'టాక్సిక్' టికెట్ @రూ.2,250
ఆ షో కి ఒక్క టికెట్‌కి రూ.2180లుగా ఖరారు చేశారు. యశ్ వంటి పెద్ద స్టార్స్ సినిమాల బెనిఫిట్ షో లకు భారీ టికెట్ రేట్లు ఉండటం కామన్ విషయం.
కన్నడ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన 'టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఆగస్టు 26, 2026న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కేవలం ఇండియన్ భాషల్లోనే కాకుండా సినిమాను ఇంగ్లీష్‌లోనూ డబ్బింగ్ చేయడం ద్వారా హాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్తున్నారు. కన్నడ తో పాటు హిందీలోనూ ఈ సినిమాను రూపొందించారు. ఇంగ్లీష్ వర్షన్ కోసం కొన్ని ప్రత్యేకమైన సీన్స్ ను చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి టాక్సిక్ సినిమా ఇండియన్ సినిమాలను మించి ఉంటుందని, అంతకు మించి వసూళ్లు సాధిస్తుందనే విశ్వాసంను చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమా ఆరంభం అయిన వెంటనే కొత్త లోకంలోకి తీసుకు వెళ్తుందని నిర్మాత ఇటీవల చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్‌లో రికార్డ్...
ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టాక్సిక్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయింది. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన కొన్ని గంటల్లోనే లక్షల్లో టికెట్స్ బుక్ అయ్యాయి. పలు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్స్‌లో టాప్‌లో టాక్సిక్ సినిమా టికెట్స్ బుక్ అవుతున్నాయట. దేశ వ్యాప్తంగా టాక్సిక్ ఫీవర్ పట్టుకుంది. సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో భారీ ఎత్తున టికెట్ల రేట్లను నిర్ణయించారనే విమర్శలు వస్తున్నాయి. బెంగళూరులోని ఒక థియేటర్‌లో బెనిఫిట్ షో పడబోతుంది. ఆ షో కి ఒక్క టికెట్‌కి రూ.2180లుగా ఖరారు చేశారు. యశ్ వంటి పెద్ద స్టార్స్ సినిమాల బెనిఫిట్ షో లకు భారీ టికెట్ రేట్లు ఉండటం కామన్ విషయం. కానీ మరీ ఇంత భారీ రేట్ల అంటూ చాలా మంది నోరు వెళ్లబెడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఏ కన్నడ మూవీకి ఈ స్థాయి టికెట్ రేటు పడలేదు అనేది స్థానికుల అభిప్రాయం. అంత రేటు పెట్టినా కూడా టికెట్స్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే హౌస్ ఫుల్ అయినట్లుగా తెలుస్తోంది.
యశ్, గీతూ మోహన్ దాస్...
యశ్ కి ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో ముంబైలోనూ భారీ ఎత్తున టాక్సిక్ మూవీ టికెట్ రేట్లు పెంచారని తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ముంబైలోని బాంద్రా ఏరియాలో ఉండే ఒక థియేటర్‌లో ఒక్క టికెట్ ధర ఏకంగా రూ.2250లుగా నిర్ణయించారట. అక్కడ చాలా స్పీడ్‌గా టికెట్లు అమ్ముడు పోతున్నాయని చెబుతున్నారు. ఉదయం ఆరు గంటల షోలతో పాటు, మిడ్ నైట్ షో లు, ఎర్లీ మార్నింగ్ షోలు ఇలా చాలా రకాలుగా మెట్రో నగరాల్లో టాక్సిక్ సినిమాను స్క్రీనింగ్ చేయబోతున్నారు. దాంతో మొదటి రోజు వసూళ్లు రూ.100 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు అంటూ యశ్ అభిమానులు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే దాదాపుగా రూ.27.5 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వచ్చినట్లు సమాచారం అందుతోంది. టాక్సిక్ సినిమా ఇప్పటి వరకు ఉన్న రికార్డ్‌లను బద్దలు కొట్టే విధంగా ఉంటుంది అని ఇటీవల యశ్ ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు.
కేజీఎఫ్ తర్వాత యశ్ మూవీ...
కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాల తర్వాత యశ్ చేస్తున్న సినిమా అనగానే చాలా మందిలో అంచనాలు భారీగా పెరిగాయి. అయితే గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ సినిమా ప్రకటించిన వెంటనే చాలా మంది నిటూర్చారు. ఇదేంటి యశ్ ఇలా చేశాడు అని ఫ్యాన్స్ సైతం అసహనం వ్యక్తం చేశారు. కానీ ఆయనకు ఉన్న విజనరీతో టాక్సిక్ కు ఆమెను ఎంపిక చేయడం జరిగిందని, యశ్ నమ్మకంను వమ్ము చేయకుండా గీతూ టాక్సిక్ సినిమాను అద్భుతంగా పూర్తి చేసిందని మేకర్స్ చెబుతున్నారు. యశ్ గత చిత్రం కేజీఎఫ్ కు ఏమాత్రం తగ్గకుండా, అంతకు మించి ఉంది అని అభిమానులు అనుకునే విధంగా టాక్సిక్ ఉంటుందని అంటున్నారు.
భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు, శృతి మించే విధంగా రొమాంటిక్ సీన్స్ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని, అందుకే సెన్సార్ బోర్డ్ పలు కట్టింగ్స్ చెప్పారని సమాచారం అందుతోంది. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న కొద్ది టికెట్ల రేట్లు ఇంకా పెంచినా ఆశ్చర్యం లేదని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా క్రేజ్ ఉండగానే టికెట్ల రేట్లు భారీగా పెంచి డబ్బులు సంపాదించాలి అనేది నిర్మాతల అభిప్రాయం కావచ్చు, అందుకే ఒక్క టికెట్ ధర వేలకు వేలు పెట్టారని ఇండస్ట్రీ కొందరు పెదవి విరుస్తున్నారు.