నిధి ది గ్రేట్: చ‌ద్ద‌న్నం కార‌ణంగా అంత ముద్దొస్తోంది!

నిధి అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... గత ఏడాది కాలంగా తన ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ చద్దన్నమేనని తెలిపారు.;

Update: 2026-05-01 03:00 GMT

సౌందర్యానికి, ఫిట్‌నెస్‌కు కేవలం ఖరీదైన డైట్ ప్లాన్‌లు మాత్రమే అవసరం లేదని.. మన ఇంటి పాతకాలపు వంటకాలు కూడా అద్భుతాలు చేస్తాయని నిధి అగర్వాల్ నిరూపిస్తున్నారు. బూరె బుగ్గలు, కాటుక కళ్లు, ఒంపుసొంపుల నడుముతో కుర్రకారును మంత్రముగ్ధులను చేసే ఈ భామ తన గ్లామర్ రహస్యం `చద్దన్నం` అని వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వేకువఝామునే చద్దన్నం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అపారమని, ఇది శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుందని ఆమె తన అనుభవాన్ని షేర్ చేసారు.

నిధి అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... గత ఏడాది కాలంగా తన ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ చద్దన్నమేనని తెలిపారు. షూటింగ్ సెట్స్‌లో అందరూ మోడ్రన్ డైట్ ఫుడ్ తింటుంటే.. తాను మాత్రం క్యారేజ్‌లో చద్దన్నం తెచ్చుకుని తినడం చూసి యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోతుంటారని నిధి నవ్వుతూ చెప్పారు. చద్దన్నంలో ఉండే ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయని.. కరోనా వంటి వైరస్‌ల నుండి రక్షణనిస్తాయని గతంలో వైద్యులు కూడా పేర్కొన్నారు. నిధి తన ఆహారంలో చద్దన్నంతో పాటు ప్రొటీన్ కోసం కోడిగుడ్లను కూడా తీసుకుంటూ పక్కాగా ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్నారు.

కెరీర్ పరంగా చూస్తే.. పవన్ కళ్యాణ్ సరసన నటించిన `హరి హర వీరమల్లు` నిధి కెరీర్ లో భారీ సినిమా.. కానీ ఆశించిన ఫ‌లితం రాలేదు. అయినా కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం కాకుండా.. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తానొక పర్ఫార్మర్ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల్లో లక్కీ ఛార్మ్‌గా మారిన నిధి ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించిన‌ `ది రాజా సాబ్` కూడా తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ప్ర‌స్తుతం నిధి త‌న త‌దుప‌రి సినిమాల‌పై దృష్టి సారించింది.

ప్ర‌స్తుత‌ ఆధునిక ప్ర‌పంచం అన‌వ‌స‌ర‌ పోకడలకు పోకుండా మన సంప్రదాయ ఆహారపు అలవాట్లే మిమ్మల్ని అందంగా ఉంచుతాయని నిధి అగర్వాల్ చెప్పడం విశేషం. చద్దన్నం లాంటి స్వదేశీ ఆహారం వల్ల మంచి నిద్ర పడుతుందని, అది మానసిక ప్రశాంతతను ఇచ్చి ముఖంలో గ్లో పెంచుతుందని నిధి నిరూపించారు. గ్లామర్ ఫీల్డ్‌లో ఉంటూ కూడా ఇలాంటి సింపుల్ లైఫ్ స్టైల్‌ను అలవర్చుకోవడం వల్లే `నిధి ది గ్రేట్` అనిపించుకుంటున్నారు. త‌దుప‌రి చిత్రాలతో మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News