భారతీయ సినిమాల్లో రక్తపాతం-హింస పాశ్చాత్య వెబ్ సిరీస్‌ల ప్రభావమా?
ఈ రకమైన డిజిటల్ కంటెంట్ ప్రభావం కేవలం ఓటీటీలకే పరిమితం కాకుండా ఇటీవల భారతదేశంలోని బిగ్ స్క్రీన్ పైకి కూడా వేగంగా విస్తరిస్తోంది.
నేటి డిజిటల్ యుగంలో అరచేతిలో ఇమిడిపోయే బుల్లి స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచ వినోద సరళిని పూర్తిగా మార్చివేశాయి. ఒకప్పుడు సెన్సార్ బోర్డు నిబంధనల వల్ల వెండితెరపై చూపించలేని అత్యంత తీవ్రమైన హింస, రక్తపాతం ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల పుణ్యమా అని నేరుగా మారుమూల ప్రజల డిజిటల్ హాళ్లలోకి చేరుతున్నాయి. ముఖ్యంగా పాశ్చాత్య వెబ్ సిరీస్‌లు ఈ వయోలెన్స్ ట్రెండ్‌కు ప్రధానంగా బీజం వేశాయి. ఇటీవల విజయవంతంగా ముగిసిన `హౌస్ ఆఫ్ ది డ్రాగన్` సీజన్ 3 ఫినాలే ఎపిసోడ్ 8 లో రేనిరా నిరంకుశత్వం.. టంబుల్‌టన్ పోరాటంలో నరుకుడు.. డ్రాగన్ల దాడులతో రక్తం ఏరులై పారడమే దీనికి తాజా నిదర్శనం.
ఈ రకమైన డిజిటల్ కంటెంట్ ప్రభావం కేవలం ఓటీటీలకే పరిమితం కాకుండా ఇటీవల భారతదేశంలోని బిగ్ స్క్రీన్ పైకి కూడా వేగంగా విస్తరిస్తోంది. స్పార్టకస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, ది బోయ్స్, వైకింగ్స్, ది వాకింగ్ డెడ్ , గాంగ్స్ ఆఫ్ లండన్ వంటి పాశ్చాత్య సిరీస్‌లు రక్తం చిందే సన్నివేశాలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. శత్రువుల శరీర భాగాలు తెగిపడటం.. క్రూరమైన హత్యలు.. నరరూప రాక్షసత్వం వంటి అంశాలను ఈ సిరీస్‌లు కథలో భాగమైన సహజ సిద్ధమైన ఎమోషన్‌గా మార్చి చూపించాయి. ఈ గ్లోబల్ ట్రెండ్‌ను నిరంతరం వీక్షిస్తున్న ప్రేక్షకులు కూడా రా ప్రాక్టికల్ యాక్షన్‌కు అలవాటు పడ్డారు. ఇది భారతదేశంలోని సినిమా థియేటర్లకు కూడా పాయిపోయింది. మన క్రియేటర్ల నరనరానా ఇప్పుడు ఈ క్రూరత్వం, రక్తపాత క్రియేటివిటీ పారుతోంది.
ఇదే విధానాన్ని ఇప్పుడు భారతీయ దర్శకులు తమ సినిమాల్లో స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఒకప్పుడు పగ- ప్రతీకారం అంటే కేవలం డైలాగ్‌లు.. కొద్దిపాటి పోరాటాలకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు పాశ్చాత్య సిరీస్‌ల ప్రభావంతో మన దర్శకులు కూడా రక్తపాతం.. తెగ నరుకుడు.. కసాయి ఎపిసోడ్లతో నిండి ఉన్న కథల్ని ఎంచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన చాలా భారతీయ చిత్రాల్లో గొడ్డళ్లు, కత్తులతో నరుక్కోవడాలు..మెషీన్ గన్స్ తో తుత్తునియలు చేయడం.. రక్తం విపరీతంగా చిందే సీన్లు సర్వసాధారణమైపోయాయి. పాశ్చాత్య ట్రెండ్‌కు అనుగుణంగానే ఇక్కడి మేకర్స్ కూడా కథలో డార్క్ షేడ్స్‌ను జోడిస్తున్నారు.
ఈ వైఖరి వెనుక ప్రధాన కారణం ఓటీటీ వీక్షకుల మైండ్ సెట్ మార్పు. అరచేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్‌లలో `హౌస్ ఆఫ్ ది డ్రాగన్` వంటి హై-ఓల్టేజ్ బ్లడ్-షేడ్ డ్రామాలను చూస్తున్న ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించాలంటే.. అంతకంటే ఎక్కువ స్థాయిలో విజువల్ ఇంపాక్ట్ .. రా-యాక్షన్ ఉండాలని భారతీయ దర్శకులు భావిస్తున్నారు. ఓటీటీలకు అలవాటు పడిన ప్రేక్షకుల మైండ్ సెట్ ని రీడ్ చేసి ఇలాంటి క్రూరమైన సన్నివేశాలను సృష్టిస్తున్నారనేది ఒక విశ్లేషణ. కేవలం సాధారణ ప్రేమ కథలు లేదా కమర్షియల్ కామెడీలు ప్రేక్షకులను థియేటర్ సీట్లలో కూర్చోబెట్టలేకపోతున్నాయి. అందుకే మాస్ ఎమోషన్స్ కి తీవ్రమైన హింసను మేళవించి సినిమాలను తీయడమే బాక్సాఫీస్ వద్ద సేఫ్ గేమ్ అని భావిస్తున్నారు.
అయితే ఈ అతి తీవ్రమైన రక్తపాతం మున్ముందు భారతీయ చిత్ర పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే మేకింగ్ సాంకేతికత అందుబాటులోకి వస్తున్నా.. మరోవైపు కంటెంట్‌లో హింస మోతాదు మరీ ఎక్కువైపోతోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా హాలీవుడ్ వెబ్ సిరీస్‌లు నేర్పిన ఈ రక్తం చిందే ట్రెండ్ ఇప్పుడు భారతీయ సినిమాల్లోనూ ప్రధాన శైలిగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాశ్చాత్య ధోరణుల కారణంగా భారతీయ సినిమా స్వరూపం తీవ్రంగా మారిపోతోందనే ఆవేదన సాంప్రదాయవాదుల్లో బయటపడుతోంది.