త‌న ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీపై అఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన లెనిన్ జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది.

Update: 2026-07-02 17:30 GMT

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన లెనిన్ జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇటీవల రిలీజైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న అఖిల్ తన సినీ ప్రయాణం, నటుడిగా తన ఆలోచనల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు. ముఖ్యంగా తనకు అత్యంత ఇష్టమైన సినిమా గురించి చేసిన అఖిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మామూలుగా అఖిల్ త‌న ఫేవ‌రెట్ మూవీగా త‌న తండ్రి సినిమానో లేదంటే త‌న తాత‌య్య గారి సినిమా పేరో చెప్తాడ‌నుకుంటే రంగ‌స్థ‌లం సినిమా పేరు చెప్పి అంద‌రికీ షాకిచ్చాడు. తన ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీ రంగస్థలం అని, దానికి గ‌ల కార‌ణాన్ని కూడా వెల్ల‌డించాడు అఖిల్. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఆ సినిమా తనపై ఎంతో ప్రభావం చూపిందని వెల్లడించాడు. టాలీవుడ్‌ను తాను రంగస్థలం ముందు.. రంగస్థలం తర్వాత అనే విధంగా చూస్తానని చెప్పడం మ‌రింత ఆస‌క్తిని క‌లిగించింది. కమర్షియల్ సినిమాల్లో కూడా కొత్త ఆలోచనలతో ప్రయోగాలు చేయవచ్చని తనకు నమ్మకం కలిగించిన సినిమా అదే అని అఖిల్ వివరించాడు.

కమర్షియల్ హీరోకు వినికిడి సమస్య ఉన్న క్యారెక్ట‌ర్ రాయ‌డం సాధారణ విషయం కాదని, అలాంటి పాత్రను కథలో ప్రధాన బలంగా మార్చడం డైరెక్ట‌ర్ సుకుమార్ ప్రతిభకు నిదర్శనమని అన్నాడు. సినిమాలో హీరోకు ఉన్న లోపం కారణంగానే ఎన్నో సమస్యలు ఎదురవడం, కొన్ని సందర్భాల్లో అతని వల్లే కథలో సంఘర్షణలు ఏర్పడడం వంటి అంశాలు తనను బాగా ఆకట్టుకున్నాయని చెప్పాడు. సాధారణంగా హీరో పాత్రను అన్ని విధాలా పర్ఫెక్ట్‌గా చూపించే ట్రెండ్‌కు భిన్నంగా, హీరో పాత్ర‌కు స‌మ‌స్య‌ను పెట్టి దాన్ని ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో చూసి ఆశ్చర్యపోయానని తెలిపాడు.

రామ్ చరణ్ నటనను కూడా అఖిల్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. కమర్షియల్ స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ అలాంటి పాత్ర‌ను ఒప్పుకుని, దానిని అంత సహజంగా పోషించడం గొప్ప విషయమని అన్నాడు. ఆ పాత్రలో చరణ్ చూపించిన ఎమోషన్స్, బాడీ లాంగ్వేజ్, పాత్ర ప‌ట్ల చూపించిన డెడికేష‌న్ త‌న‌కెంతో ఇన్‌స్పైరింగ్ గా అనిపించింద‌ని అఖిల్ తెలిపాడు. రంగస్థలం చూసిన తర్వాతే తాను కూడా కెరీర్‌లో కొత్త తరహా పాత్రలు చేయాలనే ఆలోచనకు వచ్చానని అఖిల్ చెప్పాడు. ఆడియ‌న్స్ మంచి కథ, బలమైన పాత్రలను ఎప్పుడూ ఆదరిస్తారని ఆ సినిమా నిరూపించిందని పేర్కొన్నాడు. అంతేకాదు, అదే సినిమా ఇప్పుడు రిలీజై ఉంటే దేశవ్యాప్తంగా మరింత పెద్ద సంచలనం సృష్టించేదని అఖిల్ త‌న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అఖిల్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. మెగా ఫ్యాన్స్ తో పాటు మూవీ ల‌వ‌ర్స్ కూడా ఆయన అభిప్రాయానికి మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు, లెనిన్ పై కూడా ఈ కామెంట్స్ తో మరింత ఆసక్తి పెరిగింది. భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటించిన లెనిన్ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించగా, సూర్యదేవర నాగవంశీ, నాగార్జున సంయుక్తంగా నిర్మించారు. త‌మన్ సంగీతం అందించిన ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News