ఎన్టీఆర్ పెళ్ళి ముచ్చట్లు..ఆమెతోనే విజయాలు !
నందమూరి తారక రామారావు తెలుగు వారి నిలువెత్తు సంతకం. ఆయన తెలుగు జాతికి ఒక అపురూప వరం.;
నందమూరి తారక రామారావు తెలుగు వారి నిలువెత్తు సంతకం. ఆయన తెలుగు జాతికి ఒక అపురూప వరం. ఎన్టీఆర్ రెండు ప్రభావంతమైన రంగాలలో తనదైన ముద్రను బలంగా వేశారు. రెండింటా అద్భుతమైన విజయాలను అందుకున్నారు. ఆయన జీవితం తెరచిన పుస్తకం. అంతే కాదు తరతరాలకూ స్పూర్తి దాయకం. కష్టపడి పనిచేస్తే ఒక సామాన్యుడు అసమాన్యుడిగా మారి ఉన్నత శిఖరాలను ఎలా చేరుకుంటాడో చాటి చెప్పేందుకు ఎన్టీఆర్ నిట్ట నిలువు ఉదాహరణగా చెబుతారు.
చిన్న వయసులోనే అలా :
ఎన్టీఆర్ పెళ్ళి రోజు 1942 మే 2వ తేదీన జరిగింది. అప్పటికి ఆయన వయసు కేవలం పందొమ్మిది ఏళ్ళు మాత్రమే. ఇంకా కాలేజీలో చదువుకుంటున్నారు. ఎన్టీఆర్ పెళ్ళి జరిగింది తన మేనమామ కూతురుతోనే. అందుకే ఈ దగ్గర సంబంధం వల్లనే రామారావు చదువుకుంటూనే పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్ పెళ్ళి శుభ లేఖ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వేళ ఇప్పటికి 84 ఏళ్ళ క్రితం నాటి అన్న గారి పెళ్ళి ముచ్చట్ల మీద అంతా ఆసక్తిని చూపిస్తున్నారు ఎన్టీఆర్ ఈ లోకాన్ని వీడి మూడు దశాబ్దాలు అయింది. అయినా ఆయన గురించి ఏ చిన్న వార్త వచ్చినా నేటి సోషల్ మీడియా యుగంలో అది హల్ చల్ చేస్తూనే ఉంది. దాంతో ఇపుడు ఆయన పెళ్ళి ముచ్చట్లు కూడా మంచి టాపిక్ గా మారిపోయాయి.
కలసి వచ్చిన అదృష్టం :
వివాహాయ విద్యా నాశాయా అని ఆర్యోక్తి ఉంది. అంటే పెళ్ళి తోనే చదువులు నాశనం అవుతాయని. ఇది ఎందుకు అంటే పాత రోజులలో చిన్న వయసు పెళ్ళిళ్ళు ఉండేవి. పెళ్ళి తరువాత చదువులు కొనసాగించాలనుకున్నా అంతగా కుదిరేవి కాదు అందుకే దీనిని ఎక్కువగా చెప్పేవారు. కానీ ఎన్టీఆర్ విషయంలో మాత్రం అది జరగలేదు. ఆయన పెళ్ళి తరువాత తన డిగ్రీని ఎంచక్కా గుంటూరులో చదివారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యారు. ఆ మీదట ఆయన నాటి బ్రిటిష్ ప్రభుత్వం సబ్ రిజిస్టార్ ఉద్యోగం కోసం నిర్వహించిన పరీక్షలకు అటెండ్ అయ్యారు. ఆ రోజులల్లోనే వేయి మంది దాకా పరీక్ష రాస్తే అందులో తొలి ఏడుగురిలో ఒకరిగా ర్యాంక్ సాధించి ఆ ఉద్యోగాన్ని ఎన్టీఆర్ దక్కించుకోవడం జరిగింది. అంటే పెళ్ళి తరువాత బసవతారకం ఆయన జీవితంలో అడుగు పెట్టిన తరువాత అంతా కలిసి వచ్చింది అనే చెబుతారు.
మంచి ప్రోత్సాహం :
ఇక సినీ రంగంలోకి ఎన్ టీఆర్ ప్రవేశించేందుకు ఆయన సతీమణి ఇచ్చిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదని కూడా చెబుతారు. ఆ విధంగా ఆమె దన్నుతోనే మద్రాస్ చేరుకుని ఎన్టీఆర్ సినీ సీమలో తన అదృష్టాన్ని పరీక్షుకున్నారు. తొలి సినిమా మనదేశంలో కానిస్టేబుల్ గా చిన్న పాత్ర వేసినా ఆ తరువాత పల్లెటూరి పిల్ల, సంసారం వంటి సినిమాలలో హీరోగా మారినా పాతాళభైరవి ఆయన సినీ జీవితాన్ని కీలక మలుపు తిప్పి ఒవర్ నైట్ స్టార్ ని చేసింది. ఇలా రామారావు విజయాలు అన్నింటి వెనక వెన్ను దన్నుగా బసవ తారకం ఉన్నారు అని చెప్పాలి. అలాగే ఆయన సినిమా రంగంలో చేసిన ప్రయోగాలకు ఆయన దర్శకత్వం చేసిన చిత్రాల వెనక ఆమె ఇచ్చిన ప్రోత్సాహం ఉందని అంటారు. దాన వీర శూర కర్ణ మూవీని కేవలం 40 రోజులలో రామారావు తీస్తే ఇంటికి కూడా రాకుండా స్టూడియోలో గడిపితే ఆమె అన్ని విధాలుగా ఆయన్ని కనిపెట్టుకుని ఉన్నారని కూడా చెబుతారు.
క్లాప్ కొట్టిన సతీమణి :
ఇక ఎన్టీఆర్ చిత్రాలలో కొన్నిటికి బసవతారకం క్లాప్ కొట్టి శుభారంభం పలికారు. అందులో 1978లో వచ్చిన సింహబలుడు జానపద మూవీ ఒకటి. ఇది రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చింది. అలాగే వేటగాడు సినిమా శత జయంతి వేడుకలకు ఎన్టీఆర్ తో పాటు ఆమె అటెండ్ అయి ఆద్యంతం కార్యక్రమాన్ని తిలకించారు. తన సతీమణి బసవతారకం మీద ఎన్టీఆర్ కి ఎంత ప్రేమ అంటే ఆమె పేరుతో శ్రీమతి మూవీ కంబైన్స్ అని బ్యానర్ ని స్థాపించి శ్రీనాధ కవి సార్వభౌముడు చిత్రాన్ని బాపు దర్శకత్వంలో నిర్మించారు.
స్ఫూర్తి దాయకంగా :
ఆఖరుకు అన్న గారి రాజకీయ నిర్ణయం వెనక కూడా ఆమె ప్రోత్సాహం ఉందని అంటారు. మొత్తానికి నాలుగు దశాబ్దాల పై చిలుకు వివాహ బంధం ఎన్టీఆర్ బసవతారకం ది. 1984లో ఆమె దివంగతులు అయ్యారు. అప్పటికి ఎన్టీఆర్ నాదెండ్ల భాస్కరరావు చేతిలో వెన్నుపోటుకు గురి అయి అధికారం కోల్పోయి రాష్ట్రమంతా తిరిగి తన ముఖ్యమంత్రి పదవిని మరోసారి అందుకున్నారు. ఆ సంతోషం అలా పూర్తిగా ఉండకుండానే సతీమణి కన్నుమూయడం అన్న గారికి జీవిత కాలం బాధగా మిగిలింది. ఏది ఏమైనా ఎన్టీఆర్ పెళ్ళి ముచ్చట్లు అంటే ఈ తరానికి స్పూర్తి దాయకం అనే చెప్పాలి. భార్యాభర్తలు ఎలా ఉండాలి అన్న దానికి ఈ దంపతులే మచ్చు తునక అని చెబుతారు.