పాకిస్తానీ నటికి అవకాశమిచ్చిన ఫలితం
పహల్గామ్ లో ఉగ్రవాదుల ఘాతుకం అనంతరం, భారతదేశం ఆపరేషన్ సిందూర్ ని చేపట్టింది. మతం గురించి ప్రశ్నించి, మహిళల భర్తలను చంపిన మతోన్మాదుల ఉగ్రచర్యను ప్రపంచం మొత్తం వ్యతిరేకించింది.;
పహల్గామ్ లో ఉగ్రవాదుల ఘాతుకం అనంతరం, భారతదేశం ఆపరేషన్ సిందూర్ ని చేపట్టింది. మతం గురించి ప్రశ్నించి, మహిళల భర్తలను చంపిన మతోన్మాదుల ఉగ్రచర్యను ప్రపంచం మొత్తం వ్యతిరేకించింది. ముఖ్యంగా పహల్గామ్ దాడి పాకిస్తాన్, ఇండియా మధ్య విద్వేషాలను రెచ్చగొట్టింది. యుద్ధానికి దారి తీసింది.
ఇది మాత్రమే కాదు.. పహల్గామ్ దాడి ఇరు దేశాల నడుమా చాలా తీవ్ర పరిణామాలకు కారణమైంది. అలాగే బాలీవుడ్ పైనా, కళా రంగాలపైనా తీవ్రమైన ప్రభావం చూపించడం ఇటీవల చర్చగా మారింది. ప్రస్తుతం భారతదేశంలో పాకిస్తానీ కళాకారులు అవకాశాల్ని కోల్పోయారు. పాకిస్తానీ నటీ నటులు ఇకపై ఎప్పటికీ బాలీవుడ్‌లో నటించలేరు. పాకిస్తానీ తారలు మహీరా ఖాన్, సనమ్ సయీద్, అలీ జాఫర్ సహా చాలా మందికి ఇప్పుడు భారతీయ సినీపరిశ్రమల్లో అవకాశాలు లేవు. హనియా అమీర్ అనే పాకిస్తానీ నటి ఆపరేషన్ సిందూర్ ని దుష్ట ఆపరేషన్ అని అభివర్ణించింది. దీంతో పాకిస్తానీ నటీనటుల సోషల్ మీడియాల్ని ఇండియాలో బ్లాక్ చేసారు.
అయితే హనియా అమీర్ కి అవకాశం కల్పించిన బాలీవుడ్ నటుడు దిల్జీత్ దోసాంజ్ ఇప్పుడు తీవ్రమైన చిక్కుల్ని ఎదుర్కొంటున్నారు. దిల్జీత్ నటించిన `సర్దార్జీ-3` లో పాకిస్తానీ నటి హనియా అమీర్ కథానాయిక. ఈ భామ భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ని తీవ్రంగా దూషించిన కారణంగా ఇప్పుడు దిల్జీత్ బృందం సోషల్ మీడియాల్లో ప్రశ్నల్ని ఎదుర్కొంటోంది. జూన్ 27న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, భారతదేశం మినహాయించి, విదేశాలలో విడుదలవుతోంది. ట్రైలర్ ని కూడా ఇండియాలో రిలీజ్ చేయకపోవడం ఆశ్చర్యపరిచింది. ఇక సర్దార్జీ 3 ట్రైలర్ కోసం వెతికితే, ఈ వీడియోను అప్‌లోడ్ చేసిన వ్యక్తి మీ దేశంలో అందుబాటులో ఉంచలేదు అనే సందేశాన్ని చదవాల్సి వస్తోంది.
దిల్జీత్ ఇన్ స్టాలో ట్రైలర్ ను షేర్ చేయగానే అతడు తీవ్రమైన ట్రోలింగ్ ని ఎదుర్కొన్నాడు. అయితే పాకిస్తాని నటి హనియాను పహల్గామ్ ఎటాక్స్ కి ముందే ఎంపిక చేసుకున్నామని, చిత్రీకరణ పూర్తయిందని కూడా దర్శకనిర్మాతలు వివరణ ఇచ్చారు. భారతీయుల మనోభావాలను దెబ్బ తీయకూడదనే ఉద్ధేశంతోనే సినిమాని భారత దేశంలో విడుదల చేయడం లేదని నిర్మాతలు చెబుతున్నారు.