అల్లు అర్జున్ మిస్టేక్ రిపీట్ కాకూడదని..!
సినిమాలు- రాజకీయాలు ఒకదానితో ఒకటి విడదీయలేనంతగా మిళితం అయి ఉన్నాయి.;
సినిమాలు- రాజకీయాలు ఒకదానితో ఒకటి విడదీయలేనంతగా మిళితం అయి ఉన్నాయి. తమిళనాడులో సినిమాల్ని రాజకీయాల్ని విడదీసి చూడటం కుదరదు. టాలీవుడ్ లో కొంతవరకూ ఓకే కానీ, కోలీవుడ్ లో భిన్నమైన పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా నాయకుల ఇన్వాల్వ్ మెంట్, హవాకు ఎదురే లేకుండా పోతోంది. కళారంగాన్ని శపించడం లేదా తొక్కిపట్టి ఉంచడం లాంటివి ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టినవారే చేస్తే అది ఎలా ఉంటుందో గట్టి అనుభవాలు అవుతున్నాయి. తమను వ్యతిరేకిస్తే లేదా పట్టించుకోకపోతే తాట తీస్తాం! అన్న తీరుగా ప్రభుత్వాలు, ముఖ్య నాయకులు వ్యవహరించడం విమర్శల పాలవుతోంది. గత ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ పై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. టికెట్ ధరలు సహా చాలా సమస్యల్లో తెలుగు చిత్రసీమ ప్రముఖులతో వైయస్ జగన్మోహన్ రెడ్డికి సింక్ కుదరలేదు. అది ఈగో గొడవలకు దారి తీసాక ఏం జరిగిందో చూసాం.
ఇక ఇటు తెలంగాణలోను పరిస్థితులు అందుకు భిన్నంగా లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు కూడా కొన్ని సందర్భాల్లో విస్మయం కలిగిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు సంథ్య థియేటర్ తొక్కిసలాటలో ప్రభుత్వం సీరియస్ అవ్వడం, అల్లు అర్జున్ ని ఒక రోజు రిమాండ్ కి పంపడం సంచలనంగా మారింది. పుష్ప 2 ఈవెంట్లో ప్రభుత్వాన్ని, నాయకులను చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ విస్మరించడంతో దానికి సీఎం రేవంత్ హర్ట్ అయ్యారని, అతడి ఆగ్రహం మారు రూపంలో బయటపడిందని చాలా మంది విశ్లేషించారు.
అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు తలెత్తకుండా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ జాగ్రత్త పడటం చర్చగా మారింది. ఈ ఆదివారం సాయంత్రం `వార్ 2` ప్రీరిలీజ్ వేడుక సమయంలో వేదికపై ప్రసంగించిన యంగ్ టైగర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఇతర నాయకులను, వేడుక సజావుగా సాగడానికి సహకరించిన పోలీసులను తన స్పీచ్ లో గుర్తుచేసుకోవడం, కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయారు. ఇది రేవంత్ వర్గాన్ని హర్ట్ చేసి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇంతలోనే ఎన్టీఆర్ ఒక ప్రత్యేకమైన వీడియోలో జరిగిన దానికి క్షమాపణలు కోరుతూ, ప్రభుత్వానికి, పోలీస్ అధికారులకు ధన్యవాదాలు చెప్పారు. అల్లు అర్జున్ ఆరోజు చేసిన తప్పును ఇప్పుడు తారక్ రిపీట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ పంపిన స్పెషల్ థాంక్స్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.