ఇరుముడి ట్విస్ట్‌ను కాపాడిన కాస్టింగ్!
ఎమ్మెల్యే పాత్రను మొదటి నుంచి నెగటివ్ షేడ్ ఉన్న నటుడితో చేయించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.
‘ఇరుముడి’లో చివరి వరకు దాచిన ఎమ్మెల్యే ట్విస్ట్‌నే చాలామందికి పెద్ద షాక్‌గా మారింది. అప్పటివరకు చాలా సౌమ్యంగా, ఎలాంటి అనుమానం రాని విధంగా కనిపించిన ఆ పాత్ర వెనుక అంత క్రూరత్వం ఉందని బయటపడే సీన్ కథను ఒక్కసారిగా మరో వైపు తిప్పింది. ఆ ట్విస్ట్ పని చేయడానికి రైటింగ్‌తో పాటు కాస్టింగ్ కూడా పెద్ద కారణమైంది.
ఎమ్మెల్యే పాత్రను మొదటి నుంచి నెగటివ్ షేడ్ ఉన్న నటుడితో చేయించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ రమేష్ ఇందిరను ఆ పాత్రకు తీసుకోవడంతో ప్రేక్షకులకు ముందుగా ఎలాంటి అనుమానం రాలేదు. సినిమాలో ఆయన చాలా సౌమ్యంగా కనిపిస్తారు. అందుకే క్లైమాక్స్ దగ్గర అసలు విషయం బయటపడినప్పుడు ఆ షాక్ మరింత బాగా హైలెట్ అయ్యింది.
రీసెంట్ గా అజయ్ ఘోష్ చెప్పిన విషయం ఆసక్తికరంగా మారింది. ‘ఇరుముడి’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మాట్లాడుతూ, మొదట ఎమ్మెల్యే పాత్రను తనతో చేయించాలని అనుకున్నారని ఆయన వెల్లడించారు. ఆ పాత్ర తనకు కూడా నచ్చిందన్నారు. అయితే తర్వాత దర్శకుడు శివకు ఒక సందేహం వచ్చిందట. అజయ్‌ను ఆ పాత్రలో పెడితే ప్రేక్షకులు ముందే ఏదో ఊహించేస్తారేమోనని అనిపించిందని చెప్పారు.
అజయ్ ఘోష్ గతంలో చేసిన చాలా పాత్రల్లో నెగటివ్ షేడ్స్, రఫ్ నేచర్, అనుమానం కలిగించే క్యారెక్టర్స్ ఉన్నాయి. అందుకే ఆయన ఎమ్మెల్యేగా కనిపిస్తే.. ఇతన్ని ఇంత సైలెంట్‌గా ఎందుకు చూపిస్తున్నారు? అనే డౌట్ ముందే రావచ్చు. కథలో అసలు ట్విస్ట్ ఎక్కడుందో వెతికే ప్రేక్షకులకు అది చిన్న క్లూ ఇచ్చినట్టే అయ్యేది. అక్కడే సస్పెన్స్ కొంత తగ్గిపోయే ప్రమాదం ఉండేది.
అయితే అజయ్ మరో విషయం కూడా చెప్పారు. తనతో అనుకున్నప్పుడు ఎమ్మెల్యే క్యారెక్టరైజేషన్ ఇప్పుడున్న విధంగా లేదన్నారు. తన కోసం వేరే స్టైల్‌లో ఆ పాత్రను అనుకున్నారని చెప్పారు. అంటే నటుడిని మార్చడం మాత్రమే కాదు, తర్వాత ఆ పాత్ర డిజైన్ కూడా మారింది. సౌమ్యంగా కనిపిస్తూ చివర్లో అసలు రూపం బయటపడేలా మార్చడం వల్లే ఇప్పుడు ఉన్న ట్విస్ట్‌కు అంత ఎఫెక్ట్ వచ్చింది.
అయితే ఆ పాత్రను కాదని ఎర్రజీ క్యారెక్టర్ చేయించగా మొదట తాను చేయనని అన్నట్లు అజయ్ చెప్పాడు. ఇక మైత్రి చెర్రీ మాట్లాడగానే చేసినట్లు చెప్పారు. ఎర్రజీ పాత్ర కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమాలో ట్విస్ట్ లకు అతనికి సంబంధం ఉంది అనేలా దర్శకుడు అనుమానాలను క్రియేట్ చేశాడు. నిజానికి ఒక థ్రిల్లర్‌లో ట్విస్ట్ ఎంత బాగా రాశారన్నదే కాదు, ఆ ట్విస్ట్‌కు ఎవరిని తీసుకున్నారన్నది కూడా అంతే ముఖ్యం. ‘ఇరుముడి’ విషయంలో అజయ్ ఘోష్‌ను తీసుకోకుండా వెనక్కి తగ్గిన నిర్ణయం చివరకు కథకే ఉపయోగపడింది.