ఓజీ ఇష్యూ.. టికెట్ కొన్నవారి పరిస్థితేంటి?
టికెట్ ధరలను పెంచాలని కోరుతూ చిత్ర నిర్మాణ సంస్థ సర్కార్ ను కోరగా, అందుకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.కానీ వాటిని తాజాగా తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.;
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. గ్యాంగ్ స్టర్ డ్రామాగా సుజీత్ దర్శకత్వం వహించిన ఆ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల కానుంది. మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ పడనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్స్ వేసేందుకు ఏర్పాట్లు చేశారు మేకర్స్.
అయితే బుధవారం రాత్రి ప్రీమియర్స్ తో పాటు టికెట్ ధరల పెంపునకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. టికెట్ ధరలను పెంచాలని కోరుతూ చిత్ర నిర్మాణ సంస్థ సర్కార్ ను కోరగా, అందుకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.కానీ వాటిని తాజాగా తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
బుధవారం మధ్యాహ్నం జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సర్కార్ ఇచ్చిన మెమోను సవాల్ చేస్తూ మహేశ్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టికెట్ల పెంపునకు అనుమతి ఇవ్వడానికి హోంశాఖ స్పెషల్ సీఎస్ కు ఎలాంటి అధికారాలు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు.
టికెట్లు అధిక ధరకు విక్రయించకూడదని నిబంధనలు ఇప్పటికే ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకురాగా, సస్పెండ్ విధించింది. తదుపరి విచారణ వచ్చే నెల 9వ తేదీన వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే టికెట్లు కొన్నవాళ్ల సంగతేంటనేది క్వశ్చన్ మార్క్.
మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ ఉండగా.. చాలా మంది అభిమానులు టికెట్లు కొనుగోలు చేసి వెయిట్ చేస్తున్నారు. వారందరికీ మూవీ టీమ్ డబ్బులను రిఫండ్ చేస్తుందా లేక ఏం చేస్తుందన్నది ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. రేపు షోలకు కూడా కొన్ని లక్షల మంది అడ్వాన్స్ గా టికెట్లు బుక్ చేసుకుని పెద్ద ఎత్తున పేమెంట్స్ కూడా చేశారు.
దీంతో మేకర్స్.. ఇప్పుడు తగ్గించిన రేట్లకు అమౌంట్ రిఫండ్ చేస్తారో అన్నది తెలియాల్సి ఉంది. అయితే ప్రీమియర్ టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ.800కు కొనుగోలు చేశారు. రేపటి టికెట్లను సింగిల్ స్క్రీన్స్ లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్ ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి)కు కొన్నారు. మరేం జరుగుతుందో.. మేకర్స్ ఏం చేస్తారో వేచి చూడాలి.