ఆయన తప్ప మరెవరూ చేయలేరు

భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం బయోపిక్‌ను బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ రూపొందిస్తున్న విషయం తెల్సిందే.;

Update: 2025-08-30 17:30 GMT

భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం బయోపిక్‌ను బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ రూపొందిస్తున్న విషయం తెల్సిందే. ఆదిపురుష్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు ఓం రౌత్‌ ఎట్టకేలకు ఈ బయోపిక్‌ను మొదలు పెట్టాడు. దాదాపు రెండేళ్ల తర్వాత కలాం బయోపిక్‌ మొదలు పెట్టిన ఓం రౌత్‌ అంచనాలు పెంచే విధంగా పదే పదే ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా కలాం పాత్రలో నటిస్తున్న తమిళ్ హీరో ధనుష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓం రౌత్‌ ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో తన కలాం బయోపిక్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా కలాం పాత్రను ధనుష్‌ ఎలా చేస్తున్నాడు, సినిమా ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి చెప్పాడు. ఈ సినిమాను చేయడం తన అదృష్టంగా ఓం రౌత్‌ చెప్పుకొచ్చాడు.

ధనుష్ హీరోగా కలాం బయోపిక్‌

ఓం రౌత్‌ మాట్లాడుతూ... ధనుష్‌ ఒక అద్భుతమైన నటుడు. ఈ సినిమాకు ఆయన కాకుండా మరెవ్వరూ న్యాయం చేయలేరు. కలాం పాత్రలో ధనుష్ ఒదిగి పోతారు, ఆయన ప్రతి సన్నివేశంలోనూ కలాంను గుర్తు తెస్తారు అన్నాడు. ఆయన ఈ సినిమాను ఒప్పుకోవడం నా అదృష్టం. ఆయన ఓకే చెప్పిన వెంటనే చాలా సంతోషం కలిగింది. ఆయనతో వర్క్ మొదలు పెట్టడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా ఇండియన్‌ సినిమా ప్రేక్షకులకు మాత్రమే కాకుండా, కలాం గారిని అభిమానించే వారికి, ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఆయా రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్న వారికి ఖచ్చితంగా ఒక మంచి అనుభూతిని కలిగిస్తుందని ఓం రౌత్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం ధనుష్ కు ఉన్న కమిట్‌మెంట్స్‌ పూర్తి చేసుకున్న తర్వాత కలాం ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టే విధంగా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.

ఓం రౌత్‌ దర్శకత్వంలో కలాం పాత్రలో ధనుష్‌

ఈ సినిమాకు 'కలాం : ది మిసైల్‌ మ్యాన్‌ ఆఫ్ ఇండియా' అనే టైటిల్‌ను కన్ఫర్మ్‌ చేశారు. ఈ సినిమాను కేవలం హిందీ భాష లేదా తమిళ్‌ భాష అని కాకుండా అన్ని ఇండియన్ భాషల్లో విడుదల చేయబోతున్నారు. కలాం సినిమా అంటే ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అన్నట్టుగా కాకుండా ఒక మంచి కమర్షియల్‌ సబ్జెట్‌, అందులో బయోపిక్ ఉండేలా దర్శకుడు ఓం రౌత్‌ ప్లాన్‌ చేస్తున్నాడని సమాచారం అందుతోంది. ఈ సినిమాను భూషన్‌ కుమార్‌, అనిల్‌ సుంకర, అభిషేక్ అగర్వాల్‌, కృష్ఖ కుమార్‌ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాలో కలాం జీవిత చరిత్ర ను ఎలాంటి తప్పులు లేకుండా, జాగ్రత్తగా తీయడం కోసం ఇప్పటికే పలు దఫాలుగా ఆయన కుటుంబ సభ్యులను, ఆయనతో వర్క్‌ చేసిన వారిని, ఆయన స్నేహితులను కలిసి ఎంక్వయిరీ చేశారట.

ఏపీజే అబ్దుల్‌ కలాం జీవిత చరిత్ర

కలాం చెప్పే మాటలు ఎంతో గొప్పగా ఉండేవి. ఆయన చెప్పిన మాటలను సూక్తులు గా చెప్పుకునే వారు చాలా మంది ఉన్నారు. ఆయన మాటలకు స్ఫూర్తి పొంది జీవితంలో ఎదిగిన వారు చాలా మంది ఉంటారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తున్న వారు, ముందు ముందు నడవాలి అనుకునే వారికి ఖచ్చితంగా ఈ సినిమా మంచి అనుభూతిని ఇస్తుందని అంటున్నారు. కలాం వంటి గొప్ప వ్యక్తుల జీవితాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికీ చూపించాల్సిన అవసరం ఉంది. ఆయన జీవితం పుస్తకం రూపంలో వచ్చినా కూడా చాలా మంది సినిమా రూపంలో చూడాలి అనుకున్నారు. వారి కోరిక ఈ సినిమాతో తీరబోతుంది. ఓం రౌత్‌ ఆదిపురుష్ సమయంలో తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. కనుక ఈ సారి చాలా జాగ్రత్తగా కలాం జీవిత చరిత్ర సినిమాను రూపొందించే అవకాశాలు ఉన్నాయి. ఆదిపురుష్‌ ఎఫెక్ట్‌ నుంచి బయట పడే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి అనేది చూడాలి.

Tags:    

Similar News