సినిమా నిర్మాణం షేర్ మార్కెట్ లా!

చిత్రం నిర్మాణంలో ఉండగానే లాభాలు పిండుకోవాలనే తాపత్రయం పెరుగుతోందని.. ప్రస్తుతం సినిమా బిజినెస్ ఓ రకంగా స్టాక్ మార్కెట్ కల్చర్‌ను పోలి ఉంద‌ని విశ్లేషించారు.

Update: 2026-09-11 11:30 GMT

భార‌తీయ సినీ పరిశ్రమ బ‌డ్జెట్ ఎలా పెరిగిపోతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. కంటెంట్ పై న‌మ్మ‌కంతో వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు. మ‌రో నాలుగైదేళ్ల‌లో ఇదే బ‌డ్జెట్ వేల కోట్ల‌కు ఎగ బాకుతుంద‌న‌డంలో సందేహం లేదు.

అయితే ఈ ఎదుగుదల వెనుక ఉన్న వ్యాపార నమూనా ఓ ప్రమాదకరమైన ధోరణికి దారితీస్తోందన్న‌ది అంతే వాస్త‌వం. తాజాగా ఇదే అంశంపై బాలీవుడ్ డైరెక్ట‌ర్ నిఖిల్ అద్వానీ త‌న అభిప్రాయాన్ని ఓపెన్ గా పంచుకున్నారు.

చిత్రం నిర్మాణంలో ఉండగానే లాభాలు పిండుకోవాలనే తాపత్రయం పెరుగుతోందని.. ప్రస్తుతం సినిమా బిజినెస్ ఓ రకంగా స్టాక్ మార్కెట్ కల్చర్‌ను పోలి ఉంద‌ని విశ్లేషించారు.

గతంలో సినిమా విజయం అనేది థియేటర్లలో ప్రేక్షకులకు అది ఎంతగా నచ్చిందనే దానిపై ఆధారపడి ఉండేది. కానీ నేటి డిజిటల్ యుగంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నాన్-థియేట్రికల్ హక్కులైన ఓటీటీ , శాటిలైట్, మ్యూజిక్ హక్కుల రూపంలో సినిమా విడుదల కాకముందే కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. దీంతో థియేట్రికల్ రన్‌తో సంబంధం లేకుండానే నిర్మాతలు లాభాల బాట పడుతున్నారు. ఇది పైకి మంచి వ్యాపార నమూనాగా అనిపించినా? సినిమా అసలు ఆత్మను దెబ్బ‌తీస్తోంది.

స్టాక్ మార్కెట్‌లో షేర్ల ధరలు కేవలం అంచనాలు, ఊహాగానాల ఆధారంగా ఎలాగైతే ఒడిదుడుకులకు లోనవుతుంటాయో? నేటి సినిమా బిజినెస్ కూడా అదే రీతిలో నడుస్తోంది. కాంబినేషన్లు, క్రేజ్, ముందస్తు ప్రచారాన్ని చూసి 200 కోట్లు, 300 కోట్ల వ్యాపారాలు జరిగిపోతున్నాయి. కానీ థియేటర్లలో విడుదలయ్యాక కంటెంట్‌లో దమ్ము లేకపోతే ఆ సినిమా దారుణంగా విఫలమవుతోంది. దీంతో కొనుగోలుదారులు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోతుండగా, ముందస్తుగా హక్కులు విక్రయించిన నిర్మాతలు మాత్రం సురక్షితంగా బయట పడుతున్నారు.

ఈ ధోరణి వల్ల సినిమా కథ, నాణ్యత కంటే కూడా బిజినెస్ మోడల్ మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. నటీనటుల పారితోషికాలు ఆకాశాన్ని తాకడం, ప్రమోషన్ల పేరిట విచ్చలవిడిగా ఖర్చు చేయడం వల్ల బడ్జెట్లు హద్దులు దాటుతున్నాయి. ప్రాజెక్ట్ గ్రీన్-లైట్ అవ్వడానికి కథ బలం కన్నా? ఓటీటీ సంస్థలు ఎంత ఆఫర్ చేస్తున్నాయనే అంశమే ప్రామాణికంగా మారుతోందన్నాఉ. ఫలితంగా క్రియేటివిటీ వెనుకబడి అంకెల గేమ్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది.

అయితే ఈ రకమైన ఓవర్ వాల్యుయేషన్ సుస్థిరం కాదని నిఖిల్ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ సంస్థలు వ్యూ హాలను మార్చుకుంటూ డిజిటల్ హక్కుల కొనుగోలులో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కాంబినేషన్లను చూసి కాకుండా థియేట్రికల్ విజయం సాధించిన తర్వాతే డిజిటల్ హక్కుల ధరను నిర్ణయించే పద్ధతిని కొన్ని సంస్థలు ప్రారంభించాయి. ఈ మార్పు సినీ రంగానికి ఎంతో అవసరమని.. లేకపోతే నాణ్యమైన సినిమాలు రావడం తగ్గిపోతుందని అంచ‌నా వేసారు.

సినిమా అనేది వ్యాపార సరుకు మాత్రమే కాదు. అదొక కళారూపం. షేర్ మార్కెట్ లాగా ముందస్తు ఊహాగానాల ఆధారంగా నడిచే బిజినెస్ మోడల్ తాత్కాలికంగా లాభాలను అందించొచ్చు. కానీ సుదీర్ఘకాలంలో పరిశ్రమ ఆరోగ్యానికి ఇది హానికరం. ప్రేక్షకుల అభిమానం, కథలోని సత్తా మాత్రమే సినిమా అసలైన విలువను నిర్ణయించాలి. నిర్మాతలు ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలకే ప్రాధాన్యం ఇవ్వకుండా కంటెంట్‌పై దృష్టి సారించినప్పుడే టాలీవుడ్, బాలీవుడ్ సహా అన్ని చిత్ర పరిశ్రమలు ఆరోగ్యకరమైన బాటలో పయనిస్తాయి.

Tags:    

Similar News