డిసెంబర్ 3 వచ్చేదెవరు? కొట్టేదెవరు?
బాక్సాఫీస్ వద్ద ఏడాది ముగింపు సమయానికి సిద్ధమవుతున్న డిసెంబర్ మొదటి వారం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
బాక్సాఫీస్ వద్ద ఏడాది ముగింపు సమయానికి సిద్ధమవుతున్న డిసెంబర్ మొదటి వారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా డిసెంబర్ 3వ తేదీ లక్ష్యంగా చేసుకుని పలు భారీ చిత్రాల విడుదలకు నిర్మాతలు వ్యూహాలు సిద్దంచ ఏస్తున్నారు. దీంతో డిసెంబర్ 3న వచ్చేదెవరు? బాక్సాఫీస్‌ను కొట్టేదెవరు? అనే ప్రశ్న ట్రేడ్ వర్గాల్లోనూ.. సినీ ప్రియుల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. ప్రణాళికలు నిరంతరం మారుతున్న నేపథ్యంలో ఈ తేదీ చుట్టూ పోటీ నెలకొంది.
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా `ఫౌజీ` డిసెంబర్ 3న విడుదలవుతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా భారీ గ్రాఫిక్స్ పనుల కారణంగా ఆ తేదీకి రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ `ఫౌజీ` రేసు నుండి తప్పుకుంటే? ఆ స్లాట్‌ను దక్కించుకోవడానికి ఇతర పెద్ద చిత్రాల నిర్మాతలు పోటీపడుతున్నారు.
ప్రభాస్ సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తుండటంతో మెగాస్టార్ చిరంజీవి సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం `విశ్వంభర`ను అదే డిసెంబర్ 3 తేదీకి థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న విజువల్ వండర్ సినిమాను సరైన పండుగ వాతావరణంలో విడుదల చేయాలని భావిస్తుండటంతో సోలో రిలీజ్ డేట్‌గా డిసెంబర్ 3 అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
పెద్ద సినిమాలే కాకుండా యువ హీరోలు కూడా ఇదే వారాంతాన్ని టార్గెట్ చేస్తున్నారు. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న మైథలాజికల్ థ్రిల్లర్ `వృషకర్మ` డిసెంబర్ 3 లేదా 4 తేదీల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమాపై నాగచైతన్య అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ రేసులో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీని ఇచ్చేందుకు ఈ చిత్రం సిద్ధమవుతోంది.
మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటిస్తోన్న పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా `లెగసీ`, దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తోన్న `శ్రీశ్రీ` చిత్రాలు కూడా డిసెంబర్ 3, 4 తేదీలను లాక్ చేసుకునేందుకు లైన్లో ఉన్నాయి. వైవిధ్యమైన కథాంశాలతో వస్తున్న ఈ రెండు చిత్రాలు డిసెంబర్ రేసులో నిలిస్తే పోటీ మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం. ఒకే వారంలో ఇన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవడం టాలీవుడ్‌లో వేడి పుట్టిస్తోంది. ఇదే నెలలో `దాదా`, `కింగ్` వందవ చిత్రం, `రౌడీ జనార్దన` లాంటి చిత్రాలు కూడా రేసులో ఉన్నాయి.
మొత్తానికి డిసెంబర్ మొదటి వారం బాక్సాఫీస్ వద్ద ఏ పెద్ద సినిమా నిలుస్తుంది? ఏవి వెనక్కి తగ్గుతాయనే దానిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత వస్తుంది. `ఫౌజీ` నిజంగానే వాయిదా పడితే `విశ్వంభర`కు మార్గం సుగమమవుతుంది. లేదంటే యువ హీరోల చిత్రాల మధ్య గట్టి పోటీ తప్పదు. ఏది ఏమైనా డిసెంబర్ 3వ తేదీ టాలీవుడ్‌లో ఓ పెద్ద సమరం మాత్రం తద్యం.