ఓజీ విలన్.. తక్కువ అంచనా వేయకండి
ఇందులో ఓమిగా విలన్ పాత్ర చేసిన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి సామాన్యుడేమీ కాదు.;
ఓజీ సినిమాకు సంబంధించి తెలుగు ప్రేక్షకుల ఫోకస్ అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీదే ఉందనడంలో సందేహం లేదు. ఓజాస్ గంభీర పాత్రలో పవన్ వీర విధ్వంసం చూద్దామనే అభిమానులు థియేటర్లకు వెళ్తుంటారనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు ఇంత హైప్ వచ్చిందంటే.. అందుకు ప్రధాన కారణం పవన్ కళ్యాణే.
తన అభిమాన కథానాయకుడిని తన లాంటి ఫ్యాన్స్ ఎలా కోరుకుంటారో అలా చూపించి వారిని ఉర్రూతలూగించేలాగే కనిపిస్తున్నాడు సుజీత్. ఐతే పెర్ఫామెన్స్ పరంగా సినిమాలో పవన్ మాత్రమే హైలైట్ అవుతాడని అనుకుంటే పొరపాటే. ఇందులో ఓమిగా విలన్ పాత్ర చేసిన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి సామాన్యుడేమీ కాదు. గత రెండు దశాబ్దాలుగా బాలీవుడ్ సినిమాలను కాస్తో కూస్తో ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికీ హష్మి టాలెంట్ ఏంటో తెలిసే ఉంటుంది.
తొలి చిత్రం ‘మర్డర్’లో చేసిన పాత్ర వల్ల అతను ముద్దులకు పేరు పడిపోయాడు. కానీ అదే సినిమాలో అతను నెగెటివ్ షేడ్స్‌ను పలికించిన తీరు అమోఘం. ఆ తర్వాత మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో అతను ఆకట్టుకున్నాడు. కొన్ని సినిమాల్లో హీరోగా మెప్పించాడు. కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్, మరి కొన్ని సినిమాల్లో విలన్ పాత్రల్లోనూ అదరగొట్టాడు. గ్యాంగ్‌స్టర్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయి, టైగర్-3, ది డర్టీ పిక్చర్, షాంఘై, టైగర్-3 లాంటి చిత్రాల్లో తన పాత్రలను అద్భుతంగా పండించా ఇమ్రాన్ హష్మి. ‘టైగర్-3’లో అతను చేసిన విలన్ పాత్ర.. హీరో సల్మాన్ ఖాన్‌ను సైతం డామినేట్ చేసింది.
‘ఓజీ’లో ఓమి పాత్రకు ఇమ్రాన్ హష్మి పర్ఫెక్ట్ ఛాయిస్ అని తన పోస్టర్లు, టీజర్ చూస్తే ప్రేక్షకులకు అర్థమై ఉంటుంది. విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే.. హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుందనే సూత్రం సుజీత్‌కు తెలియంది కాదు. అందుకే తన అభిమాన కథానాయకుడిని ఢీకొట్టే విలన్ పాత్రను బలంగా తీర్చిదిద్ది, అందుకు తగ్గ నటుడినే ఎంచుకున్నాడని స్పష్టమవుతోంది. సినిమా రిలీజయ్యాక ఇమ్రాన్ హష్మి పెర్ఫామెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటే ఆశ్చర్యమేమీ లేదు.