చరణ్ 'పేర్ల కిచిడీ' అలవాటుపై దోస్త్ తారక్ ఏం చెప్పారంటే?
భోపాల్ `పెద్ది` ఈవెంట్‌లో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్.. క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రా పేరును.. అతడు ఆడే ఆట గురించి మార్చి చెప్పడం సోషల్ మీడియాలో ఎంత పెద్ద హాట్ టాపిక్‌గా మారిందో చూస్తున్నదే.
భోపాల్ `పెద్ది` ఈవెంట్‌లో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్.. క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రా పేరును.. అతడు ఆడే ఆట గురించి మార్చి చెప్పడం సోషల్ మీడియాలో ఎంత పెద్ద హాట్ టాపిక్‌గా మారిందో చూస్తున్నదే. అయితే చరణ్‌కు ఉన్న ఈ విచిత్రమైన పేర్ల గందరగోళం గురించి ఆయన ఆప్తమిత్రుడు, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (తారక్) గతంలోనే ఒక ఇంటర్వ్యూలో లీకులు ఇవ్వడం ఇప్పుడు విశేషంగా చర్చకు వస్తోంది. ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణితో కలిసి పాల్గొన్న ఒక టీవీ షోలో రామ్ చరణ్ పేర్లను ఎలా కిచిడీ చేస్తారో తారక్ ఎంతో సరదాగా, కామిక్‌గా వివరించిన తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ పాత వీడియోని అభిమానులు తాజా ఘటనతో కలిసి సోషల్ మీడియాల్లో వైరల్ చేస్తున్నారు.
ఎదుటివారి పేర్లను గుర్తుపెట్టుకోవడంలో కొందరికి ఉండే విచిత్రమైన అలవాట్లు, వాటి వల్ల వచ్చే గందరగోళాన్ని తారక్ ఆ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. తారక్ మాటలను బట్టి.. కొంతమందికి కొత్త పేర్లు విన్నప్పుడు అవి అంత త్వరగా బుర్రకెక్కవు. ఆ పేరును అలవాటు చేసుకోవడానికి వారికి కాస్త సమయం పడుతుంది. ఉదాహరణకు తాను చరణ్ దగ్గరకు వెళ్లి `తారక్` అని పరిచయం చేసుకుంటే.. ఆ తర్వాత క్షణంలోనే చరణ్ ఆ పేరును మార్చేసి.. పక్కనున్న వారితో ``అదే.. మన `కారక్` ఏడి?`` అని పిలుస్తారని నవ్వుతూ పేర్కొన్నారు. పేర్ల విషయంలో జరిగే ఈ తారుమారు కేవలం మతిమరుపు వల్ల మాత్రమే కాదు.. వారిదైన ఒక విచిత్రమైన శైలి వల్ల కూడా జరుగుతుందని తారక్ వ్యాఖ్యానించారు.
ఇలాంటి వ్యక్తులు ఒక పేరును పలికేటప్పుడు దానికి ముందు, వెనక ఉండే అక్షరాలను కరెక్ట్‌గానే పలికినా మధ్యలోకి వచ్చేసరికి మాత్రం అసలు పేరును మార్చేసి మొత్తం `కిచిడీ` చేసేస్తారని తారక్ విశ్లేషించారు. ఈ క్రమంలోనే సినిమా పరిశ్రమకు సంబంధించిన ఒక సందర్భాన్ని గుర్తుచేస్తూ... 2021 నాటి ఒక సినిమాలోని పాట గురించి కూడా ప్రస్తావించారు. ఎవరో కొట్టిన ఒక పాటకు... ``ఇది మీరే అనుకుని అనుకుంటున్నారేమో`` అంటూ చరణ్ ధోరణిని ఉద్దేశించి జోక్ చేసారు తారక్. మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికీ ఒక నిర్దిష్టమైన పేరు ఉంటుందని, కానీ కొందరికి మాత్రం ఆ పేర్లు అస్సలు రిజిస్టర్ కావని చెబుతూ ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంతో సరదాగా ముగించారు.
అయితే ఈ విధమైన పేర్ల గందరగోళం కేవలం రామ్ చరణ్ ఒక్కరికేనా? లేక నిరంతరం బిజీగా ఉండే ప్రతి ఒక్కరి లైఫ్ పర్యవసానమా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. గ్లోబల్ స్టార్స్ గా మారిన తర్వాత సెలబ్రిటీలపై ఉండే ఒత్తిడి సాధారణమైనది కాదు. నిరంతర ప్రయాణాలు.. కథల చర్చలు.. షూటింగ్‌లు.. వందలాది మంది కొత్త వ్యక్తుల కలయికలతో వారి మెదడు ఎప్పుడూ అత్యంత బిజీగా ఉంటుంది. ఇలాంటి బిజీ లైఫ్ ఒత్తిళ్ల కారణంగానే మెదడు కొన్నిసార్లు తాత్కాలికంగా పేర్లను రిజిస్టర్ చేసుకోలేకపోతుందని... దీనిని ఒక సాధారణ మానసిక స్థితిగానే చూడాలని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.
మెదడులో కాంప్లికేటెడ్ థింగ్స్, తీవ్రమైన ఆలోచనలు ఒకేసారి రన్ అవుతున్నప్పుడు ఇలా పేర్లు తారుమారవ్వడం సహజం. రామ్ చరణ్ విషయంలోనూ ఇదే జరిగి ఉంటుందని తారక్ పాత వీడియో ద్వారా స్పష్టమవుతోంది. పెద్ది ఈవెంట్లో బుమ్రా పేరును `బుల్ బుల్రా` అని, ఫుట్‌బాలర్ అని చరణ్ అనడం వెనుక ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదని.. అది కేవలం ఆయనకు ఉన్న ఒక విచిత్రమైన, అమాయకపు అలవాటు మాత్రమేనని అభిమానులు సమర్థిస్తున్నారు. ఏదేమైనా చరణ్ ``పేర్ల గందరగోళం- కిచిడీ`` వ్యవహారాన్ని తారక్ అంతకు ముందే లీక్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో భలే ట్రెండ్ అవుతోంది. ఆర్.ఆర్.ఆర్ స్టార్ ల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రపంచానికి తెలుసు గనుక ఈ ఇంటర్వ్యూ క్లిప్ ని వీక్షిస్తే ప్రజలకు కూడా అసలు విషయం అర్థమవుతుంది. చరణ్ నటించిన పెద్ది జూన్ 4న విడుదలవుతోంది. ఉత్తరాదిన ప్రమోషన్స్ హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే.