన్ ఐడల్` ఆడిషన్స్, డేటైమ్ ఎమ్మీ అవార్డ్స్ వంటి టీవీ షోస్ కూడా ఇక్కడే రికార్డ్ అయ్యాయి.

పాప్ క్వీన్ టేలర్ స్విఫ్ట్‌కు మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌తో విడదీయరాని బంధం ఉంది. స్విఫ్ట్ తన కెరీర్‌లో ఈ కాంప్లెక్స్‌లోని మెయిన్ అరేనాలో ఎన్నో హౌస్‌ఫుల్ కాన్సెర్ట్స్ నిర్వహించి రికార్డులు సృష్టించింది. అయితే విచిత్రంగా టేల‌ర్ ఇప్పటివరకు ఈ ఇన్ఫోసిస్ థియేటర్ లోపల ఒక్కసారి కూడా ప్రదర్శన ఇవ్వలేదు. ఒకవేళ ట్రావిస్ కెల్స్‌తో ఈ వివాహ వేడుక వార్తలు నిజమైతే.. ప్రదర్శనల పరంగా కాకపోయినా.. తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత మధురమైన జ్ఞాపకం ద్వారా ఈ ఇండియా టైటిల్ ఉన్న‌ వేదికతో టేలర్ స్విఫ్ట్ బంధం ఎప్పటికీ నిలిచిపోతుంది. టేలర్ ఇండియా అభిమానులు దీనిని సెంటిమెంట్ గాను ఫీల‌వుతార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌స్తుతం టేల‌ర్ స్విఫ్ట్ పెళ్లికి టాప్ హాలీవుడ్ సెల‌బ్రిటీలు అటెండ‌వుతున్నారు.

Tags:    

Similar News