విజ‌య్ వ‌ర్సెస్ శివ కార్తికేయ‌న్ స‌క్సెస్ కొట్టేది ఎవ‌రు?

ఒకే స‌మ‌యంలో వీరిద్ద‌రు పోటీకి దిగ‌డం కోలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శివ కార్తికేయ‌న్ స్వ‌త‌హాగా ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి వీరాభిమాని.;

Update: 2026-01-05 06:25 GMT

ప్ర‌తి సంక్రాంతికి క్రేజీ స్టార్ హీరోల సినిమాలు బ‌రిలోకి దిగ‌డం..పోటీప‌డ‌టం తెలిసిందే. అదే త‌ర‌హాలో ఈ సంక్రాంతి స‌మ‌రంలోనూ స్టార్లు త‌మ సినిమాల‌తో పోటీకి దిగుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ `ది రాజాసాబ్‌`తో, మెగాస్టార్ చిరంజీవి `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు`తో, ర‌వితేజ `భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి` మూవీతో బ‌రిలోకి దిగుతున్నారు. న‌వీన్‌పొలిశెట్టి, శ‌ర్వా కూడా బ‌రిలోకి దిగుతుండ‌గా వీరితో పాటు కోలీవుడ్ స్టార్స్ విజ‌య్‌, శివ కార్తికేయన్ పోటీప‌డుతున్నారు. విజ‌య్ `జ‌న నాయ‌కుడు`తో వ‌స్తుండ‌గా, శివ కార్తీకేయ‌న్ `ప‌రాశ‌క్తి`తో పోటిప‌డుతున్నాడు.

ఒకే స‌మ‌యంలో వీరిద్ద‌రు పోటీకి దిగ‌డం కోలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శివ కార్తికేయ‌న్ స్వ‌త‌హాగా ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి వీరాభిమాని. ఆ అభిమానం కార‌ణంగానే విజ‌య్ `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌`లో న‌టించాడ‌ట‌. అలాంటి త‌న‌తో పోటి అన‌గానే ముందు షాక్ అయ్యాడ‌ట‌. ఆ పోటీ నుంచి ఎలాగైనా త‌ప్పుకోవాల‌ని ముందు విజ‌య్ మేనేజ‌ర్ సైడ్ నుంచి చ‌క్క బెట్ట‌డం మొద‌లు పెట్టాడ‌ట‌. అది కుద‌ర‌ని ప‌ని అని తేల‌డంతో త‌న సినిమా `ప‌రాశ‌క్తి` ప్రొడ్యూస‌ర్స్‌ని ఒప్పించి సినిమా వాయిదా వేయించాడ‌ట‌. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల `ప‌రాశ‌క్తి` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెల్ల‌డించి శివ కార్తికేయ‌న్‌ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

`ప‌రాశ‌క్తి` రిలీజ్ వాయిదా వేసుకున్నా ఫైన‌ల్‌గా విజ‌య్ `జ‌న నాయ‌కుడు`తో పోటీప‌డ‌క త‌ప్ప‌డం లేదు. జ‌న‌వ‌రి 9న `జ‌న నాయ‌కుడు`రిలీజ్ అవుతుండ‌గా, శివ కార్తికేయ‌న్ `ప‌రాశ‌క్తి` జ‌న‌వ‌రి 10న వ‌చ్చేస్తోంది. ఈ నేప‌థ్యంలో నెట్టింట ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు తేడాతో రిలీజ్ అవుతుండ‌టంతో బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భావం ఉంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. విజ‌య్ `జ‌న నాయకుడు` తెలుగు హిట్ `భ‌గ‌వంత్ కేస‌రి` రీమేక్ అని తేల‌డంతో సినిమాపై భారీ ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని, రీమేక్ సినిమాల‌కు ఆద‌ర‌ణ ల‌భించ‌ని నేప‌థ్యంలో ఇది భారీ ఎఫెక్ట్‌ని క‌లిగిస్తుంద‌ని ట్రేడ్ పండితులు అంటున్నారు.

పైగా క‌థ‌లో మార్పులు చేయ‌డంతో అభిమానుల్ని త‌ప్ప ప్రేక్ష‌కుల్ని పెద్ద‌గా ప్ర‌భావితం చేసే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని, అదే స‌మ‌యంలో 1960లో మ‌ద్రాస్‌లో జ‌రిగిన హిందీ వ్య‌తిరేకోద్య‌మం నేప‌థ్యంలో రూపొందిన `ప‌రాశ‌క్తి` క‌చ్చితంగా ప్ర‌భావాన్ని చూపించే అవ‌కాశం ఉంద‌ని, విజ‌య్ సినిమాపై పై చేయిని సాధిస్తుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. సుధా కొంగ‌ర చేసిన ఈ మూవీ త‌మిళ‌ ప్రేక్ష‌కుల్లో తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌ని, ఆనాటి హిందీ వ్య‌తిరేక‌త త‌మిళుల్లో ఇప్ప‌టికీ అలాగే కొన‌సాగుతున్న కార‌ణంగా `ప‌రాశ‌క్తి` త‌మిళ‌నాట బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

మేకింగ్‌, ఆనాటి ప‌రిస్థితుల్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపిస్తున్నార‌ని ట్రైల‌ర్‌తో క్లారిటీ ఇవ్వ‌డంతో `ప‌రాశ‌క్తి`పై తెలుగులోనూ అంచ‌నాలున్నాయి. శ్రీ‌లీల హీరోయిన్‌, అధ‌ర్వ కీల‌క పాత్ర‌, జ‌యం ర‌వి విల‌న్‌గా న‌టించ‌డం వంటి కార‌ణ‌లు సినిమాని తెలుగులోనూ హాట్ టాపిక్‌గా మార్చాయి. ఇదే స‌మ‌యంలో `జ‌న నాయ‌కుడు` తెలుగు ప్రేక్ష‌కులు చూసిన క‌థ కాబ‌ట్టి ఇక్క‌డ విజ‌య్ సినిమా అంత‌గా ప్ర‌భావం చూపించే అవ‌కాశం లేదు. దీంతో రెండు భాష‌ల్లోనూ విజ‌య్ సినిమాని శివ కార్తీకేయ‌న్ `ప‌రాశ‌క్తి` డామినేట్ చేయ‌డం ప‌క్కా అని తెలుస్తోంది.

Tags:    

Similar News