అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక ' ట్రైలర్.. ఎలా ఉందంటే..
Allari Naresh’s ‘Ramba Oorvasi Menaka’ Trailer: How Is It?
అల్లరి నరేష్ అనగానే థియేటర్లో లాజిక్స్ పక్కనపెట్టి మనస్ఫూర్తిగా నవ్వుకునీ చాలా రోజులైంది. ఈమధ్య సీరియస్ రోల్స్ తో తనలోని నటుడిని కొత్తగా పరిచయం చేసిన నరేష్, ఇప్పుడు 'రంభ ఊర్వశి మేనక' సినిమాతో తన పాత కామెడీ ట్రాక్ ఎక్కేశాడు. కడుపుబ్బా నవ్వించే ఒక పక్కా అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
దర్శకుడు చంద్ర మోహన్ చింతాడ ఈ కథను స్వర్గం, భూమి అనే ఫాంటసీ కాన్సెప్ట్ కు కామెడీని జోడించి డిజైన్ చేశాడు. ట్రైలర్ ఓపెనింగ్ లోనే దేవేంద్రుడిగా వెన్నెల కిషోర్ కనిపించి మంచి కిక్ ఇచ్చాడు. భూమి మీద ఉన్న మనుషులు స్వర్గంలోని అప్సరసలను చూసి ఎలా ఆశపడుతున్నారో చెబుతూ దేవేంద్రుడు ఫీల్ అయ్యే సీన్స్ భలే వర్కవుట్ అయ్యాయి. మనుషుల ఆలోచనల గురించి స్వర్గంలో జరిగే చర్చ సినిమాకి మెయిన్ ప్లాట్ గా కనిపిస్తోంది.
రంభ, ఊర్వశి, మేనక పాత్రల్లో రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రాశి సింగ్ స్వర్గం నుంచి మోడ్రన్ డ్రెస్సుల్లో భూమి మీదకు వచ్చిన తర్వాతే అసలు రచ్చ మొదలైనట్లు చూపించారు. వాళ్లు ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగే గొడవలు, ఫ్యామిలీ చుట్టూ తిరిగే సీన్స్ బాగా పేలాయి. అలాగే మదర్ సెంటిమెంట్ లో హీరోయిన్ లవ్ ట్రాక్ కాస్త ఎమోషనల్ గా ఉన్నాయి.
సరిగ్గా ఇక్కడే అల్లరి నరేష్ తన మార్క్ టైమింగ్ తో ఈ ముగ్గురు అప్సరసల వల్ల జరిగే కన్ఫ్యూజన్ డ్రామాలో చిక్కుకుని చేసే వింటేజ్ కామెడీ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది. దేవేంద్రుడి క్యారెక్టర్ మాత్రమే కాకుండా, ఈ కథలో యమధర్మరాజు ట్రాక్ కూడా కలవడం ఫన్నీగా ఉంది. దున్నపోతు మీద ఎర్రటి లైటింగ్ బ్యాక్ గ్రౌండ్ లో యముడిగా అజయ్ ఎంట్రీ ఇచ్చే విజువల్స్ గట్టిగానే ఉన్నాయి. దానికి తోడు స్వర్గంలో క్యాస్ట్ సర్టిఫికెట్ గురించి దేవేంద్రుడు అడిగే ప్రశ్నలు, మనుషుల కులాల పిచ్చి మీద వేసే పంచులు ఈ కాలం పరిస్థితులకు పర్ఫెక్ట్ గా కనెక్ట్ అయ్యేలా సెట్ చేశారు.
ట్రైలర్ చివర్లో అల్లరి నరేష్ చెప్పే ప్రాస డైలాగ్స్ తో ఆయన పాత సినిమాల్లోని స్పూఫ్ కామెడీ ఫ్లేవర్ పూర్తిగా బయటకు వచ్చింది. "రాశి ఓ రాశి.. మూషీలో రంభ ఊర్వశి.. శవాన్ని ఇక్కడి వరకు మోసి" అంటూ నరేష్ చెప్పిన మిమిక్రీ డైలాగ్స్ నవ్విస్తాయి. నిజానికి ఇలాంటి సిచువేషనల్ పంచులు వేయడంలో నరేష్ కు ఉన్న టాలెంట్ అంతా ఇంతా కాదు. అలాగే "గౌతమ్ గంభీరా.. పిక్చర్ క్లియర్ స్టార్" అని ముగించిన తీరు చూస్తుంటే, సినిమాలో ఇలాంటి నాన్ స్టాప్ పంచులు చాలానే ఉంటాయని అర్థమవుతుంది.
రాజేష్ దండా, ప్రసాద్ నిమ్మకాయల నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో సురభి మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఏదేమైనా ప్రేక్షకులను థియేటర్లో రిలాక్స్ చేయడానికి నరేష్ మళ్లీ తన బెస్ట్ ఎంటర్టైనర్ జోన్ ను ఎంచుకున్నాడు. సెప్టెంబర్ 4న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాతో నరేష్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.