దసరా ధమాకాలు దడదడలాడించేలా!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీజన్ ఏదైనా? దసరా పండుగకు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద ఏటా దసరా పోటీ పండగ వాతావరణాన్ని తీసుకొస్తుంది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీజన్ ఏదైనా? దసరా పండుగకు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద ఏటా దసరా పోటీ పండగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ లో విజయ్ దేవరకొండ నటిస్తోన్న `రణబాలి` మాత్రమే అధికారికంగా విడుదల తేదీని ప్రకటించుకోవడంతో ప్రేక్షకుల దృష్టి అంతా అక్టోబర్ వైపు మళ్లింది. దసరా కానుకగా విడుదల కానున్న చిత్రాల జాబితా చూస్తుంటే ఈసారి అక్టోబర్ లో బాక్సాఫీస్ వద్ద రసవత్తరమైన పోటీకి వేదిక కావడం ఖాయమనిపిస్తోంది.
ప్రస్తుతానికి దసరా రేసులో అగ్ర హీరోల చిత్రాలు ముందు వరుసలో ఉన్నాయి. వెంకటేష్ నటిస్తోన్న `ఆదర్శ కుటుంబం` చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించే ఎమోషన్స్‌తో రాబోతున్న సినిమా దసరాకు పర్ఫెక్ట్ ఛాయిస్‌గా కనిపిస్తోంది. మరోవైపు వైవిధ్యమైన కథలతో ముందుండే స్టార్స్ భారీ ప్రాజెక్టులతో దసరా బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు. పండుగ సెలవులను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాల విడుదల తేదీలను నిర్మాతలు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.
ఈ పోటీలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న `విశ్వంభర`. అత్యున్నత సాంకేతిక విలువలతో, ఫాంటసీ -యాక్షన్ కలబోసిన ఈ చిత్రం దసరా బాక్సాఫీస్ వద్ద ఒక పెద్ద ఈవెంట్‌గా మారే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ - తారాగణంతో వస్తున్న చిత్రం పండుగ సీజన్‌ను ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. అంతా అనుకూలిస్తే ప్రభాస్ నటిస్తోన్న `పౌజీ` నుంచి కూడా రిలీజ్ డేట్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే బాగా ఆలస్యమైన నేపథ్యంలో వీలైనంత త్వరగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి పెద్ద చిత్రాల మధ్య పోటీ పడటం వల్ల బాక్సాఫీస్ కలెక్షన్లు కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఈ జాబితాకు అదనంగా మరికొన్ని చిత్రాలు కూడా చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దసరా పండుగను దృష్టిలో పెట్టుకుని చిన్న - మధ్యతరహా చిత్రాల నిర్మాతలు కూడా తమ సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అక్టోబర్ నెలలో థియేటర్ల దగ్గర సందడి మరింత పెరగనుంది. పండుగకు సెలవులు ఉండటం వల్ల ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువ ఆప్షన్లు దొరుకుతాయని చెప్పొచ్చు.
దసరా అంటేనే విజయ సంబరం. ఈసారి బాక్సాఫీస్ వద్ద జరగబోయే ఈ ధమాకా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. `విశ్వంభర`, `ఆదర్శ కుటుంబం` సహా పలు చిత్రాలతో కూడిన పండుగ సీజన్ టాలీవుడ్‌కు ఆర్థికంగా కూడా ఎంతో కలిసి రావాలని ఆశిద్దాం. పండగ రోజున థియేటర్ల వద్ద ప్రేక్షకులతో నిండిన సందడిని చూసేందుకు పరిశ్రమతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.