వార్ 2 ప్రీరిలీజ్: ఫ్యాన్స్‌పై ఎన్టీఆర్ కోపం దేనికి?
ఇదిలా ఉంటే, వేదికపై యంగ్ టైగర్ మాట్లాడుతున్నంత సేపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను అదుపు చేయడం సాధ్యం కాలేదు.;
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించిన వార్ 2 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించింది. తెలుగు వెర్షన్ ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత నాగవంశీ విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ 25 సంవత్సరాల కెరీర్ ని పురస్కరించుకుని నాగవంశీ ఈ వేడుకను అత్యంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీరిలీజ్ కు వేలాదిగా ఎన్టీఆర్ అభిమానులు తరలి వచ్చారు.
అయితే ఈ వేదిక వద్ద యంగ్ టైగర్ ఎన్టీఆర్ రచ్చ పీక్స్ కి చేరుకోవడంతో అదుపు చేయడం పోలీసుల వల్ల కాలేదు. ఎటు చూసినా ఊక వేస్తే రాలనంతమంది ఫ్యాన్స్ కనిపించారు. ఒక రాజకీయ సభకు వచ్చినంతమంది సినిమా వేడుకకు రావడం ఆశ్చర్యపరిచింది. దాదాపు 1200 మంది పోలీసులు ఆదివారం నాడు యంగ్ టైగర్ ఈవెంట్ ని అదుపు చేసేందుకు విచ్చేసారంటే అర్థం చేసుకోవచ్చు. ఆదివారం అయినా కానీ పోలీసుల అండతో, ప్రభుత్వం అందించిన సపోర్టుతో ఈ వేడుకను నిర్వహించడం సాధ్యమైందని నిర్మాత నాగవంశీ అన్నారు.
ఈ వేదికపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్, ఫ్యాన్స్ రచ్చ ఎలా ఉంటుందో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ప్రత్యక్షంగా వీక్షించారు. ఎన్టీఆర్ మీకు అన్నయ్య అయితే నాకు తమ్ముడు! అంటూ ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచారు. అంతేకాదు..నేను రియల్ టైగర్ తో కలిసి నటించాను. అతడు దీనిని అఛీవ్ చేసాడు! అంటూ ఎగ్జయిటింగ్ గా మాట్లాడారు. ఒక ఫ్యాన్ గేదరింగ్ మీట్ అంటే ఎలా ఉంటుందో మొదటిసారి హృతిక్ తెలుసుకున్నాడు.
ఇదిలా ఉంటే, వేదికపై యంగ్ టైగర్ మాట్లాడుతున్నంత సేపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను అదుపు చేయడం సాధ్యం కాలేదు. ఫ్యాన్స్ కేకలు గోల పెడుతూ రచ్చ చేసారు. కొందరు అభిమానులు చొక్కాలు విప్పి గాల్లో ఎగరేయడం, తిప్పడం ప్రారంభించారు. ఎన్టీఆర్ మాట్లాడేప్పుడు చాలా డిస్ట్రబ్ చేసారు. అయితే ఒకానొక దశలో ఎన్టీఆర్ తన కోపాన్ని అదుపు చేసుకోవడం కష్టమైంది. అభిమానులను హెచ్చరిస్తూ .. తాను అక్కడి నుంచి వెళ్లిపోవడం ఒక్క సెకండ్ పడుతుందని హెచ్చరించారు. భృకుటి ముడివేసి అభిమానుల వైపు సీరియస్ గా చూసారు. ''ఒక్క సెకండ్ పట్టదు.. మైక్ ఇచ్చి వెళ్లిపోతాను!''అంటూ ఫ్యాన్స్ ని హెచ్చరించారు. అనంతరం తన స్పీచ్ ని కొనసాగించారు. ఇక ఈ రోజు తాను ఇంత ధైర్యంగా ఈ వేడుకకు విచ్చేసానంటే దానికి కారణం తన అభిమానులేనని ఎన్టీఆర్ అన్నారు. ఇండస్ట్రీలో పాతికేళ్ల కెరీర్ ని పూర్తి చేసుకోవడానికి అభిమానులు అందించిన ఆశీర్వచనాలే కారణమని కూడా వ్యాఖ్యానించారు.