KVN: పాన్ ఇండియాలో డేరింగ్ ప్రొడ్యూసర్.. అస్సలు తగ్గట్లేదుగా..

సినిమా నిర్మాణంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయడమే నిర్మాతకు పెద్ద రిస్క్. అలాంటిది ఒక సినిమా పూర్తయ్యే వరకు ఎదురుచూడకుండా వరుసగా భారీ సినిమాలను లైన్‌లో పెట్టడం అంత ఈజీ కాదు.

Update: 2026-08-24 12:42 GMT

సినిమా నిర్మాణంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయడమే నిర్మాతకు పెద్ద రిస్క్. అలాంటిది ఒక సినిమా పూర్తయ్యే వరకు ఎదురుచూడకుండా వరుసగా భారీ సినిమాలను లైన్‌లో పెట్టడం అంత ఈజీ కాదు. కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె. నారాయణ మాత్రం ఇప్పుడు అదే రూట్‌లో వెళ్తున్నారు. విజయ్ నుంచి యష్, చిరంజీవి వరకు ముగ్గురు పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేయడం చూస్తే ఆయన ప్లానింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

విజయ్‌తో చేసిన ‘జన నాయకన్’ విషయంలో కేవీఎన్‌కు ఊహించని పరిస్థితి ఎదురైంది. సినిమా పూర్తయినా సెన్సార్ వ్యవహారం కారణంగా నెలల పాటు రిలీజ్ ఆగిపోయింది. చివరకు ఆ సమస్యలను దాటుకుని సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చారు. భారీ పెట్టుబడి పెట్టిన నిర్మాతకు ఇంతకాలం సినిమా నిలిచిపోవడం చిన్న విషయం కాదు. అయినా ఆ ప్రభావం తర్వాతి ప్రాజెక్టుల మీద పడనివ్వకుండా కేవీఎన్ ముందుకు వెళ్లారు.

మరోవైపు యష్ ‘టాక్సిక్’ ప్రయాణం కూడా చాలా కాలంగా సాగుతోంది. భారీ స్కేల్, షూటింగ్ కారణంగా రిలీజ్ విషయంలో పలుమార్లు మార్పులు వచ్చాయి. అయినా ప్రాజెక్ట్ మీద నిర్మాతలు పెట్టుకున్న నమ్మకం తగ్గలేదు. యష్‌కు ‘కేజీఎఫ్’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అలాంటి సినిమాను చివరి వరకు అదే స్థాయిలో తీసుకెళ్లడం కూడా నిర్మాతకు చిన్న విషయం కాదు.

ఇప్పుడు చిరంజీవితో ‘కాకా’ చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను 2027 జనవరి 13న సంక్రాంతికి తీసుకురానున్నారు. ఇప్పటికే షూటింగ్‌ను చాలా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. చిరంజీవి, అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను ఇందులో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. పెద్ద స్టార్ సినిమా అయినా అనుకున్న టైమ్‌కు సిద్ధం చేసేలా టీమ్‌ను నడిపిస్తున్నారు.

కేవీఎన్ ఎంచుకుంటున్న సినిమాల రేంజ్ కూడా మాములుగా లేదు. ఒకటి విజయ్ సినిమా, మరొకటి యష్ పాన్ ఇండియా ప్రాజెక్ట్, ఇప్పుడు చిరంజీవి మాస్ సినిమా. మూడు సినిమాలకు పరిస్థితులు వేరు. వాటి మార్కెట్లు కూడా వేరు. అయినా ఒకేసారి ఇంత పెద్ద ప్రాజెక్టులను హ్యాండిల్ చేయడానికి డబ్బుతో పాటు నిర్మాతకు సినిమాపై నమ్మకం, సరైన టీమ్ కూడా ఉండాలి.

అందుకే వెంకట్ కె. నారాయణ బర్త్‌డే సందర్భంగా ‘కాకా’ టీమ్ విడుదల చేసిన వీడియో కూడా ఇప్పుడు స్పెషల్‌గా నిలిచింది. చిరంజీవి, బాబీతో పాటు టీమ్ ఆయనకు విషెస్ చెప్పింది. నిర్మాతగా ఎక్కువగా బయట కనిపించకుండానే ఇండియాలోని పెద్ద స్టార్స్‌తో వరుస సినిమాలు సెట్ చేస్తున్నారు. ఇప్పుడు ‘టాక్సిక్’, ‘కాకా’ రెండూ ఆయన బ్యానర్‌కు కీలక సినిమాలు. ఇవి బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో ఆడితే కేవీఎన్ పేరు పాన్ ఇండియా నిర్మాణ సంస్థల్లో ఇంకా గట్టిగా వినిపిస్తుంది.


Full View


Tags:    

Similar News