నేపాల్ వరద బాధితులకు బాలీవుడ్ మద్దతు: అంతర్జాతీయ సాయం కోరిన మనీషా కొయిరాలా

ఈ విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడానికి బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు- తారలు తమ వంతు మద్దతును ప్రకటిస్తూ ముందుకు వస్తున్నారు.

Update: 2026-08-31 04:42 GMT

హిమాలయాల ఒడిలో ఉండే నేపాల్‌ను ఇటీవల సంభవించిన భారీ మెరుపు వరదలు తీవ్రంగా దెబ్బతీశాయి. నేపాల్-టిబెట్ సరిహద్దు పర్వత ప్రాంతాల్లో ఒక్కసారిగా విరుచుకుపడిన ఈ ప్రకృతి విపత్తు వల్ల మైళ్ల కొద్దీ ప్రాంతం జలమయమై బుర‌ద‌లో కూరుకుపోయింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ భయానక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 800కి చేరగా 3,000 మందికి పైగా ప్రజలు గల్లంతయ్యారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడానికి బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు- తారలు తమ వంతు మద్దతును ప్రకటిస్తూ ముందుకు వస్తున్నారు.

నేపాల్ మూలాలున్న ప్రముఖ బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా ఖాట్మండులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని అంతర్జాతీయ సమాజానికి భావోద్వేగ విజ్ఞప్తి చేశారు. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమ దేశాన్ని ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు తక్షణమే స్పందించాలని కోరారు. ఆపదలో ఉన్న ప్రజలకు ప్రాథమిక సహాయంతో పాటు పునరావాస చర్యలు అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని... నేపాల్ మళ్లీ కోలుకోవడానికి అంతర్జాతీయ మద్దతు ఎంతో అవసరమని ఈ న‌టి స్పష్టం చేశారు.

వరద నష్టం నుండి తేరుకోవడానికి ఆర్థిక ఊరట మాత్రమే సరిపోదని... నేపాల్ జీవనాధారమైన పర్యాటక రంగాన్ని పునరుద్ధరించడం అత్యంత కీలకమని మనీషా కొయిరాలా గుర్తుచేశారు. ``మా దేశానికి పర్యాటకమే ప్రాణాధారం. నేపాల్ అంటే కేవలం విపత్తులు ఎదుర్కొనే దేశంగా మాత్రమే కాకుండా.. హిమాలయాలు, గొప్ప సంస్కృతి - అందమైన ప్రకృతికి నిలయంగా గుర్తించాలి`` అని పేర్కొన్నారు. పర్యాటకులు మళ్లీ నేపాల్‌ను సందర్శించడం ద్వారానే స్థానిక ప్రజల జీవనోపాధి పుంజుకుంటుందని.. విదేశీ ప్రయాణికులు ధైర్యంగా ఇక్కడికి రావాలని మ‌నీషా కొయిలారా విజ్ఞప్తి చేశారు.

ఇదే వేదికగా వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రమాదాలపై మనీషా ఆందోళన వ్యక్తం చేశారు. గ్లోబల్ వార్మింగ్ అనేది ఏదో దూరపు సమస్య కాదని.. మన కళ్ల ముందే జరుగుతున్న పర్యావరణ విపత్తు అని హెచ్చరించారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను భవిష్యత్తులో అడ్డుకోవడానికి పొరుగు దేశాలైన భారతదేశం, చైనా , నేపాల్ కలిసికట్టుగా ఉమ్మడి చర్యలు చేపట్టాలని ఆకాంక్షించారు. సరిహద్దులతో సంబంధం లేకుండా పర్యావరణ పరిరక్షణ కోసం మూడూ దేశాలు చేతులు కలపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

మరోవైపు నేపాల్‌లో చిక్కుకున్న భారతీయ పౌరులను రక్షించేందుకు భారత ప్రభుత్వం వేగంగా స్పందించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఏ) అందించిన వివరాల ప్రకారం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న 149 మంది భారతీయ పౌరులను సహాయక బృందాలు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. బాలీవుడ్ నటుల పిలుపుతో పాటు పొరుగు దేశాల సహకారం- అంతర్జాతీయ సహాయం అందితే నేపాల్ ఈ మహా విపత్తు నుంచి త్వరలోనే సురక్షితంగా బయటపడగలదని ఆశిస్తున్నారు.

సోను సూద్ ఎప్ప‌టిలాగే..

నేపాల్‌లో సంభవించిన వినాశకరమైన వరదలు అపార నష్టాన్ని- తీవ్ర విషాదాన్ని నింపిన వేళ బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒకటై తమ దిగ్భ్రాంతిని, సానుభూతిని వ్యక్తం చేసింది. మనీషా కొయిరాలా, సోనూ సూద్, అనుపమ్ ఖేర్, సంజయ్ దత్ , కృతి సనన్ వంటి పలువురు ప్రముఖ నటీనటులు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ.. ఈ ఘోర విపత్తులో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు, వారి కుటుంబాలకు తమ సానుభూతిని తెలియజేయడంతో పాటు గల్లంతైన వారు క్షేమంగా తిరిగి రావాలని .. సహాయక చర్యలు వేగంగా జరగాలని ఆకాంక్షిస్తూ ప్రార్థించారు.

Tags:    

Similar News