'ఓం శాంతి శాంతి శాంతి' : మూవీ రివ్యూ
'పెళ్ళిచూపులు'తో దర్శకుడిగా మెప్పించిన తరుణ్ భాస్కర్.. ఆ తర్వాత నటుడిగానూ ఆకట్టుకున్నాడు.;
'ఓం శాంతి శాంతి శాంతి': మూవీ రివ్యూ
నటీనటులు: తరుణ్ భాస్కర్- ఈషా రెబ్బా- బ్రహ్మాజీ- బ్రహ్మానందం- సురభి ప్రభావతి- శివన్నారాయణ- రోహిణి నోని తదితరులు
సంగీతం: జె.క్రిష్
ఛాయాగ్రహణం: దీపక్ యెరగరా
నిర్మాతలు: సృజన్ యరబోలు- ఆదిత్య పిట్టి
కథ: విపిన్ దాస్- నషీద్
స్క్రీన్ ప్లే- దర్శకత్వం: సజీవ్
'పెళ్ళిచూపులు'తో దర్శకుడిగా మెప్పించిన తరుణ్ భాస్కర్.. ఆ తర్వాత నటుడిగానూ ఆకట్టుకున్నాడు. ఇప్పుడతను హీరో అవతారం ఎత్తాడు. ఈషా రెబ్బాతో కలిసి అతను చేసిన సినిమా.. ఓం శాంతి శాంతి శాంతి:. మలయాళ హిట్ 'జయ జయ జయ జయహే' చిత్రానికి రీమేక్ గా సజీవ్ రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్) గోదావరి ప్రాంతంలో చేపల చెరువులు నడిపే కుర్రాడు. అతడికి ముక్కుమీద కోపం. అలాంటి వ్యక్తితో జీవితం మీద ఎన్నో ఆశలు ఉన్న ప్రశాంతి (ఈషా రెబ్బా)కు పెళ్లవుతుంది. పెళ్లయిన కొత్తలో బాగానే ఉన్నా ఓంకార్.. తర్వాత తన నిజ స్వరూపం చూపిస్తాడు. చిన్న చిన్న విషయాలకు ప్రశాంతిని కొట్టడం మొదలుపెడతాడు. పైగా ఆమె కోరుకున్నట్లుగా చదువుకోనివ్వడు. కొంత కాలం మౌనంగా ఈ హింసను.. బాధను భరించిన ప్రశాంతి.. తర్వాత తిరగబడుతుంది. ఈ క్రమంలో ఆమె ఏం చేసింది.. ప్రశాంతిపై ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకున్న ఓంకార్ ఏం చేశాడు.. చివరికి వీరి కాపురం ఏ తీరానికి చేరింది అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
రీమేక్ సినిమా అంటే చాలు.. ముందే ప్రేక్షకులు ఆసక్తి కోల్పోతున్న రోజులివి. రెగ్యులర్ గా సినిమాలు చూసే ప్రేక్షకులు వేరే భాషల్లో మంచి స్పందన తెచ్చుకున్న చిత్రాలను ఓటీటీలో వదిలిపెట్టడం అరుదు. మాతృకను చూడని వాళ్లు కూడా రీమేక్ అనగానే తేలిగ్గా తీసుకుంటున్నారిప్పుడు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న రోజుల్లో తెలుగు ఆడియోతోనూ అందుబాటులో ఉన్న.. బాగా పాపులర్ అయిన ఒక సినిమాను రీమేక్ చేసి.. ఇది రీమేక్ అనే విషయాన్ని స్వయంగా చిత్ర బృందమే నొక్కి వక్కాణించడం ఆశ్చర్యం కలిగించే విషయం. 'ఓం శాంతి శాంతి శాంతి': బృందం ఆ సాహసం చేసిందంటే.. ఒరిజినల్ ను మించిన మ్యాజిక్ చేశామన్న ధీమానే కావచ్చు. ఐతే నేటివిటీ ప్రధానంగా సాగే మలయాళ కథను తీసుకుని గోదావరి ప్రాంతం.. మనుషుల నేపథ్యాన్ని జోడించడం.. 'లోకల్' ఫీల్ వచ్చేలా డైలాగులతో వినోదాన్ని పండించడం.. ఒరిజినల్లోని ప్రధానమైన ఎపిసోడ్లలోని మ్యాజిక్ ను రీక్రియేట్ చేయడం వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇందులోని వినోదం ఒక మోస్తరు స్థాయిని మించలేకపోయింది. కథలో చేసిన మార్పులు.. కొత్తగా జోడించిన సన్నివేశాలు అనుకున్నంతగా కిక్ ఇవ్వలేకపోయాయి. 'ఓం శాంతి శాంతి శాంతి': కాలక్షేపం సినిమాలా అనిపిస్తుందే తప్ప బలమైన ముద్ర వేయలేకపోయింది.
మాతృకతో పోలికల సంగతి పక్కన పెట్టి.. మామూలుగా చూస్తే 'ఓం శాంతి శాంతి శాంతి'లో స్టోరీ చాలా సింపుల్. పురుషాధిక్యతకు మారు పేరైన అబ్బాయి.. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయికి పెళ్లి జరిగితే.. భర్త పెట్టే బాధకు భార్య చెప్పే సమాధానం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. భర్తను కౌంటర్ చేసే క్రమంలో భార్య ఇచ్చే షాక్.. ఈ నేపథ్యంలో వచ్చే ఒక హిలేరియస్ ఎపిసోడ్ ఈ కథకు హైలైట్ గా నిలుస్తాయి. గోదావరి ప్రాంత మనుషుల వ్యవహారం.. అక్కడి యాస.. హీరో చేసే చేపల వ్యాపారం నేపథ్యంలో ప్రథమార్ధంలో భలే సరదాగా డైలాగులు రాసుకున్నారు. వాటి ద్వారా వినోదం బాగానే పండింది. ఇక హీరోయిన్ మీద హీరో ఎటాక్.. హీరోయిన్ చేసే కౌంటర్ ఎటాక్ సీన్లు కూడా బాగున్నాయి. అన్నింటికీ మించి ఇద్దరి మధ్య యుద్ధభేరి ఎపిసోడ్ కూడా బాగానే పేలింది.
కానీ ఆ తర్వాతే కథనం అనుకున్నంత ఊపుతో సాగలేదు. కథలో చెప్పుకోదగ్గ మలుపులు లేకపోవడం.. మరీ నెమ్మదిగా సాగే సీన్లు ద్వితీయార్ధాన్ని బోరుగా మార్చేశాయి. ముగింపు సన్నివేశాలు కూడా ఓ మోస్తరుగా అనిపిస్తాయంతే. మాతృకకు అతి పెద్ద హైలైట్ గా నిలిచింది ఒక ఎపిసోడ్. అది చూస్తున్నపుడు కలిగే షాక్ వల్లే ఆ సినిమా గుర్తుండిపోతుంది. ఏ అంచనాలు లేకుండా.. కథ గురించి ఏమీ తెలియకుండా సినిమా చూస్తే అది క్రేజీగా అనిపిస్తుంది. కానీ షాక్ ఫ్యాక్టర్ మిస్సయ్యాక సినిమా కిక్కు ఇవ్వడం కష్టం. కాబట్టి అసలు కథకు ఎన్ని మార్పులు చేసినా, మెరుగులు దిద్దినా ఒరిజినల్ చూసిన వాళ్లకు ఇది ఆనడం కష్టమే. మామూలుగా చూస్తే ఇది ఓ మోస్తరు వినోదాన్ని అందిస్తుంది. కాలక్షేపానికి అయితే ఢోకా లేదు.
నటీనటులు:
'ఓం శాంతి శాంతి శాంతి':లో పెర్ఫామెన్సులకు ఏమీ లోటు లేదు. ప్రతి పాత్రకు సరిపోయే నటీనటులనే తీసుకున్నారు. అందరూ వాటికి న్యాయం చేశారు. ఒరిజినల్లో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చిన బాసిల్ జోసెఫ్ తో తరుణ్ భాస్కర్ ను పోల్చలేం కానీ.. ఇతను ఆ పాత్రకు కొంచెం ఫన్ టచ్ ఇచ్చి తన స్టయిల్లో దాన్ని పండించే ప్రయత్నం చేశాడు. తన నటనతో ప్రేక్షకులను నవ్వించడంలో తరుణ్ విజయవంతం అయ్యాడు. మామూలుగా పక్కా తెలంగాణ యాస మాట్లాడే తరుణ్.. గోదావరి స్లాంగ్ లో డైలాగులు చెప్పడంలో ఇబ్బంది పడలేదు. ఈ కథలో అత్యంత కీలకమైన కథానాయిక పాత్రలో ఈషా రెబ్బా మెప్పించింది. సటిల్ గా ఆ పాత్రను పోషించింది. సినిమాకు హైలైట్ గా నిలిచే ఎపిసోడ్లో తన పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటుంది. హీరో మావయ్యగా బ్రహ్మాజీ నవ్వించాడు. గోదావరి యాసలో తన పంచులు ఆకట్టుకుంటాయి. హీరో తల్లిగా సురభి సుభాషిణి.. చెల్లి పాత్రలో నటించిన అమ్మాయి.. హీరో తల్లిదండ్రులు.. అన్నయ్య.. మావయ్య పాత్రలు పోషించిన ఆర్టిస్టులు అందరూ బాగానే చేశారు. ఈ మధ్య వరుసగా జడ్జి పాత్రలు చేస్తున్న బ్రహ్మానందం.. మరోసారి ఆ క్యారెక్టర్లో ఆకట్టుకున్నారు. రోహిణి కూడా ఓకే.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా 'ఓం శాంతి శాంతి శాంతి': ఓకే అనిపిస్తుంది. జె.క్రిష్ అందించిన బిట్ సాంగ్స్.. సరదాగా సాగుతూ ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. దీపక్ యెరగరా ఛాయాగ్రహణం కూడా బాగుంది. పరిమిత బడ్జెట్లో తీసిన సినిమా ఇది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా బాగానే కుదిరాయి. దర్శకుడు సజీవ్.. ఒరిజినల్ కథ ఎసెన్స్ చెడగొట్టకుండా కీలక సన్నివేశాలను కొనసాగించాడు. అసలు కథతో సింక్ అయ్యేలా గోదావరి నేపథ్యాన్ని జోడించడం బాగుంది. కొంతమేర అదనపు సన్నివేశాలనూ జోడించాడు. ఐతే ఒరిజినల్ చూసిన వాళ్లకు.. దాన్ని మించిన అనుభూతి ఇది ఇవ్వకపోవచ్చు. మాతృక చూడని వాళ్లకు ఇది ఓ మోస్తరుగా అనిపిస్తుంది. స్లో నరేషన్ ఈ సినిమాకు కొంత ప్రతికూలం అయింది.
చివరగా: ఓం శాంతి శాంతి శాంతి:.. ఓ మోస్తరు వినోదం
రేటింగ్-2.5/5