సూరికి నిజంగా అంత మార్కెట్‌ ఉందా?

తాజాగా సూరి మండాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాకు నెగటివ్‌ రివ్యూలు వస్తున్నాయి.

Update: 2026-09-11 09:30 GMT

టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ అనే తేడా లేకుండా హీరోల పారితోషికాలు ఏ స్థాయిలో పెరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా తర్వాత ఓటీటీ మార్కెట్‌ విపరీతంగా పెరగడంతో హీరోల పారితోషికాలను నిర్మాతలు పెద్ద ఎత్తున పెంచారు. టాలీవుడ్‌ నిర్మాతల్లో మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు మరికొన్ని నిర్మాణ సంస్థల వారు హీరోలకు ఎక్కువ పారితోషికం ఇస్తారు అనే పుకారు ఉంది. అయితే వారు మాత్రం హీరో ఇమేజ్‌ను బట్టి, వారి మార్కెట్‌ను బట్టి పారితోషికం ఇస్తామని, హీరోల కోసమే ప్రేక్షకులు సినిమాలకు వస్తారు కనుక, వారికి పారితోషికం విషయంలో లోటు ఉండకూడదు అంటారు. చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా అందరూ హీరోలకు ఈ మధ్య కాలంలో పారితోషికం భారీగా పెరిగింది. అయితే కొందరి సినిమాల మార్కెట్‌కి తీసుకునే పారితోషికంకు సంబంధం ఉండటం లేదు అనే విమర్శలు ఉన్నాయి. తమిళ హీరో సూరితో ఒక సినిమాను ప్లాన్‌ చేస్తున్న మైత్రి వారు భారీ పారితోషికం ఇస్తున్నారనే పుకార్లు గుప్పుమంటున్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో సూరి మూవీ...

కోలీవుడ్‌లో సూరి కింది స్థాయి నుంచి వచ్చిన విషయం తెల్సిందే. రోజుకు వెయ్యి, రెండు వేల రూపాయల పారితోషికం తీసుకునే స్థాయి నుంచి స్టార్‌ కమెడియన్‌గా ఎదిగి, ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. విడుదల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సూరికి టైం కలిసి వచ్చింది. చాలా తక్కువ సమయంలోనే హీరోగా ఎక్కువ సినిమాలు చేసే అవకాశం దక్కింది. సక్సెస్‌ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా సూరి సినిమాలు వరుసగా చేస్తూనే ఉన్నాడు. తమిళ్‌లోనే కాకుండా తెలుగులోనూ సూరికి గుర్తింపు ఉంది. సూరి నటించిన కొన్ని సినిమాలు తెలుగులో ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా కమెడియన్‌గా సినిమాలు చేసిన సమయంలోనూ సూరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. అందుకే మైత్రి మూవీ మేకర్స్‌ వారు సూరికి భారీ పారితోషికంను ఆఫర్‌ చేసి సినిమాను చేసేందుకు రెడీ అయ్యారనే వార్తలు వస్తున్నాయి.

హీరో సూరి పారితోషికం...

సూరి హీరోగా రవికుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న సినిమా విశేషాలు అధికారికంగా బయటకు రాలేదు. కానీ తమిళ, తెలుగు మీడియాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 2015 చెన్నై వరదల నేపథ్యంలో సినిమా కథ సాగబోతుందట. అంతే కాకుండా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నందుకు గాను సూరికి మైత్రి మూవీ మేకర్స్ వారు దాదాపుగా రూ.25 కోట్ల పారితోషికంను ఇవ్వనున్నట్లుగానూ పుకార్లు వినిపిస్తున్నాయి. కోలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే మార్కెట్‌ క్రియేట్‌ చేసుకుంటూ, తెలుగు ప్రేక్షకులు ఇంకా కమెడియన్‌గానే చూస్తున్న సూరికి అంత పారితోషికం ఏంట్రా బాబు అని సోషల్‌ మీడియాలో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇది నిజమేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. సూరికి ఉన్న మార్కెట్‌ ను బట్టి చూస్తే కచ్చితంగా ఈ పారితోషికం అనేది ఒట్టి పుకారే అయ్యి ఉంటుంది. సూరి సినిమా ఇంకా మీడియం రేంజ్ మార్కెట్‌లోనే ఉంది. కనుక పాతిక కోట్ల పారితోషికం అంటే కచ్చితంగా నిర్మాతలు రిస్క్‌ చేయడమే అవుతుంది.

మండాడి సినిమాతో వచ్చిన సూరి, సుహాస్‌..

తాజాగా సూరి మండాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాకు నెగటివ్‌ రివ్యూలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను పెద్దగా పట్టించుకునే వారు లేరు. సినిమాలో తెలుగు నటుడు సుహాస్ నటించడం వల్ల ఇక్కడ రిలీజ్ అయిందని, సుహాస్ లేకుంటే తెలుగులో ప్రస్తుతం ఉన్న పోటీకి అసలు రిలీజ్ అయ్యే అవకాశం ఉండేది కాదని కొందరు అంటున్నారు. సూరి కి మార్కెట్‌ ఇంకా క్రియేట్‌ కావాల్సి ఉంది. కోలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే హీరోగా అడుగులు వేస్తున్న సూరికి పాతిక కోట్ల పారితోషికం అనేది పూర్తిగా అవాస్తవం అయ్యి ఉంటుంది. సూరి సినిమా మొత్తం బడ్జెట్‌ పాతిక కోట్లు అంటే నమ్మశక్యంగా ఉంది కానీ, ఆయన పారితోషికం పాతిక కోట్లు అంటే నమ్మశక్యంగా లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయమై మైత్రి మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Tags:    

Similar News