గాజా యుద్ధంపై ఇజ్రాయెల్ దర్శకుల సంచలన చిత్రం!

వెనిస్‌లో మీడియా మీట్ లో దర్శకుడు యువాల్ అబ్రహం కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు రివీల్ చేసారు. సైనికులు అక్కడి యుద్ధ వాతావరణంలో తాము ఏం చేసారో?

Update: 2026-09-11 07:30 GMT

వెనిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో గాజాలోని పాలస్తీనియన్ల నిర్బంధాలు, సామూహిక హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఇజ్రాయెలీ డాక్యుమెంటరీ చిత్రం `నాజా` చరిత్ర సృష్టించింది. ఆస్కార్ అవార్డు గ్రహీతలైన ఇజ్రాయెల్ దర్శకులు యువాల్ అబ్రహం -రాచెల్ స్జోర్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ప్రీమియర్ ప్రదర్శన అనంతరం ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో స్పందన లభించింది. చలనచిత్రోత్సవంలో ప్రదర్శన ముగిసిన వెంటనే ఆడిటోరియంలోని ప్రేక్షకులు, విమర్శకులు ఏకంగా 25 నిమిషాల పాటు నిలబడి చప్పట్లతో చిత్ర బృందాన్ని ప్రశంసించారు.

ఈ రికార్డు స్థాయి స్పందన వెనిస్ చలనచిత్రోత్సవ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైనదిగా భావిస్తున్నారు. గత ఏడాది పాలస్తీనా చిన్నారి మరణం ఆధారంగా తెరకెక్కిన `ది వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్` చిత్రానికి లభించిన 23 నిమిషాల చప్పట్ల రికార్డును `నాజా` డాక్యుమెంటరీ అధిగమించింది. అంతేకాదు రెడ్ కార్పెట్ వద్దకు చిత్ర దర్శకులు నడుచుకుంటూ వస్తున్న సమయంలో స్పాట్ లో గుమిగూడిన జనం ఫ్రీ పాలస్తీనా, ఫ్రీ ఇజ్రాయెల్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ ప్రదర్శనతో చలనచిత్రోత్సవంలో అత్యున్నత పురస్కారం కోసం పోటీపడుతున్న చిత్రాల్లో `నాజా` ముందు వరుసలో ఉంది.

ఈ డాక్యుమెంటరీ చిత్రం వెనుక ఎంతో లోతైన పరిశోధన , ప్రమాదకరమైన చిత్రీకరణ దాగి ఉన్నాయి. గాజా యుద్ధంలో స్వయంగా పాల్గొన్న ఇంటెలిజెన్స్ అధికారులు, సైనికులతో సహా 24 మంది ఇజ్రాయెల్ సైనిక విభాగానికి చెందిన అంతర్గత వ్యక్తుల వాంగ్మూలాల ఆధారంగా తెరకెక్కించారు. టెల్ అవీవ్‌లోని భవనాల భవంతి పైకప్పులపై అత్యంత రహస్యంగా మూడేళ్ల పాటు చిత్రీకరణ జరిపారు. సమాచారం అందించిన వ్యక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారి ముఖాలను, స్వరాలను డిజిటల్ విధానంలో మార్చడం జరిగింది.

వెనిస్‌లో మీడియా మీట్ లో దర్శకుడు యువాల్ అబ్రహం కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు రివీల్ చేసారు. సైనికులు అక్కడి యుద్ధ వాతావరణంలో తాము ఏం చేసారో? వివరించమని మాత్రమే అడిగామని తెలిపారు. యుద్ధ వ్యూహాలు, అక్కడ ఏం జరిగిందో వివరంగా వర్గీకరించమని కోరినప్పుడు వారి నుండి లభించిన సమాధానాలే ఈ చిత్రానికి ప్రాణంగా నిలిచాయన్నారు. సైనికుల నోటి నుంచే నిజాలను ప్రపంచానికి తెలియజేయడం ఈ డాక్యుమెంటరీ ప్రత్యేకతగా పేర్కొన్నారు.

నాజా అనే పేరు కూడా సైనిక పరిభాష నుంచి తీసుకున్నదే. ఇజ్రాయెల్ సైన్యంలో పురుషులు, మహిళలు , పిల్లలతో సహా సామాన్య పౌర మరణాలను సంకేతంగా సూచించడానికి ఉపయోగించే మిలిటరీ సంక్షిప్త పదం అక్రోన‌మీ నుంచి ఈ పేరును ఎంచుకున్నారు. 2023 -25 మధ్యకాలంలో `972 మేగజైన్`, `లోకల్ కాల్` ,`ది గార్డియన్`0 పత్రికలు ప్రచురించిన దర్యాప్తు కథనాల ఆధారంగా డాక్యుమెంటరీని విస్తృతంగా మలచడం జరిగింది.

సాధారణంగా అంతర్జాతీయ సినీ వేదికలపై చిత్రాలకు లభించే సుదీర్ఘ చప్పట్ల సమయాన్ని బట్టి ఆ చిత్రం కలిగించిన ఇంపాక్ట్‌ను అంచనా వేస్తుంటారు. ఆ కోణంలో చూస్తే `నాజా` డాక్యుమెంటరీకి లభించిన 25 నిమిషాల ప్రాధాన్యత ప్రపంచవ్యాప్తంగా సినీ విమర్శకులను, ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంద‌ని విశ్లేషకులు భావిస్తున్నారు. గాజాలో పౌరుల ఆవేదనను, యుద్ధ తీవ్రతను ఇజ్రాయెల్ సైనికుల కోణం నుంచే ఎత్తిచూపడం చిత్ర విశేషంగా నిలిచింది.

Tags:    

Similar News