ప్రపంచం మెచ్చిన అందం.. క్యాన్సర్‌పై గెలిచిన ధైర్యం.. సుచాతా సక్సెస్ వెనుక ఎంతో కష్టం!
అందం, తెలివి, ఆత్మవిశ్వాసం, సేవా గుణం.. ఇవన్నీ ఒకచోట చేరితే మిస్ వరల్డ్ కిరీటం సొంతమవుతుంది.;
అందం, తెలివి, ఆత్మవిశ్వాసం, సేవా గుణం.. ఇవన్నీ ఒకచోట చేరితే మిస్ వరల్డ్ కిరీటం సొంతమవుతుంది. కానీ, ఈసారి ఈ కిరీటాన్ని గెలుచుకున్న థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాతా చువాంగ్ శ్రీ (Opal Suchata Chuang Sri) ప్రయాణం మాత్రం ఎన్నో కష్టాలు, సవాళ్లతో నిండి ఉంది. కేవలం 16 ఏళ్ల వయసులోనే క్యాన్సర్‌తో పోరాడి, మృత్యువు అంచున తిరిగి వచ్చిన ఆమె, ఇప్పుడు ఏకంగా ప్రపంచ సుందరిగా నిలిచి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆమె గెలుపు ఒక స్ఫూర్తిదాయక గాథ.
16 ఏళ్ల వయసులో బ్రెస్ట్ ట్యూమర్
మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకోవడానికి ముందు ఓపల్ సుచాతా జీవితంలో ఒక పెను విషాదం చోటు చేసుకుంది. ఆమెకు 16 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. రొమ్ములో ట్యూమర్ (కణితి) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అది క్యాన్సర్ అని అనుమానించడంతో ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ అనారోగ్యం కారణంగా ఆమె దాదాపు మృత్యువు అంచులకు వెళ్లి వచ్చింది. అదృష్టవశాత్తు, ఆమె ఆ పోరాటంలో విజయం సాధించి ఆరోగ్యంతో బయటపడింది. ఈ అనుభవమే ఆమెను మరింత ధైర్యవంతురాలిగా మార్చిందని చెప్పొచ్చు.
ఈ సంఘటన తర్వాత సుచాతా చువాంగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తాను రొమ్ము క్యాన్సర్, మహిళల ఆరోగ్య సంరక్షణ గురించి అవగాహన కల్పించాలనుకుంటున్నానని చెప్పింది. ఈ అనుభవమే మిస్ వరల్డ్ వంటి అందాల పోటీలలో పాల్గొనడానికి తనకు ప్రేరణనిచ్చిందని ఆమె వెల్లడించింది. ఆమె ఇప్పుడు క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్తగా నిలుస్తోంది.
ఓపల్ సుచాతా ప్రస్థానం
ఓపల్ సుచాతా చువాంగ్ శ్రీ పూర్తి పేరు. ఈమె సెప్టెంబర్ 20, 2003న థాయిలాండ్‌లో జన్మించింది. థానెట్, సుపాత్రా చువాంగ్ రాసి దంపతుల కుమార్తె ఈ సుచాతా. ప్రస్తుతం ఆమె థామ్మాసాట్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతోంది. మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకోవడానికి ముందు, సుచాతా చువాంగ్ మిస్ యూనివర్స్ థాయిలాండ్ 2024 టైటిల్‌ను కూడా గెలుచుకుంది. ఈ విజయం ఆమెకు మిస్ వరల్డ్ వంటి అంతర్జాతీయ వేదికపై నిలిచే అవకాశాన్ని కల్పించింది. మిస్ వరల్డ్ 2025 పోటీలో 108 దేశాల నుంచి వచ్చిన సుందరీమణులను దాటి, సుచాతా చువాంగ్ శ్రీ కిరీటాన్ని సొంతం చేసుకుంది. మిస్ వరల్డ్ కిరీటం ధరించిన మొదటి థాయిలాండ్ మహిళగా ఆమె చరిత్ర సృష్టించింది. ప్రపంచం నలుమూలల నుండి ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఫైనల్స్ జడ్జింగ్ ప్యానెల్
మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ తుది పోటీలకు ప్రముఖ నటుడు సోనూ సూద్, వ్యాపారవేత్త సుధా రెడ్డి, మిస్ ఇంగ్లాండ్ 2014 విజేత కరీనా వంటి వారు జడ్జులుగా వ్యవహరించారు. మిస్ వరల్డ్ జడ్జింగ్ ప్యానెల్‌కు మిస్ వరల్డ్ ప్రెసిడెంట్ జూలియా మోర్లే నాయకత్వం వహించారు. ఈ ప్యానెల్‌లో టాలీవుడ్ స్టార్ నటుడు రానా దగ్గుబాటి, ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ కూడా సభ్యులుగా ఉన్నారు.
ఈ వేదికపైనే సోనూ సూద్‌కు 'మిస్ వరల్డ్ హ్యూమనిటేరియన్ అవార్డు' లభించింది. ఈ అవార్డును టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి సోనూ సూద్‌కు అందజేశారు. ఈ గ్రాండ్ ఫినాలేకు దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఆయన సతీమణి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆయన సతీమణి, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అలాగే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి కూడా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు.