టికెట్ రేట్ల అంశం.. ఓజీ నిర్మాతకు మరో షాక్
అంతవరకు టికెట్ రేట్లు పెరగవని స్పష్టత వచ్చింది. అంటే ప్రస్తుత టికెట్ ధరలకే సినిమా నడవాల్సి ఉంటుంది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఓజీ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అయితే టాక్ తో సంబంధం లేకుండా సినిమా కలెక్షన్ల హవా కొనసాగుతున్న తరుణంలో నిర్మాత డీవీవీ దానయ్యకు లీగల్ ఇష్యూల పరంగా మళ్లీ ఒకసారి ఎదురుదెబ్బ తగిలింది.
తెలంగాణ హైకోర్టులో ఈ చిత్రానికి సంబంధించిన టికెట్ రేట్ల అంశం మళ్లీ చర్చనీయాంశమైంది. రెండు రోజుల క్రితం హైకోర్టు సింగిల్ బెంచ్, ప్రభుత్వం ఇచ్చిన టికెట్ రేట్ల పెంపు అనుమతిని రద్దు చేసింది. ఈ నిర్ణయం నిర్మాతలకు పెద్ద షాక్ ఇచ్చింది. దానయ్య తరఫు న్యాయవాది వెంటనే రివ్యూ పిటిషన్ దాఖలు చేసి, టికెట్ ధరల పెంపు అవసరాన్ని వివరించారు.
అయితే తాజా విచారణలో హైకోర్టు తమ పూర్వ నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని, టికెట్ రేట్ల పెంపుకు ఇప్పటికీ అనుమతి లేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో నిర్మాతల ఆశలు మరోసారి తుడిచిపెట్టుకుపోయాయి. ఇక ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.
అంతవరకు టికెట్ రేట్లు పెరగవని స్పష్టత వచ్చింది. అంటే ప్రస్తుత టికెట్ ధరలకే సినిమా నడవాల్సి ఉంటుంది. దీంతో నిర్మాతల లెక్కలు కొంతవరకు తప్పిపోవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఓజీ మొదటి రోజు ఊహించని వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ పవన్ పవర్ ఘనంగా కనిపించింది.
అయితే టికెట్ రేట్లు పెంచకపోవడం వల్ల రాబోయే రోజుల్లో రికార్డులు సాధించే రీతిలో వసూళ్లు తగ్గవచ్చని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద, సినిమాకు కలెక్షన్ల పరంగా పాజిటివ్ ఫ్లో కొనసాగుతున్నప్పటికీ, లీగల్ ఫ్రంట్‌లో దానయ్యకు వచ్చిన ఈ తాజా షాక్ చర్చనీయాంశమైంది. ఇక అక్టోబర్ 9న జరిగే తదుపరి విచారణలో ఏం జరుగుతుందోనని సినీ, వ్యాపార వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.